ఢిల్లీ లోనే తేల్చుకునే యోచనలో ఆదినారాయణ రెడ్డి..?
కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం కేటాయింపు వ్యవహారంలో రగిలిన రాజకీయ చిచ్చు ఇప్పుడు విజయవాడ దాటి దేశ రాజధాని ఢిల్లీకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి(Adinarayana Reddy) , తన అసంతృప్తిని నేరుగా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
విజయవాడలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ జరిపిన బుజ్జగింపు చర్చలు విఫలం కావడంతో, రాష్ట్ర స్థాయి నేతల వద్ద కాకుండా నేరుగా హస్తిన పెద్దల వద్దే ఈ పంచాయతీ తేల్చుకోవాలని ఆదినారాయణ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీతో పాటు మరికొందరు ఢిల్లీ పెద్దలు తనతో ఫోన్లో మాట్లాడారని ఆదినారాయణ రెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. తనకు బీజేపీ అధిష్ఠానం పూర్తి మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, కడప జెడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో ఎక్కడ మోసం జరిగింది, అభ్యర్థుల మార్పు వెనుక ఎవరున్నారో ఆధారాలతో సహా జాతీయ నాయకత్వానికి వివరించేందుకు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఒకవైపు తన సోదరుడి కుమారులైన జెడ్పీటీసీ సభ్యులు రాజీనామాలకు సిద్ధపడగా, తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంపై శనివారం ఉదయం తుది నిర్ణయం ప్రకటిస్తానని ఆదినారాయణ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయ లోపం ఉందని బహిరంగంగానే విమర్శించిన ఆయన, ఢిల్లీ పర్యటనలో జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో బీజేపీ నేతలకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైతే, అది ఏపీ కూటమి రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.







