బిజీ జీవితంలోనూ అందంగా, ప్రశాంతంగా ఉండాలా? జపాన్ మహిళల 7 అలవాట్లు ఇవే!
జపాన్ మహిళల జీవనశైలి వెనుక 7 రహస్యాలు.. బిజీ జీవితంలోనూ ప్రశాంతంగా, అందంగా ఉండాలంటే ఇవి పాటించండి!
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పనులు, వంట, పిల్లల బాధ్యతలతో చాలామంది మహిళలు బిజీగా ఉంటారు. తమ ఆరోగ్యం, అందం, విశ్రాంతి గురించి ఆలోచించడానికి కూడా సమయం దొరకదు. అయితే జపాన్ మహిళలు మాత్రం బిజీ జీవితంలోనూ తమను తాము చక్కగా చూసుకుంటూ ప్రశాంతంగా, హుందాగా కనిపిస్తుంటారు. దీనికి ఖరీదైన వస్తువులు, మేకప్ మాత్రమే కారణం కాదు. వారి రోజువారీ జీవనశైలిలోని కొన్ని చిన్న అలవాట్లు కూడా ముఖ్యమైనవే. అవేంటో తెలుసుకుందాం.
ఆరోగ్యం, అందం, మానసిక ప్రశాంతతకు జపాన్ మహిళలు పాటించే 6 మంచి అలవాట్లు

అవసరం లేని వస్తువులకు దూరం : జపాన్ జీవనశైలిలో వస్తువులను తక్కువగా ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. దీనిని ‘దన్శారి’ అంటారు. అంటే అవసరం లేని వాటిని వదిలేయడం. ఇంట్లో పాత డబ్బాలు, విరిగిన గిన్నెలు, ఉపయోగించని వస్తువులను దాచిపెట్టకుండా తొలగిస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. చుట్టూ ఉండే గందరగోళం తగ్గడం మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది.
కడుపు 80 శాతం నిండగానే తినడం : జపాన్‌లో ‘హర హచిబు’ అనే ఆహారపు అలవాటు ఉంది. కడుపు పూర్తిగా నిండకముందే, సుమారు 80 శాతం నిండినప్పుడు తినడం ఆపేస్తారు. చిన్న గిన్నెల్లో అన్నం, కూరగాయలు, చేపలు, సూప్ వంటి ఆహారాన్ని తీసుకుంటారు. అతిగా తినకుండా ఉండటం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
రోజూ నడవడానికి ప్రాధాన్యత : ప్రతిరోజూ వ్యాయామం చేయలేకపోయినా నడకను మాత్రం వదలకూడదు. జపాన్‌లో చాలామంది మహిళలు మార్కెట్‌కు వెళ్లడం, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం వంటి పనుల్లో నడకకు ప్రాధాన్యత ఇస్తారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం శారీరక ఆరోగ్యానికి మంచిది.
మేకప్ కంటే చర్మ సంరక్షణ ముఖ్యం : చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించడం వంటి అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఖరీదైన బ్యూటీ ఉత్పత్తుల కంటే క్రమం తప్పకుండా చర్మ సంరక్షణ చేసుకోవడం ముఖ్యం.
ఇవి కూడా చదవండి
దుస్తులు, నడకలో హుందాతనం : ఖరీదైన దుస్తులే అందాన్ని పెంచవు. శుభ్రంగా, చక్కగా ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించడం, జుట్టును సరిచేసుకోవడం, నిటారుగా కూర్చోవడం, నడవడం వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన హుందాతనాన్ని ఇస్తాయి.
స్నానం, నిద్రకు సమయం కేటాయించడం : రాత్రి వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. పడుకునే ముందు ఫోన్‌కు దూరంగా ఉండి తగినంత నిద్రపోవాలి. నిద్ర శారీరక ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా అవసరం.
రోజులో కొంత సమయం తమ కోసం : ఇదే మహిళలు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిన విషయం. జపాన్ సంస్కృతిలో ‘ఇక్కిగాయ్’ అనే భావన ఉంది. జీవితానికి ఒక అర్థం, ఆనందాన్ని ఇచ్చే లక్ష్యాన్ని కనుగొనడం దీని ప్రధాన ఉద్దేశం. మనసుకు నచ్చిన పని చేయడం, ప్రశాంతంగా టీ తాగడం, పుస్తకం చదవడం వంటి చిన్న పనుల కోసం రోజూ 15 నిమిషాలు కేటాయించాలి.
ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. కుటుంబం కోసం ఎంత కష్టపడినా తమ ఆరోగ్యం, ఆనందాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటి పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటూ, తమ కోసం కూడా కొంత సమయం కేటాయించాలి. అందంగా, ప్రశాంతంగా కనిపించడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లను జీవితంలో భాగం చేసుకుంటే చాలు.







