రెండేళ్ల బుడతడి వీడియోకు 13.8 కోట్ల వ్యూస్.. చివరికి అతడికి దక్కిన గిఫ్ట్ తెలిస్తే షాకవుతారు!
ఇప్పుడున్న సోషల్ మీడియా రోజుల్లో ఎప్పుడు ఎవరు వైరల్ అవుతారో, ఎవరి జీవితం ఒక్కసారిగా మారిపోతుందో చెప్పడం కష్టమే! ఒక్క చిన్న వీడియో చాలు.. రాత్రికి రాత్రే ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చు. అచ్చం అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. రెండేళ్ల బుడతడు తన ముద్దుముద్దు పోజులతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేశాడు. అతడి వీడియోకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13.8 కోట్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోతో వచ్చిన పాపులారిటీ కంటే ఇప్పుడు అతడికి దక్కిన మరో అదృష్టం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే.. ఆ చిన్నారి చదువు ఖర్చులన్నీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు తానే భరిస్తానని ఓ హోండా షోరూమ్ యజమాని ముందుకొచ్చారు!
View this post on Instagram
కొత్త స్కూటర్ డెలివరీకి వెళ్లి.. సోషల్ మీడియా స్టార్‌గా మారాడు!
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన రుద్రాంశ్ సింగ్ ఠాకూర్ అనే రెండేళ్ల చిన్నారినే ఇప్పుడు అందరూ ‘ఆరా కిడ్’ (Aura Kid) అని పిలుస్తున్నారు. నవంబర్ 9న రుద్రాంశ్ తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి కొత్త హోండా యాక్టివా స్కూటర్‌ను తీసుకోవడానికి షోరూమ్‌కు వెళ్లాడు. కుటుంబమంతా కొత్త వాహనం వచ్చిందన్న ఆనందంలో ఉండగా, కెమెరా ముందు రుద్రాంశ్ ఇచ్చిన పోజులు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించాయి. కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, జీన్స్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా నిలబడ్డాడు. రెండేళ్ల పిల్లాడైనా ఏ మాత్రం బెరుకు లేకుండా కెమెరా ముందు కనిపించిన అతడి ఆత్మవిశ్వాసం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
13.8 కోట్ల వ్యూస్.. లక్షలాది మంది మనసులు గెలిచిన బుడతడు!
ఆ సమయంలో తీసిన చిన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. రుద్రాంశ్ హావభావాలు, అతడి స్టైలిష్ పోజులు చూసి నెటిజన్లు తెగ మురిసిపోయారు. ఇక వీడియోకు వస్తున్న స్పందన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నవంబర్ 19 నాటికి ఆ వీడియోకు 13.8 కోట్లకు పైగా వ్యూస్, 1.15 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి. అంతేకాదు, 68 వేలకు పైగా కామెంట్లు, 25 లక్షలకు పైగా షేర్లు నమోదయ్యాయి. దీంతో ఈ చిన్నారి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ‘ఆరా కిడ్’గా అతడికి ప్రత్యేక గుర్తింపు వచ్చేసింది.
ఇవి కూడా చదవండి
వైరల్ వీడియో చూసి.. చదువు బాధ్యత తీసుకున్న షోరూమ్ యజమాని!
అయితే ఈ కథలో అసలైన ఆసక్తికరమైన విషయం ఇక్కడే మొదలైంది. రుద్రాంశ్ కుటుంబం కొత్త స్కూటర్ కొనుగోలు చేసిన సాయి పాయింట్ హోండా షోరూమ్ యజమాని దిలీప్ బోబాడే పాటిల్ కూడా ఈ వీడియోను చూశారు. చిన్నారికి సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణ చూసి ఆయన ఎంతో సంతోషించారు. వెంటనే రుద్రాంశ్ కుటుంబాన్ని మరోసారి షోరూమ్‌కు ఆహ్వానించి, వారిని ప్రత్యేకంగా అభినందించారు. అంతటితో ఆగకుండా రుద్రాంశ్ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి కిండర్‌గార్టెన్‌లో చేరినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు చదువుకు అయ్యే ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని ప్రకటించారు. రెండేళ్ల వయసులోనే ఇలాంటి విద్యా భరోసా లభించడం నిజంగా ఆ కుటుంబానికి మర్చిపోలేని అనుభవమే!
బహుమతుల కంటే విలువైన కానుక!
ఈ విషయాన్ని కంటెంట్ క్రియేటర్ యశ్ చించోల్కర్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. వైరల్ కావడంతో చిన్నారికి ఎన్నో బహుమతులు అందుతున్నప్పటికీ, అతడి భవిష్యత్తును తీర్చిదిద్దేలా చదువు బాధ్యత తీసుకోవడం మాత్రం వాటన్నింటికంటే గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక తన కుమారుడి వీడియోకు వస్తున్న స్పందన చూసి రుద్రాంశ్ తల్లి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఇతర చిన్నపిల్లల వీడియోలు చూసి మురిసిపోయేవాళ్లమని, ఇప్పుడు తన కొడుకు వీడియోను చూసి ఇంతమంది ప్రేమను పంచుతుండటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పినట్లు సమాచారం.
చిన్న వీడియో.. పెద్ద భరోసా!
నిజానికి రుద్రాంశ్ కొత్త స్కూటర్ దగ్గర సరదాగా ఇచ్చిన కొన్ని పోజులే ఈ కథకు ఆరంభం. కానీ ఆ చిన్న వీడియో అతడికి కోట్లాది మంది అభిమానులను సంపాదించడమే కాకుండా, చదువు విషయంలోనూ ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే గుర్తింపు కొన్నిసార్లు కొన్ని రోజుల్లోనే మాయమైపోవచ్చు. కానీ చదువుకు లభించిన ఈ భరోసా మాత్రం ఆ చిన్నారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు నెటిజన్లు రుద్రాంశ్ వీడియోను చూసి నవ్వుకోవడమే కాదు.. అతడికి దక్కిన ఈ మంచి అవకాశాన్ని చూసి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







