చలికాలంలో చర్మం పొడిబారకూడదంటే.. ఇంట్లోనే ఇలా మ్యాజికల్ బ్లూ సీరం తయారు చేయండి!
చలికాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం, ముఖంపై సహజమైన మెరుపు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లటి గాలులు, తక్కువ తేమ కారణంగా చర్మం తన సహజమైన మృదుత్వాన్ని కోల్పోతుంది. అందుకే ఈ సీజన్లో చర్మానికి అదనపు తేమను అందించడం చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో ఆసక్తి పెంచుతున్న హోమ్మేడ్ స్కిన్‌కేర్ పద్ధతుల్లో వింటర్ మ్యాజికల్ బ్లూ సీరం ఒకటి. దీనిని శంఖుపూలు (Butterfly Pea Flowers) ఉపయోగించి తయారు చేస్తారు. ఈ పువ్వుల్లో ఉండే సహజ వర్ణద్రవ్యాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఈ సీరమ్‌కు నీలిరంగును ఇస్తాయి.
బ్లూ సీరం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదే!

ఈ సీరం తయారు చేయడానికి 6 నుంచి 8 శంఖుపూలు, 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, ఒక విటమిన్ E క్యాప్సూల్, కొద్దిగా గ్లిజరిన్ లేదా బాదం నూనె తీసుకోవాలి. వీటిని కలపడానికి శుభ్రమైన గిన్నె, చిన్న గాజు డ్రాపర్ బాటిల్ సిద్ధం చేసుకోవాలి.
ముందుగా గోరువెచ్చని రోజ్ వాటర్‌లో శంఖుపూలను వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. నీరు నీలిరంగులోకి మారిన తర్వాత పువ్వులను వడకట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకుని, అందులో ఈ నీలిరంగు నీటిని కొద్దికొద్దిగా కలపాలి.
ఇవి కూడా చదవండి
తర్వాత విటమిన్ E క్యాప్సూల్‌లోని ఆయిల్‌ను వేసి బాగా కలపాలి. అనంతరం 3-4 చుక్కల గ్లిజరిన్ లేదా బాదం నూనె జోడించి, జెల్‌లాంటి మిశ్రమం తయారయ్యే వరకు కలపాలి. ఎక్కువ గ్లిజరిన్ లేదా నూనె వేయకుండా పరిమితంగా ఉపయోగించడం మంచిది.
బ్లూ సీరం ప్రయోజనాలు, ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

చర్మానికి తేమ (Skin Hydration): ఇందులోని అలోవెరా, గ్లిజరిన్ చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. చలికాలంలో చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
సహజమైన మెరుపు (Natural Glow): శంఖుపూలలో ఉండే యాంటీఆక్సిడెంట్లకు చర్మ సంరక్షణలో ఉపయోగపడే లక్షణాలు ఉన్నట్లు ప్రయోగశాల పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఈ సీరం ముఖానికి ప్రత్యేకమైన మెరుపును ఇస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా నివారించి, చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.
చర్మ మృదుత్వం (Skin Softness): అలోవెరా, గ్లిజరిన్ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. పొడిబారడం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో ఉపయోగపడవచ్చు.
ముఖానికి అప్లై చేసే ముందు చెవి వెనుక లేదా చేతి లోపలి భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ మిశ్రమంలో నీరు, మొక్కల పదార్థాలు ఉండటం వల్ల త్వరగా సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో తయారు చేసి 10–15 రోజులు నిల్వ చేయకూడదు. తాజాగా చిన్న పరిమాణంలో తయారు చేసి వెంటనే ఉపయోగించడం మంచిది. విటమిన్ E క్యాప్సూల్ కలిపినంత మాత్రాన మిశ్రమం పాడవకుండా ఉండదు.







