పోలీసులకు చుక్కలు చూపించిన AI ఫొటో.. 48 గంటల తర్వాత బయటపడిన అసలు నిజం!
ఒక్కసారి ఊహించుకోండి.. మీ ఇంట్లోని టాయిలెట్లో నుంచి ఓ భారీ కొండచిలువ బయటకు వస్తున్నట్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? భయంతో గుండె ఆగినంత పనవుతుంది కదా! ఇటలీలోని ఓ కుటుంబానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టాయిలెట్లో కొండచిలువ ఉందంటూ ఓ తొమ్మిదేళ్ల బాలుడు చూపించిన ఫొటో చూసి అందరూ హడలిపోయారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఇంకేముంది.. అగ్నిమాపక సిబ్బంది, జంతు సంరక్షణ అధికారులు దాదాపు 48 గంటల పాటు ఆ పాము కోసం వెతుకుతూనే ఉన్నారు. తీరా చూస్తే అక్కడ పామే లేదు! ఇదంతా ఆ చిన్నారి ఏఐతో చేసిన ఓ చిలిపి పని అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
టాయిలెట్ ఫొటోతో మొదలైన అసలు కథ!
ఇటలీలోని కాస్టెల్ఫిడార్డో పట్టణంలో నవంబర్ 12న ఈ విచిత్ర ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటున్న సమయంలో బాత్రూమ్లోని టాయిలెట్‌ను ఫొటో తీశాడు. ఆ తర్వాత ఏఐ సాయంతో ఆ ఫొటోలోకి ఓ భారీ కొండచిలువను తీసుకొచ్చాడు. టాయిలెట్ నుంచి పాము బయటకు వస్తున్నట్లుగా చాలా సహజంగా కనిపించేలా చిత్రాన్ని తయారు చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ ఫొటోను పెద్దలకు చూపించి నిజంగానే అక్కడ కొండచిలువ కనిపించిందని నమ్మించాడు. ఏఐతో చేసిన ఆ చిన్న ప్రయోగం ఇంత పెద్ద హడావుడికి దారితీస్తుందని బహుశా ఆ బాలుడు కూడా ఊహించి ఉండడు.
పాము కోసం 48 గంటల పాటు వెతుకులాట!
ఫొటో చూసిన పెద్దలు నిజంగానే కొండచిలువ ఇంట్లోకి వచ్చిందని భయపడ్డారు. వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంట్లోని ప్రతి మూలా వెతికారు. కానీ పాము మాత్రం కనిపించలేదు. దీంతో అది ఎవరికీ తెలియకుండా తెరిచి ఉన్న కిటికీ నుంచి బయటకు వెళ్లిపోయి ఉంటుందని అనుమానించారు. మరుసటి రోజు జంతువుల సంరక్షణలో ప్రత్యేకత కలిగిన అధికారులు కూడా గాలింపులో చేరారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు బాలుడి ఫోన్లో ఉన్న అసలు ఫొటోను మరోసారి జాగ్రత్తగా పరిశీలించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఫొటోలో కనిపిస్తున్న కొండచిలువ నిజమైనది కాదు.. ఏఐ సృష్టించిన నకిలీ బొమ్మ మాత్రమే!
బాలుడి అల్లరి బయటపడింది!
అధికారులు బాలుడిని అడగడంతో తానే ఆ ఫొటోను ఏఐ సాయంతో తయారు చేసినట్లు ఒప్పుకున్నాడు. తన స్నేహితుడి ఇంట్లోని టాయిలెట్‌ను ఫొటో తీసి, అందులో కొండచిలువను జోడించినట్లు వివరించాడు. పెద్దలను నమ్మించాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు చెప్పి క్షమాపణలు కూడా కోరాడు. అయితే అతడి వయసు కేవలం తొమ్మిదేళ్లు కావడంతో ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
అమెరికాలోనూ ఇలాంటి ఏఐ అల్లరి.. కానీ పోలీసులకు భారీ పని!
ఇది ఒక్క ఇటలీకే పరిమితమైన కథ కాదు. అమెరికాలోనూ ఇలాంటి ఏఐ ప్రాంక్ పోలీసులను పరుగులు పెట్టించింది. 2025 అక్టోబర్‌లో మేరీల్యాండ్‌కు చెందిన మోషా గార్డెనర్ అనే మహిళ తన బెథెస్డా అపార్ట్మెంట్లోకి ఓ వ్యక్తి చొరబడినట్లు ఏఐతో నకిలీ ఫొటో తయారు చేసింది. ఇంట్లోకి ఎవరో వచ్చారని తన భర్తకు చెప్పడంతో అతడు వెంటనే 911కు ఫోన్ చేశాడు. పోలీసులు బయలుదేరిన తర్వాత ఆమె ఆ నకిలీ ఫొటోను కూడా పంపించింది. దీంతో ఏకంగా ఎనిమిది పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తప్పుడు అత్యవసర సమాచారం ఇవ్వడం, ప్రభుత్వ అధికారికి తప్పుడు ప్రకటన చేయడం వంటి అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. అయితే, 2026 ఆగస్టులో పోలీసు శాఖకు 90 రోజుల్లోగా 1,000 డాలర్లు విరాళంగా ఇచ్చేందుకు ఆమె అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆమెపై ఉన్న కేసులను కొట్టివేసేందుకు అంగీకారం కుదిరింది.
సరదాగా చేసిన పని.. ఇతరులకు పెద్ద తలనొప్పి!
ఈ ఘటనపై మోంట్గోమరీ కౌంటీ స్టేట్ అటార్నీ జాన్ మెక్‌కార్తీ స్పందిస్తూ, కొన్నిసార్లు సరదాగా చేసిన పనులు కూడా మనం ఊహించని పరిణామాలకు దారితీస్తాయని అన్నారు. ఇది ఒక జోక్‌లా అనిపించినా, పోలీసు శాఖకు ఎంతో విలువైన సమయం, వనరులను వృథా చేసిందని పేర్కొన్నారు.
నిజానికి ఏఐతో ఫొటోలు, వీడియోలు సృష్టించడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. చూడటానికి అచ్చం నిజమైనవాటిలా ఉండటంతో ఏది అసలో, ఏది నకిలీనో గుర్తించడం కూడా కష్టమవుతోంది. అయితే, సరదా కోసం చేసిన చిన్న ప్రయోగం కూడా అత్యవసర సేవలను తప్పుదోవ పట్టిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా మారుతుందో ఇటలీ బాలుడి ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







