ఏఐ ఎఫెక్ట్.. 2 లక్షలకు పైగా ఉద్యోగాల కోత! ఏయే కంపెనీల్లో…?
ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయా? ఇప్పటివరకు ఇది ఒక చర్చ మాత్రమే. కానీ ఇప్పుడు ఆ భయం నిజమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ప్రపంచ టెక్ దిగ్గజాలే ఇప్పుడు అదే స్థాయిలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తున్న కంపెనీలు.. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి.
ఫలితంగా 2026లో ఇప్పటివరకు టెక్ రంగంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. మరి ఈ భారీ తొలగింపుల్లో ముందున్న కంపెనీలేవి? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్ధల్లో పరిస్థితి ఏమిటి?
ఉద్యోగాల కోతలో ఒరాకిల్ టాప్!
ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా ఉద్యోగులను తగ్గించిన టెక్ కంపెనీగా ఒరాకిల్ నిలిచింది. Yahoo Tech ట్రాకర్ ప్రకారం ఆ సంస్థ సుమారు 21 వేల ఉద్యోగాలను తగ్గించింది. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని ఒరాకిల్ తన అధికారిక ఫైలింగ్‌లోనూ పేర్కొంది. అమెజాన్‌లో సుమారు 17 వేల ఉద్యోగాలు తగ్గగా, మెటా మే నెలలో 8 వేల మందికి ఉద్వాసన పలికింది. ఉబర్‌లో 3,300, నెట్‌ఫ్లిక్స్‌లో 1,000 ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. అంటే ఏఐ రేసులో ముందుండాలని చూస్తున్న కంపెనీల్లోనే ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఇవి కూడా చదవండి
గూగుల్, మైక్రోసాఫ్ట్‌లోనూ తప్పని మార్పులు!
ఉద్యోగుల కోతలే కాకుండా, స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలి వెళ్లేలా ప్రత్యేక ప్యాకేజీలు కూడా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్‌లోని కొంతమంది ఉద్యోగులకు ఎగ్జిట్ ప్యాకేజీలు అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అయితే అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లో సుమారు 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ బైఅవుట్ ఆఫర్ ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. అయితే ఈ 60 వేల మందిని తొలగించినట్లు కాదు.. స్వచ్ఛందంగా వైదొలిగేందుకు అవకాశం కల్పించినట్లు కంపెనీ ప్రకటించింది.
మరోవైపు Canvaలో 1,271 మంది ఉద్యోగులపై ప్రభావం పడేలా పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. Squarespace సుమారు 300 మందిని తగ్గించుకోనుంది. Disney కూడా వేలాది ఉద్యోగాల కోతపై ఆలోచిస్తోంది. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది.
ఉద్యోగం పోవడమే కాదు.. కొత్త ఉద్యోగాలూ తగ్గుతున్నాయి!
ఈ పరిణామాల్లో మరింత ఆందోళన కలిగించే విషయం కొత్త ఉద్యోగాల నియామకాలు తగ్గిపోవడం. ముఖ్యంగా ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండే విభాగాల్లో ఎంట్రీ లెవల్ నియామకాలు 2021తో పోలిస్తే మూడో వంతు తగ్గినట్లు CNET నివేదిక వెల్లడించింది. అంటే చదువు పూర్తిచేసుకుని ఉద్యోగంలో చేరాలనుకునే యువతకు అవకాశాలు తగ్గుతున్నాయి.
మరోవైపు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికీ భద్రత లేకుండా పోతోంది. ఉద్యోగాల కోతలు ఇతర రంగాలకు విస్తరిస్తాయో లేదో చెప్పలేమని, కానీ స్థిరమైన కెరీర్‌కు దారితీసే అవకాశాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని JVS Bay Area సీఈఓ లీసా కంట్రీమన్-క్విరోజ్ పేర్కొన్నారు.
ఏఐ అభివృద్ధి.. మనుషులకు అనిశ్చితి!
నవంబర్ 19 నాటికి TrueUp ట్రాకర్ ప్రకారం 2026లో టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 2,08,526కు చేరింది. అంటే రోజుకు సగటున 646 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. గత ఏడాది ఇదే సగటు 579గా ఉంది. ఈ వేగం కొనసాగితే ఏడాది చివరికి ఉద్యోగాల కోతలు 2.36 లక్షలకు చేరవచ్చని అంచనా.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







