H-1B వీసాల కథ ముగిసినట్టేనా? IBM సీఈఓ సంచలన వ్యాఖ్యలు!
ఇన్నాళ్లూ మంచి ఉద్యోగం వస్తే చాలు.. కంపెనీ వీసా స్పాన్సర్ చేస్తుంది, అమెరికాకు వెళ్లిపోవచ్చని చాలామంది ఐటీ ఉద్యోగులు ఆశపడేవారు. కానీ ఇక ఆ ఆశలన్నీ నెరవేరకపోవచ్చు! విదేశాలకు ఉద్యోగులను పంపించడానికి కంపెనీలు ఆసక్తి చూపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏకంగా ప్రపంచ టెక్ దిగ్గజం ఐబీఎం సీఈఓనే ఇప్పుడు అలాంటి సంకేతాలు ఇస్తున్నారు. కంపెనీలు స్పాన్సర్ చేసే వీసాల సంఖ్య భారీగా తగ్గిపోనుందని ఆయన చేసిన వ్యాఖ్యలు టెక్ ఉద్యోగుల్లో కొత్త ఆందోళనకు తెరలేపాయి.
న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అరవింద్ కృష్ణ.. ఈ మార్పు కేవలం అమెరికాకే పరిమితం కాదని, యూరప్, ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. సింగపూర్‌లో కూడా 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు వలస నిబంధనలు చాలా కఠినంగా మారాయని వివరించారు.
ఇకపై కంపెనీ స్పాన్సర్డ్ వీసాలు తగ్గుతాయా?
విదేశీ ఉద్యోగుల బదిలీలకు కంపెనీలు స్పాన్సర్ చేసే వీసాల విధానం పూర్తిగా ముగిసిపోతుందా అని అడిగిన ప్రశ్నకు కృష్ణ ఆసక్తికరంగా స్పందించారు. పూర్తిగా ముగుస్తుందని చెప్పడం తొందరపాటే అవుతుందని, అయితే గతంతో పోలిస్తే ఈ విధానం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇటీవలే ఐబీఎం తీసుకున్న నిర్ణయం కూడా ఈ మార్పులకు అద్దం పడుతోంది. తన అతిపెద్ద విభాగమైన ఐబీఎం కన్సల్టింగ్‌లో చాలా ఉద్యోగాల కోసం అమెరికా వీసాలు, గ్రీన్ కార్డుల స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విభాగంలో 1.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యే ఉద్యోగులు అమెరికా వెలుపల ఐబీఎంలోనే కొనసాగవచ్చు లేదా ఈ ఏడాది చివరి నాటికి సంస్థను వీడాల్సి ఉంటుంది. అమెరికాలో హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
ఉద్యోగులున్న దేశాల్లోనే నియామకాలు
విదేశాలకు ఉద్యోగులను తరలించడం కంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో అక్కడే కొత్త ఉద్యోగాలను సృష్టించడంపై ఐబీఎం దృష్టి పెట్టనుందని అరవింద్ కృష్ణ తెలిపారు. అయితే ఉన్నత విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులను మాత్రం కంపెనీ నియమించుకుంటుందని స్పష్టం చేశారు.
భారత్‌లో ఐబీఎం నియామకాలు కూడా పెరిగినట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది కాలంలో భారత్‌లో సుమారు 5,000 నుంచి 10,000 మంది వరకు ఉద్యోగులను నియమించి ఉండవచ్చని చెప్పారు. అంతేకాదు, 2025తో పోలిస్తే 2026లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల నియామకాలను రెట్టింపు చేసినట్లు వివరించారు.
ఏఐతో 10-20 శాతం ఉద్యోగాలకు ముప్పు!
ఉద్యోగుల భవిష్యత్తుపై కృత్రిమ మేధ (AI) ప్రభావం గురించి కూడా అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో ఏఐ కారణంగా మొత్తం ఉద్యోగాల్లో 10 నుంచి 20 శాతం వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ మార్పు వచ్చే రెండు, మూడేళ్లలోనే జరిగిపోదని, దశలవారీగా చోటుచేసుకుంటుందని వివరించారు.
ముఖ్యంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగంపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని చెప్పలేమని, కానీ ఆ విభాగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రోగ్రామర్ల ఉద్యోగాలు కూడా పూర్తిగా పోవని కృష్ణ స్పష్టం చేశారు. ఇప్పటికే ఐబీఎంలో రాసే కోడ్‌లో దాదాపు సగం ఏఐ సాయంతోనే రూపొందుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రోగ్రామర్లు స్వయంగా కోడ్ రాయడం కంటే, ఏఐకి ఏం రాయాలో సూచించే సిస్టమ్ ఇంజినీర్లుగా మారతారని వివరించారు.
భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు
భారత్‌పై ఐబీఎం తన పెట్టుబడుల ప్రణాళికను కొనసాగిస్తోంది. ఏటా సుమారు 3 బిలియన్ డాలర్లను భారతదేశంలో పెట్టుబడిగా పెడుతున్నట్లు అరవింద్ కృష్ణ తెలిపారు.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో వచ్చే ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో భారత్‌తో భాగస్వామ్యాలను మరింత విస్తరించేందుకు కూడా ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇదే తరహా క్వాంటమ్ భాగస్వామ్యాల కోసం మరో రెండు భారతీయ రాష్ట్రాలతో ఐబీఎం చర్చలు జరుపుతోందని వెల్లడించారు.
మారుతున్న టెక్ ఉద్యోగాల ప్రపంచం
మొత్తంగా చూస్తే.. కఠినమవుతున్న వీసా నిబంధనలు, ఏఐ విస్తరణతో ప్రపంచ టెక్ ఉద్యోగ మార్కెట్ కొత్త దిశగా ప్రయాణిస్తోంది. విదేశాలకు ఉద్యోగులను పంపించడం కంటే స్థానికంగానే నియామకాలు చేపట్టడం, ఏఐ ఆధారిత పనితీరుకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను మార్చడం వంటి వ్యూహాలకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







