ఈవ్ టీజింగ్ పై మంత్రి నారా లోకేష్ సీరియస్..!
తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఆకతాయిల వేధింపుల ఘటనను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అత్యంత తీవ్రంగా పరిగణించారు. పాఠశాలకు వెళ్లే దారిలో, బడి గేటు వెలుపల తమ చిన్న చెల్లెళ్లకు ఈవ్ టీజింగ్ ఎదురవుతోందన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ ‘ఎక్స్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విద్యార్థిని కూడా భయంతో పాఠశాలకు నడిచి వెళ్లే పరిస్థితి రావడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్, తిరుపతి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా పోలీసు యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థినులను వేధించే ఆకతాయిలపై తక్షణం ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, బాలికల పాఠశాల వద్ద నిరంతరం పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేసి, విద్యార్థినులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. తరగతి గదుల్లోనే కాకుండా, పాఠశాలకు వచ్చే దారిలో కూడా పిల్లలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేష్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి
కాగా, రైల్వేకోడూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో వందలాది మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇటీవల ఆ పాఠశాల ప్రధాన గేటు పక్కనే భారీగా చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన రావడంతో పాటు, అక్కడ ఆకతాయిలు గుమిగూడి బడికి వచ్చే బాలికలను వేధిస్తున్నారని విద్యార్థినులు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమస్యపై మీడియాలో ప్రసారమైన కథనాలను గమనించిన మంత్రి లోకేష్, రెండు రోజుల క్రితం చెత్త సమస్యపై స్పందించి అధికారులతో తక్షణమే శుభ్రం చేయించారు.
ఇప్పుడు శుక్రవారం ఉదయం ఈవ్ టీజింగ్ వీడియోపై కూడా అంతే వేగంగా స్పందించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన తిరుపతి జిల్లా పోలీసు అధికారులు, రైల్వేకోడూరు బాలికల పాఠశాల పరిసరాల్లో నిఘాను పెంచారు. వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తమ పిల్లల ఆవేదనను అర్థం చేసుకుని స్వయంగా విద్యాశాఖ మంత్రే స్పందించడం పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







