సొంత ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి మరోసారి సమరభేరి!
అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత అసమ్మతి మరోసారి బహిర్గతమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత ప్రభుత్వ పనితీరుపైనే మారోసారి సూటిగా, ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో నిధుల కేటాయింపు, ఎన్నికల హామీల అమలు, పార్టీ క్యాడర్‌కు దక్కుతున్న ప్రాధాన్యత వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు గాంధీభవన్ వర్గాల్లోనే కాకుండా, ప్రతిపక్ష శిబిరంలోనూ చర్చనీయాంశంగా మారాయి.
గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకే పరిమితమైందని విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు అదే బాటలో నడుస్తోందన్న అర్థం వచ్చేలా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలకు వేల కోట్ల రూపాయల నిధులు తరలిపోతుంటే, మునుగోడు వంటి వెనుకబడిన ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత బిల్లులు మంజూరు కాక రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, మంత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరంలోనే మౌలిక సదుపాయాలు కరవై ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు ఎందుకని ఆయన ప్రశ్నించడం ప్రభుత్వ ప్రాధాన్యతలపైనే నేరుగా వేసిన ప్రశ్నగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతామని ప్రజలకు మాట ఇచ్చి, మూడేళ్లు గడుస్తున్నా దాన్ని అమలు చేయకపోతే గ్రామాల్లో ప్రజలకు ఏం సమాధానం చెబుతామని ఆయన నిలదీశారు. ఇచ్చిన మాటపై నిలబడటం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పిన కాంగ్రెస్ సంప్రదాయమని గుర్తు చేస్తూ, ప్రస్తుత నాయకత్వానికి చురకలంటించారు. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో, ప్రభుత్వ పనుల్లో మొండిచేయి ఎదురైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారం అనుభవించిన వారు, ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లే మళ్లీ ముందు వరుసలో ఉండి లబ్ధి పొందుతున్నారన్న ఆయన ఆరోపణ పార్టీ శ్రేణుల్లోని అసంతృప్తికి అద్దం పడుతోంది.
తన విమర్శలను కేవలం మంత్రి పదవి దక్కలేదన్న అసహనంగా చిత్రీకరించే ప్రయత్నాలను రాజగోపాల్ రెడ్డి తిప్పికొట్టారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, అందరూ అధిష్ఠానానికి జిందాబాద్ కొడుతూ భజన చేస్తే తప్పులను సరిదిద్దేదెవరని ప్రశ్నించారు. పార్టీ మారుతారన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూనే, ముఖ్యమంత్రి మిగిలిన రెండేళ్ల కాలంలోనైనా అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో నియోజకవర్గ అభివృద్ధి, ఆత్మగౌరవం నినాదంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈసారి గురి తప్పదు, మరో కురుక్షేత్రం తప్పదు అంటూ ఆయన చేసిన హెచ్చరికలు అధిష్ఠానానికి స్పష్టమైన అల్టిమేటమ్లా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే.!







