అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
* 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యం
* మంచి రహదారులు లేని దేశం అభివృద్ధి చెందదు
* ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2047 మన దేశానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న సంవత్సరం.. మనం స్వాతంత్య్రం సాధించి నాటికి వందేళ్లు అవుతుంది. జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం విషయంలో రాజకీయాలకు తావులేదు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, మిగిలిన సమయంలో దేశాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనలో దేశం ప్రగతి సాధించడానికి తనవంతు కర్తవ్యంగా తెలంగాణ కూడా తోడ్పాటును అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో గురువారం ప్రారంభమైన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ తన వంతుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యానికి తగినట్లు తెలంగాణ రైజింగ్ విజన్‌తో ముందుకు సాగుతున్నామని, 2034 నాటికే 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ, జాతీయ జీడీపీలో 5 శాతం వాటా అందిస్తోందని, 2047 నాటికి దానిని 10 శాతానికి పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందించిన ప్రతిపాదనలకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు.
సంపన్న దేశాలు గొప్ప రహదారులను నిర్మించవని, గొప్ప రహదారులే దేశాలను ధనిక, అభివృద్ధి చెందిన దేశాలుగా మారుస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) తమ విజన్‌కు నిదర్శనాలని చెప్పారు. ఆర్థిక ప్రగతి కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని, అందులో ఓఆర్ఆర్ లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ నగరాన్ని క్యూర్ (CURE)గా గుర్తించామని, అందులో సేవల రంగానికి (సర్వీసెస్) ప్రాధాన్యమిస్తామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్యూర్ (PURE) ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కారిడార్‌గా తీర్చిదిద్దుతామన్నారు. చైనా ప్లస్ వన్ అనే వ్యూహానికి ఇది తాము చూపే జాతీయ పరిష్కారమని తెలిపారు. ఆర్ఆర్ఆర్ వెలుపలి నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న రేర్ (RARE) ప్రాంతాన్ని వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమల కోసం అభివృద్ధి చేస్తామని వివరించారు.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులనే కాక ఇతర పనులను తమ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ చేపడుతోందని సీఎం వెల్లడించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం, నిమ్స్ విస్తరణ, టిమ్స్ (TIMS), వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా మొత్తం 8 వేల పడకలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ*లో ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్పోగా *ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆ సదస్సుకు పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులు తరలిరావాలని సీఎం ఆహ్వానించారు.







