ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ చరిత్ర!
57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్ సిరీస్
తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ‘మయసభ’ సరికొత్త చరిత్ర సృష్టించింది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తెలుగు పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రతిష్ఠాత్మకమైన బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయింది. 2023లో ఐఎఫ్ఎఫ్ఐలో ఈ అవార్డును ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ నిలిచింది. జాతీయ స్థాయిలో ఈ ఘనత దక్కడం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఆధ్వర్యంలో తెరకెక్కింది ఈ సీరీస్. దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. హిట్మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లపై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష సంయుక్తంగా నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్నేహాలు, రాజకీయ సంబంధాలు, ప్రత్యర్థిత్వాలు, అధికార సమీకరణాలు ఎలా మారుతూ వచ్చాయనే అంశాలను ఆసక్తికరమైన కథనంతో ఈ సిరీస్‌లో చూపించారు.
ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన కథనం, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన, నిర్మాణ విలువలతో ‘మయసభ’ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓటీటీ రంగంలో… నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు 2023లో జరిగిన 54వ ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డును ప్రవేశపెట్టారు. గతంలో ‘పంచాయత్ సీజన్ 2’, ‘లంపన్’, ‘బందిష్ బాండిట్స్ సీజన్ 2’ వంటి వెబ్ సిరీస్‌లు ఈ అవార్డును అందుకున్నాయి. దేశంలోని విభిన్న భాషల్లో వస్తున్న ప్రతిభావంతమైన కథలకు ఈ పురస్కారం గుర్తింపునిస్తోంది.
ఈ నేపథ్యంలో ‘మయసభ’కు నామినేషన్ దక్కడం తెలుగు కంటెంట్‌కు జాతీయ స్థాయిలో లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాంతీయ భాషల్లో రూపొందుతున్న కథలు కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా కలిగి ఉన్నాయని ఈ గుర్తింపు మరోసారి చాటిచెబుతోంది.
ఇవి కూడా చదవండి
57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి. బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డు విజేతకు రూ.10 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. కథా రచన, కళాత్మక సృజన, సాంకేతిక నైపుణ్యాలను ప్రామాణికంగా తీసుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
‘మాయసభ’ బృందానికి ఈ నామినేషన్ కేవలం అవార్డుకు సంబంధించిన గుర్తింపు మాత్రమే కాదు.. తెలుగు డిజిటల్ కంటెంట్‌కు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చే గర్వకారణమైన ఘట్టం. భవిష్యత్తులో మరిన్ని తెలుగు వెబ్ సిరీస్‌లు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు ఈ విజయం స్ఫూర్తిగా నిలవనుంది.







