గ్రీన్ కార్డు నిబంధనలను మరింత కఠినతరం చేసే యోచనలో ట్రంప్
విదేశీ ఉద్యోగులకు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులను (శాశ్వత నివాస హోదా) స్పాన్సర్ చేసే కంపెనీల కోసం అమెరికా ప్రభుత్వం కొత్తగా కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, తమ కంపెనీల ద్వారా గ్రీన్ కార్డు పొందాలని ఆశిస్తున్న భారతీయ నిపుణులకు ఆ ప్రక్రియ మరింత ఆలస్యం కావడంతో పాటు కష్టతరంగా మారే అవకాశం ఉంది.
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఏదైనా కంపెనీ విదేశీ ఉద్యోగిని నియమించుకోవడానికి ముందే ఆ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కనీసం 90 రోజుల పాటు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా, అర్హులైన అమెరికన్ అభ్యర్థులను నియమించుకోవడానికి తాము నిజాయితీగా అన్ని ప్రయత్నాలు చేశామని ఆ కంపెనీలు నిరూపించుకోవాలి.
‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్’ (PERM) నిబంధనల్లో భారీ మార్పులు చేస్తూ అమెరికా కార్మిక శాఖ మంగళవారం ఈ ప్రతిపాదనలను తీసుకొచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ విధానంలో ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం ఇదే మొదటిసారని వార్తా సంస్థ పీటీఐ (PTI) పేర్కొంది.
ఉద్యోగ ఆధారిత వలసలను కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల అమెరికన్ కార్మికులకు ఎలాంటి నష్టం కలగదని కంపెనీలు బలమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని రాయిటర్స్ (Reuters) వార్తా సంస్థ వెల్లడించింది.
ఎక్కువ నైపుణ్యాలు అవసరమయ్యే, అధిక వేతనం దక్కే ఉద్యోగాల్లో విదేశీయుల కంటే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం లభించేలా చేస్తామని అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. కొన్ని వృత్తులకు చట్టబద్ధమైన లేబర్ మార్కెట్ పరీక్షను దాటవేయడానికి యజమానులకు అనుమతించే పరిపాలనా మినహాయింపును రద్దు చేయాలనీ తాము ప్రతిపాదించామని కార్మిక మంత్రి చెప్పుకొచ్చారు. ఫిజియో థెరపిస్టులు, నర్సులు, సైన్స్ రంగాల్లో అవసరమయ్యే పోస్టుల కోసం నియమకాలు జరిపే యజమానులు అర్హులైన అమెరికన్ దరఖాస్తుదారులను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందన్నారు.
కార్మిక శాఖ ప్రతిపాదిత మార్పులు…
కేవలం విదేశీ ఉద్యోగులకే సరిపోయే విధంగా ఉద్యోగ అర్హతలను యజమానులు రూపొందించడాన్ని నూతన నిబంధనలు నిషేధిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేటప్పుడు అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఒకే రకమైన మాధ్యమాలు, విధానాలను యజమానులు ఉపయోగించాలని, అలాగే వెబ్ సైట్స్, సోషల్ మీడియా, జాబ్ మేళాల ద్వారా ఆన్ లైన్ నియామకాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఉద్యోగ ఖాళీలపై ప్రకటనలపై కాల వ్యవధిని 30 రోజుల నుంచి 9 రోజులకు పెంచాలని ప్రతిపాదనలు వున్నాయి.







