కొబ్బరిపాలకు టమాటా మసాలా జోడించి.. ఇలా పులావ్ చేస్తే నోరురిపోవాల్సిందే!
ప్రతిరోజూ లంచ్ బాక్స్‌లోకి ఏదో ఒక కొత్త వంటకం చేయాలంటే ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ చేసే పులిహోర, నిమ్మకాయ అన్నం కాకుండా కాస్త కొత్త రుచితో కూడిన వంటకం తినాలనిపిస్తోందా? అయితే కొబ్బరిపాలు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే ఈ బంగాళదుంప పులావ్ ప్రయత్నించండి. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా పెట్టవచ్చు.
టమాటా మసాలా పేస్ట్, కొబ్బరిపాలు సిద్ధం చేసి కుక్కర్లో ఇలా వేయించండి!

ముందుగా కొన్ని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి, వడకట్టి కొబ్బరిపాలను వేరుచేసి పక్కన పెట్టుకోవాలి.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ వేసి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కలపాలి. మసాలాలోని పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
కొబ్బరిపాలతో కుక్కర్లో రెండు విజిల్స్.. ఘుమఘుమలాడే బంగాళదుంప పులావ్ రెడీ!

మసాలా సిద్ధమైన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసి ప్రతి గింజకు మసాలా పట్టేలా మెల్లగా కలపాలి. ఇప్పుడు తయారుచేసుకున్న కొబ్బరిపాలు పోసి ఉప్పు సరిచూసుకోవాలి. బియ్యం రకాన్ని బట్టి అవసరమైనంత ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అనంతరం కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
కుక్కర్లో ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే మూత తీయాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి అన్నాన్ని గరిటెతో మెల్లగా కలపాలి. అంతే.. ఎంతో సువాసనగా, రుచికరంగా ఉండే కొబ్బరిపాల బంగాళదుంప పులావ్ సిద్ధం. పెరుగు రాయితా లేదా కీరదోస ముక్కలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. రేపటి లంచ్ బాక్స్‌లో ఈ కొత్త రెసిపీని ఒకసారి ప్రయత్నించండి.







