రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? ఈ 5 సులభ వ్యాయామాలు తప్పనిసరి
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు
ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చునే పనిచేస్తున్నారు. ఉదయం ఆఫీసుకు వెళ్లినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు కుర్చీకి అతుక్కుపోయి ఉండేవారు చాలామందే. దీనివల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల బిగుతు, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అంతేకాదు, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఆఫీసులోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా ఈ ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ కుర్చీలో కూర్చుని లేదా పక్కనే నిలబడి చేయగలిగే ఐదు సులభమైన వ్యాయామాలు ఇవే.
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారికి మెడపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి నెక్ స్ట్రెచ్ (Neck Stretch) చేయవచ్చు. కుర్చీలో నిటారుగా కూర్చుని తలను నెమ్మదిగా కుడివైపుకు వంచాలి. కొన్ని సెకన్ల తర్వాత తిరిగి సాధారణ స్థితికి వచ్చి ఎడమవైపుకు వంచాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా ముందుకు వంచి తిరిగి పైకి తీసుకురావాలి. ఇలా రెండు వైపులా కొన్ని సార్లు చేయడం వల్ల మెడ కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అయితే తలను బలవంతంగా తిప్పకూడదు.
ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో భుజాలు, పైభాగం కండరాలు బిగుసుకుపోతుంటాయి. ఇలాంటి వారు షోల్డర్ రోల్స్ (Shoulder Rolls) ప్రయత్నించవచ్చు. కుర్చీలో నిటారుగా కూర్చుని రెండు భుజాలను నెమ్మదిగా పైకి ఎత్తాలి. ఆ తర్వాత వెనక్కి, కిందికి తిప్పుతూ మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా ముందుకు కూడా తిప్పాలి. ఇలా 10 సార్లు చేయడం వల్ల భుజాల కండరాలకు కదలిక లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
కుర్చీలోనే చేయగలిగే సులభమైన ఆఫీస్ వ్యాయామాలు
రోజంతా కుర్చీలో కూర్చోవడం వల్ల నడుము, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీనిని తగ్గించడానికి సీటెడ్ స్పైనల్ ట్విస్ట్ (Seated Spinal Twist) ఉపయోగపడుతుంది. కుర్చీలో నిటారుగా కూర్చుని రెండు పాదాలను నేలపై ఉంచాలి. ఇప్పుడు శరీర పైభాగాన్ని నెమ్మదిగా ఒకవైపు తిప్పి కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. తర్వాత మరోవైపు తిప్పాలి. ఇలా చేసేటప్పుడు నడుమును బలవంతంగా తిప్పకుండా జాగ్రత్త పడాలి.
కాళ్లకు సరైన కదలిక లేకపోతే రక్త ప్రసరణపై ప్రభావం పడవచ్చు. అందుకే సీటెడ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ (Seated Leg Extensions) చేయడం మంచిది. కుర్చీలో కూర్చుని ఒక కాలును నెమ్మదిగా ముందుకు చాపి మోకాలిని నిటారుగా ఉంచాలి. కొన్ని సెకన్ల తర్వాత తిరిగి కిందికి దించాలి. ఇదే విధంగా మరో కాలుతోనూ చేయాలి. ఈ వ్యాయామం కాళ్ల కండరాలను చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది.
అలాగే ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు కాఫ్ రైజెస్ (Calf Raises) కూడా చేయవచ్చు. కుర్చీ పక్కన నిలబడి దాని అంచును పట్టుకుని రెండు పాదాల మడమలను నెమ్మదిగా పైకి ఎత్తాలి. కాలి వేళ్లపై కొద్దిసేపు నిలబడి తిరిగి మడమలను నేలపై ఉంచాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయవచ్చు. ఇది కాలి కండరాలకు వ్యాయామం అందించడంతో పాటు కాళ్ల కదలికను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వ్యాయామాలతో పాటు పాటించాల్సిన ఆరోగ్య అలవాట్లు
ఈ వ్యాయామాలతో పాటు ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి కొద్దిసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. తగినంత నీరు తాగుతూ, కూర్చునే సమయంలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి లేదా అసౌకర్యం కలిగితే వెంటనే ఆపాలి. ఇప్పటికే మెడ, నడుము లేదా కీళ్ల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. రోజులో కొద్దిసేపు కేటాయించినా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవచ్చు.







