దమ్ముంటే నాపై పోటీ చేయ్ రేవంత్.. హరీశ్ రావు సవాల్!
సిద్దిపేట నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్కు కంచుకోటగా భావించే సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు అంతే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి తనపై పోటీకి రావాలని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ సవాల్ విసిరారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం వ్యక్తిగత దూషణలకు, బాడీ షేమింగ్‌కు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.
సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించినట్లే సిద్దిపేటలో హరీశ్ రావు పనిపడతామని సవాల్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు, సీఎం ప్రసంగంలో అభివృద్ధి అజెండా కంటే అబద్ధాలు, బూతులే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి తన పేరుతో పాటు కేసీఆర్, కేటీఆర్ పేర్లను ఏకంగా 140 సార్లు జపించారని, దీన్నిబట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే ఎంత భయముందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. పైగా, స్థానికంగా జనం రాకపోవడంతో 26 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేసి సభను నడిపించారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై, అవినీతిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలన పతనం అంచున ఉందనడానికి ఇదే నిదర్శనమని హరీశ్ రావు విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సింది పోయి, తన ఎత్తును, కేటీఆర్ గడ్డాన్ని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేయడం సీఎం ఫ్రస్ట్రేషన్‌కు నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. అబద్ధాలు చెప్పడంలో కమలహాసన్‌ను మించిన నటుడని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చిల్లర ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ రాజకీయ విమర్శలన్నింటిలో కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు అంశం అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ నీటి ప్రయోజనాలకు నాడు, నేడు కాంగ్రెస్ పార్టీయే ద్రోహం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో తాము మంత్రులుగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాతే ఆ జీవో విడుదలైందని, దీనిపై అసెంబ్లీ వేదికగా ఆధారాలతో సహా నిరూపిస్తానని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నారని హరీశ్ రావు సంచలన ఆరోపణ చేశారు. నాగార్జునసాగర్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, దేవాదుల, శ్రీశైలం వద్ద మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఎండబెడుతోందని విమర్శించారు.
మొత్తంమీద సిద్దిపేట వేదికగా సాగిన ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించనుంది. ఒకవైపు రూ. 550 కోట్ల అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ కంచుకోటలో పాగా వేయాలని కాంగ్రెస్ చూస్తుంటే, మరోవైపు సెంటిమెంట్, నీటి పారుదల అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లు అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.







