సాఫ్ట్ వేర్ సేవలపై బగ్ ఎఫెక్ట్….సత్యనాదెళ్ల విచారం..!
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో తలెత్తిన భారీ ప్రపంచవ్యాప్త అంతరాయం… కస్టమర్లను ఇబ్బందులకు గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు సంస్థ సీఈవో సత్య నాదెళ్ల. ఈ సమస్యను ముందే నివారించడంలో తాము మరింత మెరుగ్గా పనిచేసి ఉండాల్సిందని ఆయన అంగీకరించారు. సాఫ్ట్‌వేర్‌లో నిద్రాణంగా ఉన్న ఒక బగ్ ఒక్కసారిగా నిర్దిష్ట యూజర్ ట్రాఫిక్‌ను ఎదుర్కోవడంతోనే ఈ వ్యవస్థ కుప్పకూలిందని స్పష్టం చేశారు.
టెస్టింగ్ ప్రక్రియలోనే ఇలాంటి లోపాలను గుర్తించడంలో విఫలమయ్యామని, ఒక చిన్న లోపం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుని ఉండాల్సిందని నాదెళ్ల పేర్కొన్నారు. గత వారం తొలుత ఔట్‌లుక్‌లో మొదలైన ఈ అంతరాయం.. ఆ తర్వాత క్రమంగా టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్ వంటి కీలక సేవలన్నింటికీ పాకింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు దాదాపు ఒక రోజుకు పైగా సేవలందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఏడాది మొదట్లోనే సిస్టమ్‌లోకి ప్రవేశించిన ఈ సాఫ్ట్వేర్ బగ్‌తో పాటు, విపరీతమైన ట్రాఫిక్, సర్వర్ సామర్థ్యం తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తేలింది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామం మొత్తం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాలును ప్రతిబింబిస్తోందని నాదెళ్ల విశ్లేషించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ద్వారా సాఫ్ట్వేర్ అభివృద్ధి, లోపాల గుర్తింపు వేగవంతమైనప్పటికీ.. ఆ ప్యాచ్‌లను అంతే వేగంగా పాత సాంకేతిక వాతావరణంలోకి చేర్చడం ఆపరేషనల్ రిస్క్‌లకు దారితీస్తోందని ఆయన హెచ్చరించారు. కొత్త అప్డేట్లను పాత వ్యవస్థలు తట్టుకోలేకపోవడం వల్ల ఇలాంటి అనుకోని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.







