మడమల పగుళ్లతో ఇబ్బందా..? వంటింట్లోనే ఈ 5 చిట్కాలు ప్రయత్నించండి!
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం సహజం. ముఖ్యంగా పాదాల అడుగు భాగం, మడమల దగ్గర చర్మం గట్టిపడి పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు ఈ పగుళ్లు లోతుగా మారి నడిచేటప్పుడు నొప్పి, మంట, రక్తస్రావానికి కూడా కారణమవుతాయి. ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంట్లోనే పాటించగల కొన్ని చిట్కాలతో పాటు సరైన మాయిశ్చరైజింగ్ పద్ధతులను అలవాటు చేసుకోవాలి.
ఆలుగడ్డతో నాలుగు రకాల చిట్కాలు

ఆలుగడ్డ తురుము ప్యాక్: ఒక పచ్చి ఆలుగడ్డను శుభ్రంగా కడిగి తొక్క తీసి సన్నగా తురమాలి. ఈ తురుమును మడమలపై ఉంచి శుభ్రమైన గుడ్డతో కప్పాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.
ఆలుగడ్డ రసం, తేనె మిశ్రమం: రెండు చెంచాల ఆలుగడ్డ రసంలో ఒక చెంచా తేనె కలిపి మడమలకు రాయాలి. 15 నిమిషాల తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఆలుగడ్డ ముక్కలతో మర్దన: ఆలుగడ్డను ముక్కలుగా కోసి వాటిపై కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. మడమలపై ఐదు నిమిషాల పాటు సున్నితంగా రుద్ది, తర్వాత నీటితో కడిగేయాలి. పగుళ్లపై నేరుగా రుద్దకూడదు.
ఆలుగడ్డ రసంతో పాదాలను నానబెట్టడం: గోరువెచ్చని నీటిలో ఒక కప్పు ఆలుగడ్డ రసం కలిపి అందులో పాదాలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచవచ్చు. అనంతరం శుభ్రంగా కడిగి తుడవాలి.
కొబ్బరి నూనెతో మర్దన చేయండి
కొబ్బరి నూనె చర్మం పొడిబారకుండా తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు మడమలకు కొద్దిగా కొబ్బరి నూనె రాసి సున్నితంగా మర్దన చేయాలి. అనంతరం కాటన్ సాక్స్ ధరించి నిద్రపోవచ్చు. అయితే లోతైన పగుళ్లకు నూనె ఒక్కటే సరిపోదు.

వాసెలిన్‌తో పాదాలకు తేమ
మడమల పగుళ్ల సంరక్షణలో వాసెలిన్ మంచి ఎంపిక. రాత్రి పడుకునే ముందు మడమలకు పెట్రోలియం జెల్లీ (Vaseline) రాసి కాటన్ సాక్స్ ధరించాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ బయటకు పోకుండా ఉంటుంది. అలాగే 10 నుంచి 25 శాతం యూరియా ఉన్న ఫుట్ క్రీములు పొడిబారిన, గట్టిపడిన చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడతాయి.
ఇవి కూడా చదవండి
పాదాల సంరక్షణలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని పాదాలను 10 నిమిషాల పాటు ఉంచవచ్చు. అనంతరం మెత్తని టవల్‌తో తుడవాలి. మడమలపై పేరుకుపోయిన గట్టి చర్మాన్ని ప్యూమిస్ స్టోన్‌తో చాలా సున్నితంగా తొలగించవచ్చు. అయితే పగుళ్లపై నేరుగా రుద్దకూడదు.
వెనుక భాగం తెరిచి ఉండే చెప్పులు, సరిపోని పాదరక్షలు ధరించడం తగ్గించాలి. పాదాలకు సరైన మద్దతు ఇచ్చే చెప్పులను ఎంచుకోవాలి. ఎక్కువసేపు చెప్పులు లేకుండా నడవకూడదు. రోజూ పాదాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగినంత నీరు తాగడం కూడా అలవాటు చేసుకోవాలి.
మడమల పగుళ్లు లోతుగా ఉండటం, వాపు, ఎరుపు, చీము లేదా రక్తస్రావం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఇంటి చిట్కాలతో స్వయంగా చికిత్స చేసుకోకూడదు.







