బ్లాక్ స్కై పై బ్రిటన్ ఫైట్..!
యూరప్ ను వణికిస్తున్నబ్లాక్ స్కై సమస్యకు పరిష్కారంపై ఫోకస్ పెట్టింది బ్రిటన్. సూపర్ మార్కెట్లలో ఫ్రిజ్‌లు హ్యాకింగ్‌కు గురికావడం, మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో అంతరాయం, వరుస బాంబు బెదిరింపు (Bomb threats) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని పరిణామాల వల్ల సేవల్లో అంతరాయం కలగడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ స్కై సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ సూచిస్తూ బ్రిటన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
ఏమిటీ బ్లాక్ స్కై?
వివిధ కారణాలతో కీలక మౌలిక సదుపాయాల్లో అంతరాయాల కారణంగా అత్యవసర సేవలు నిలిచిపోవడాన్నే ‘బ్లాక్ స్కై’గా (Black Sky Event) వ్యవహరిస్తారు. సైబర్ దాడుల వల్ల ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోవడం.. ప్రకృతి విపత్తులు లేదా వరదలు, కార్చిచ్చులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విద్యుత్ సేవలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తద్వారా నీటి సరఫరా వ్యవస్థకు అంతరాయం, దుకాణాల్లో ఫ్రిజ్‌లు పనిచేయకపోవడం వంటి పరిస్థితులు ఎదురవ్వడం.. ఆసుపత్రులు, ప్రజా రవాణా సేవల్లో అంతరాయం, ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు పెంచుకునే వీలు లేకపోవడంలాంటి పరిస్థితిని బ్లాక్ స్కైగా పేర్కొంటారు.
ఇవి కూడా చదవండి
ఇలా రోజువారీ సేవల్లో అంతరాయాలు ఏర్పడితే.. వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని సూచిస్తూ బీ రెడీ (Be Ready campaign) పేరుతో బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యుత్ కోతల సమయంలో ప్రభుత్వం నుంచి అప్డేట్లను పొందేందుకు బ్యాటరీతో నడిచే రేడియోలను కొనుగోలు చేసుకోవాలని, పవర్ బ్యాంకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తోంది. ఆహార కొరత లేకుండా చూసుకోవాలని.. కనీసం మూడు రోజులకు సరిపడా ఆహారం, నీరు, ఇంధనాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని చెబుతోంది. వీటితోపాటు గుర్తింపు కార్డుల జిరాక్సులు, ముఖ్యమైన ఫోన్ నంబర్లు, ఔషధాల పేర్లు రాసి పెట్టుకోవడం, చిల్లరతో కూడిన కొంత నగదును ఉంచుకోవాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్లో చెక్లిస్ట్ను కూడా పొందుపరిచింది.
ప్రభుత్వ సూచనలతో బ్రిటన్‌లో ఇటీవల ఆహారం, నీళ్ల బాటిళ్ల వంటి నిత్యావసర వస్తువుల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ తరహా ముప్పుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని యూకే రక్షణ మంత్రి వెస్ స్ట్రీటింగ్ విజ్ఞప్తి చేశారు.







