చెల్లుకు చెల్లు.. చైనా గూఢచర్యంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
దొంగ దొంగ అనుకునే ముందు.. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉన్నారేమో చూసుకోవాలన్నట్టుంది అమెరికా, చైనాల వ్యవహారం! చైనా తమపై గూఢచర్యం చేస్తోందని అమెరికా ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతోంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ ఫిర్యాదుకు ఓ చిన్న సవరణ చేశారు. చైనా మాత్రమే కాదు.. తాము కూడా చైనాపై నిఘా పెడుతున్నామని సెలవిచ్చారు. అంతేకాదు, ఈ గూఢచర్యం పోటీలో అమెరికాదే పైచేయి అని కూడా ప్రకటించేశారు. అంటే ప్రత్యర్థి ఇంట్లోకి తొంగిచూడటం తప్పే.. కానీ మనం తొంగిచూస్తే అది జాతీయ భద్రత అన్నమాట! దౌత్యంలో నీతులు చెప్పేవారే నిఘా పోటీలో పతకాలు కూడా ఆశిస్తుంటే అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏముంటుంది?
మరి చైనాను ఆపమని ఎలా అడుగుతాం?
ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. అమెరికాపై గూఢచర్యం చేయడం ఆపాలని చైనాను కోరుతారా? సాధారణంగా ఇలాంటి ప్రశ్నకు అమెరికా అధ్యక్షులు జాతీయ భద్రత, అంతర్జాతీయ నిబంధనలు అంటూ పెద్ద ఉపన్యాసమే ఇవ్వొచ్చు. కానీ ట్రంప్ మాత్రం రెండు వాక్యాల్లో లెక్క తేల్చేశారు.
అమెరికా కూడా చైనాపై నిఘా పెడుతున్నప్పుడు.. వాళ్లను ఆ పని ఆపమని ఎలా అడుగుతామని ప్రశ్నించారు. ఇరు దేశాలూ ఒకరినొకరు గమనించుకుంటున్నాయని అంగీకరించారు. అంటే చైనాకు అమెరికా నుంచి వెళ్లే సందేశం దాదాపు ఇదే అన్నమాట: ‘మా మీద నిఘా పెట్టొద్దు అని చెప్పే పరిస్థితిలో మేం లేము.. ఎందుకంటే మేం కూడా మీ మీద నిఘా పెడుతున్నాం!’
గూఢచర్యంలోనూ అమెరికాదే గోల్డ్ మెడల్!
ఇక్కడితో ట్రంప్ ఆగలేదు. అసలు ట్విస్ట్ అప్పుడే ఇచ్చారు. చైనా కంటే అమెరికానే మెరుగ్గా గూఢచర్యం చేస్తుందని వ్యాఖ్యానించారు. “వాళ్ల కంటే మేమే బాగా గూఢచర్యం చేస్తామని నేను భావిస్తున్నాను” అని చెప్పారు.
అంటే చైనా నిఘా పెడుతోందన్నది సమస్య కాదన్నమాట. అమెరికా కంటే బాగా నిఘా పెడుతోందా లేదా అన్నదే అసలు సమస్య కావచ్చు! గూఢచర్యానికి కూడా ఒలింపిక్స్ ఉంటే.. అమెరికా కనీసం స్వర్ణ పతకం కోసం పోటీ పడుతోందని ట్రంప్ మాటలు వింటే అనిపిస్తుంది. కాకపోతే ఈ పోటీలో ఎవరు గెలిచారో చెప్పడానికి న్యాయనిర్ణేతలు కూడా నిఘా పెట్టాల్సిందే!
చైనా ఇరాన్‌కు సమాచారం ఇస్తే తప్పు.. అమెరికా ఇస్తే వ్యూహం!
చైనా ఇరాన్‌తో సమాచారాన్ని పంచుకుంటోందన్న ఆరోపణలపైనా ట్రంప్ మాట్లాడారు. అయితే అమెరికా కూడా ఇతర దేశాలతో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుంటుందని, ఉక్రెయిన్‌తో సహా పలు దేశాలకు నిఘా సమాచారాన్ని అందిస్తుందని చెప్పారు.
ఇక్కడ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సూత్రం కనిపిస్తోంది. ప్రత్యర్థి దేశం సమాచారం పంచుకుంటే అది అనుమానాస్పద కార్యకలాపం.. మనం పంచుకుంటే అది మిత్రదేశాలకు సహకారం! సమాచారం ఒక్కటే.. దాన్ని పంపించే దేశాన్ని బట్టి దానికి పెట్టే పేరు మారిపోతుందేమో! దౌత్యంలో భాషకు ఉన్న విలువ ఇదేనేమో!
ఎన్విడియా చిప్స్.. గూఢచర్యం చుట్టూ మరో కథ!
ఇదే ఇంటర్వ్యూలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వివాదం కూడా ప్రస్తావనకు వచ్చింది. చైనా వ్యాపారవేత్తగా పేర్కొంటున్న ఓ మహిళకు గూఢచర్య సంబంధాలు ఉన్నాయనే అనుమానాలపై ట్రంప్‌ను ప్రశ్నించారు. అయితే ఆమె గూఢచారి అని తనకు తెలియదని ఆయన సమాధానమిచ్చారు.
ప్రపంచం ఇప్పుడు ఏఐ చిప్స్ కోసం పోటీ పడుతోంది. అమెరికా, చైనాలు టెక్నాలజీ ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. అలాంటి సమయంలో చిప్స్ వ్యాపారం చుట్టూ గూఢచర్య అనుమానాలు కూడా చేరడంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు దేశాల రహస్యాలను తెలుసుకోవడానికి గూఢచారులు అవసరమయ్యేవారు. ఇప్పుడు టెక్నాలజీ, వ్యాపార సంబంధాలు, డేటా కూడా అదే స్థాయిలో కీలకంగా మారాయి.
చివరికి గూఢచారులకే గూఢచారులు అవసరమా?
ట్రంప్ వ్యాఖ్యలు విన్నాక అమెరికా, చైనాల మధ్య గూఢచర్య పోరులో ఎవరు బాధితులో, ఎవరు నిందితులో తేల్చడం అంత సులభం కాదనిపిస్తోంది. చైనా అమెరికాను గమనిస్తోంది.. అమెరికా చైనాను గమనిస్తోంది.. ఈలోగా ప్రపంచం మాత్రం ఈ ఇద్దరూ ఏం చేస్తున్నారో గమనిస్తోంది.
గూఢచర్యం విషయంలో ట్రంప్ చెప్పిన మాటలను బట్టి చూస్తే, కనీసం ఈ పోటీలోనైనా అమెరికా వెనుకబడలేదని ఆయనకు గట్టి నమ్మకం. మరి నిజంగా ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తున్నారు? ఆ విషయం తెలుసుకోవడానికి బహుశా మరో గూఢచారి అవసరమేమో!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







