కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తప్పవా..?
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. కొడంగల్ నియోజకవర్గ నిధుల కేటాయింపులను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటివరకు ప్రభుత్వ పనితీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన, బుధవారం ఏకంగా ముఖ్యమంత్రిపైనే విమర్శనాస్త్రాలు సంధించడం పార్టీ నియమావళిని అతిక్రమించడమేనని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సిద్దిపేటలో పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజగోపాల్ రెడ్డి అసహనానికి ప్రధాన కారణం మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న జాప్యమేనన్నది బహిరంగ రహస్యం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి సొంత గూటికి చేరే సమయంలో, అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన పలు వేదికలపై బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా, క్యాబినెట్ విస్తరణపై అధిష్ఠానం ఇంతవరకు కనీస కసరత్తు కూడా ప్రారంభించకపోవడం ఆయనలో అసహనాన్ని పెంచింది.
మరోవైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే క్యాబినెట్లో కీలక మంత్రిగా కొనసాగుతుండటంతో, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం కష్టమనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తే, వెంకట్ రెడ్డికి పార్టీ పరమైన మరో కీలక బాధ్యత అప్పగిస్తారనే ప్రచారం జరిగినా, ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ అభివృద్ధి, నిధుల విడుదల అంశాలను సాకుగా చూపుతూ ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం సిద్దిపేట సభను విజయవంతం చేసే పనిలో నిమగ్నమై ఉంది. బీఆర్ఎస్ కంచుకోటలో సత్తా చాటాలని రేవంత్ రెడ్డి, టీపీసీసీ వ్యూహాలు రచిస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఇలాంటి విమర్శలు రావడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్ ఈ నెల 22వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. ఆయన రాకతో పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అదే రోజు జరగనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారమే ప్రధాన అజెండాగా మారనుంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఇప్పటికే టీపీసీసీ అధిష్టానానికి పంపించినట్లు సమాచారం.
మొత్తానికి, నూతన ఇన్ఛార్జి బి.ఎం. సందీప్ సమక్షంలో ఈ నెల 22న జరిగే సమావేశం క్రమశిక్షణకు ఒక గీటురాయిగా మారనుంది. బహిరంగ విమర్శలకు దిగే నేతలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం పంపాలని అధిష్ఠానం భావిస్తోంది. మరి పీఏసీ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గుతారా, లేక తన పంథాను కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.







