రూ.15 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి ఫ్యామిలి మొత్తం సన్యాసం.. ఏమైంది అసలు ?
ఒక చిన్న బట్టల దుకాణంతో మొదలైన ప్రయాణం.. క్రమంగా మూడు షాపులుగా విస్తరించింది. వ్యాపారం ఏటా రూ.15 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరుకుంది. ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని తండ్రి ఆలోచిస్తున్న సమయంలో అనూహ్యమైన మలుపు ఎదురైంది. డబ్బు, వ్యాపారం, ఆస్తులు, భవిష్యత్తు.. వీటన్నింటినీ పక్కనపెట్టి ఆ కుటుంబం మరో దారిలో వెళ్లాలని నిర్ణయించుకుంది. అది కూడా ఒక్కరు కాదు.. భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు కలిసి!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన భోగర్ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.15 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న టెక్స్టైల్ వ్యాపారాన్ని వదిలేసి, జైన సన్యాస జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఈ నలుగురూ సిద్ధమయ్యారు.
అసలు ఈ కుటుంబం ఎవరు?
దిలీప్ భాయ్ భోగర్ (47), ఆయన భార్య జ్యోతి బెన్ (45), కుమార్తెలు ఛవి (22), చార్వి (14).. ఈ నలుగురూ 2027 ఫిబ్రవరి 8న గుజరాత్‌లోని సూరత్‌లో జైన దీక్ష స్వీకరించనున్నారు. జైన మతంలో దీక్ష అంటే సాధారణంగా మతపరమైన కార్యక్రమం కాదు. కుటుంబ బంధాలు, ఆస్తులు, వ్యాపారం వంటి ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి, సన్యాస నియమాలతో జీవించేందుకు తీసుకునే నిర్ణయం.
ఈ కుటుంబానికి జైన సన్యాస జీవితం కొత్తేమీ కాదు. ఎందుకంటే మూడేళ్ల క్రితమే వీరి పెద్ద కుమార్తె షైలీ ఇదే మార్గాన్ని ఎంచుకుంది. 2023లో దీక్ష తీసుకుని సాధ్వి దర్శితగా మారింది. ఇప్పుడు ఆమె బాటలోనే తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు నడవాలని నిర్ణయించుకున్నారు.
చిన్న షాపు నుంచి రూ.15 కోట్ల వ్యాపారం వరకు..
ఉదయ్‌పూర్ జిల్లాలోని జస్వంత్‌గఢ్ గ్రామం నుంచి సూరత్‌కు వచ్చిన దిలీప్ భాయ్ మొదట ఒకే ఒక బట్టల దుకాణంతో వ్యాపారం ప్రారంభించారు. కష్టపడి పనిచేస్తూ దాన్ని క్రమంగా విస్తరించారు. ఒకటి కాస్తా మూడు షాపులయ్యాయి. వ్యాపారాన్ని మరింత పెంచేందుకు యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా ఆయన నిర్మించుకున్న టెక్స్టైల్ వ్యాపారం ఏటా సుమారు రూ.15 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది.
ఇంతటి వ్యాపారాన్ని నిర్మించుకున్న వ్యక్తి సాధారణంగా ఇంకా విస్తరణ గురించి ఆలోచిస్తారు. దిలీప్ భాయ్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక జైన ఆచార్యుడిని కలిసిన తర్వాత ఆయన ఆలోచనల్లో క్రమంగా మార్పు మొదలైంది. జైన మతం, దాని సూత్రాలు, సన్యాస జీవన విధానం పట్ల ఆసక్తి పెరిగింది. చివరకు ప్రాపంచిక జీవితాన్ని వదిలేయాలనే ఆలోచన బలపడింది.
2023లో పెద్ద కుమార్తె షైలీ దీక్ష తీసుకోవడం ఈ నిర్ణయానికి మరింత ప్రేరణగా మారింది. ఆ తర్వాత దిలీప్ భాయ్ వ్యాపారాన్ని క్రమంగా తగ్గించడం మొదలుపెట్టారు. తాను కూడా దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన భార్య, మిగిలిన ఇద్దరు కుమార్తెలు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇద్దరు కుమార్తెలకు వేర్వేరు ప్రపంచాలు.. అయినా ఒకటే నిర్ణయం!
ఈ కుటుంబంలో పెద్ద కుమార్తె ఛవి వయసు 22 ఏళ్లు. ఆమె బీబీఏలో గ్రాఫిక్ డిజైన్ చదివింది. అంతేకాదు, క్రోషే పద్ధతిలో తయారు చేసిన అలంకరణ వస్తువులు, రోజువారీ ఉపయోగానికి పనికొచ్చే వస్తువులను విక్రయించే చిన్న వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. అయితే తండ్రి దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, ఆమె తన వ్యాపారాన్ని కేవలం నాలుగు నెలల్లోనే నిలిపివేసింది.
ఇక చిన్న కుమార్తె చార్వి వయసు కేవలం 14 ఏళ్లు. తొమ్మిదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసింది. సూరత్‌లో జిల్లా స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు క్రీడలు, చదువు, భవిష్యత్తు అవకాశాలన్నింటినీ పక్కనపెట్టి సన్యాస జీవితానికి సిద్ధమవుతోంది.
దీక్షకు ముందు కఠినమైన శిక్షణ!
అయితే దీక్ష తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నంత మాత్రాన వెంటనే సన్యాస జీవితం మొదలుపెట్టలేరు. అందుకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. అందుకే ఈ నలుగురూ ప్రస్తుతం జైన సన్యాసులతో కలిసి ఉంటూ ఆ జీవన విధానానికి అలవాటు పడుతున్నారు.
కాలి నడకనే ప్రయాణించడం, ఆహారానికి సంబంధించిన కఠినమైన నియమాలు పాటించడం, రోజువారీ క్రమశిక్షణ, సన్యాసులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమాలను నేర్చుకుంటున్నారు. ఫిబ్రవరి 8, 2027న సూరత్‌లో జరిగే దీక్ష కార్యక్రమంతో వీరి ప్రాపంచిక జీవితం అధికారికంగా ముగియనుంది.
రూ.15 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాన్ని వదిలేయడం ఒక విషయం. కానీ భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఒకేసారి ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం మరో విషయం. ముఖ్యంగా చిన్న కుమార్తెకు ఇంకా 14 ఏళ్లే ఉండటంతో ఈ నిర్ణయం మరింత చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ప్రపంచం సంపద, విజయాల కోసం పరుగులు తీస్తుంటే.. మరోవైపు ఈ కుటుంబం అన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెడుతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







