ఆఫీసులకు సెలవు పెట్టి మరీ ఆడుతున్నారా.. జీటీఏ 6 అంటే ఏమిటి? దీని క్రేజ్ ఇంతలా ఎందుకుంది?
ప్రపంచవ్యాప్తంగా జీటీఏ 6 వీడియో గేమ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. చాలా మంది గేమ్ ఆడటానికి ఆఫీసులకు సెలవులు తీసుకుంటున్నారని, రాత్రంతా గదుల్లో కూర్చుని ఆడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంట్లోనే ఉండి ఆడటం వల్ల ఫుడ్ డెలివరీ ఆర్డర్లు పెరుగుతాయని కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి. అసలు ఇది మామూలు వీడియో గేమ్ కాదు, తెరపై నడిచే ఒక పెద్ద హాలీవుడ్ సినిమా లాంటి అనుభవాన్ని ఇస్తుందని అభిమానులు చెబుతున్నారు. బటన్లు నొక్కి పాయింట్లు సాధించే సాధారణ ఆటలా కాకుండా, 18 ఏళ్లు పైబడిన పెద్దల కోసం దీన్ని రూపొందించారు.
సినిమా లాంటి గేమ్‌ప్లే.. ఆటగాడి చేతిలోనే కథ
ఈ గేమ్‌ను ఒక సినిమాగా భావిస్తే, ఆటగాడు అందులోని పాత్రలోకి ప్రవేశించి కథను తనకు నచ్చినట్లు నడిపిస్తాడు. ఆటగాడు చేసే పనులను బట్టి కథ మారుతూ ఉంటుంది. కారు నడుపుతూ రెడ్ సిగ్నల్ దాటితే పోలీసులు వెంబడిస్తారు, కాల్పులు, ఘర్షణలు జరిగి జైలుకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అదే సిగ్నల్ వద్ద ఆగితే కథ మరోలా సాగుతుంది. గోల్ఫ్ ఆడటం, పార్కులో కూర్చోవడం, కళ్ల ముందే ప్రమాదం జరిగితే ఒకరిని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లడం లేదా మిషన్లు పూర్తి చేయడం వంటి ఎన్నో అవకాశాలు ఇందులో ఉంటాయి.
వైస్ సిటీ నేపథ్యం, జాసన్ లూసియా కథ
ఈ గేమ్ కథ అమెరికాలోని మయామిని పోలి ఉండే వైస్ సిటీ అనే కల్పిత నగరంలో, లియోనిడా రాష్ట్ర నేపథ్యంలో సాగుతుంది. సముద్రం, తాటి చెట్లు, ఎత్తైన భవనాలు, రాత్రి వెలుగులు అన్నీ మయామిని తలపిస్తాయి. 1997లో మొదలైన గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిరీస్‌లో ఇది ఆరో భాగం. ఇందులో జాసన్ డువాల్, లూసియా అనే ఇద్దరు ప్రధాన పాత్రలు ఉంటారు. జాసన్ సైన్యం తర్వాత డ్రగ్ మాఫియా వైపు వెళ్లగా, లూసియా తన కుటుంబం కోసం పోరాడి జైలు నుంచి బయటపడుతుంది. వీరిద్దరూ ఒక జంటగా నేర ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, ఒకరినొకరు నమ్ముకుంటూ ముందుకు సాగుతారు.
పాత్రల మార్పిడి, స్వేచ్ఛా సంచారం , విమర్శలు
ఆటగాడు అవసరాన్ని బట్టి జాసన్ లేదా లూసియా పాత్రల మధ్య మారవచ్చు. ఒక పాత్రను మనం నియంత్రిస్తుంటే, మరో పాత్రను గేమ్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తుంది. కలిసి తిరగడం, డ్రైవింగ్ చేయడం వంటివి చేయవచ్చు. మిషన్లు లేకుండా నగరంలో స్వేచ్ఛగా తిరగడం, బీచ్‌లో కూర్చోవడం, జిమ్‌కు వెళ్లడం లేదా నేరాలకు పాల్పడటం వంటివి చేయవచ్చు. నేరాల చుట్టూ కథ తిరుగుతుండటంపై కొందరు విమర్శలు చేసినా, ఇది కేవలం ఒక కల్పిత వినోద సాధనం మాత్రమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా గేమింగ్ ప్రపంచంలో జీటీఏ 6 కొత్త సంచలనంగా నిలుస్తోంది.







