ఆటగాళ్లను అమ్మేసిన దేశద్రోహి ఖవాజా: మాజీ క్రికెటర్..!
2018లో ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘శాండ్‌పేపర్‌గేట్’ వివాదం మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా రాసిన ఆత్మకథ ‘సబర్’ (Sabr) ద్వారా మరోసారి రచ్చకెక్కింది. ఈ ఉదంతంపై ఖవాజా చేసిన సంచలన వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఫానీ డివిలియర్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 40-50 ఏళ్ల తన క్రికెట్ అనుభవంలో ఖవాజా లాంటి ‘అతిపెద్ద దేశద్రోహి’ని ఎప్పుడూ చూడలేదని, తన స్వార్థం కోసం సహచర ఆటగాళ్లను అమ్మేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లకు మాత్రమే కాకుండా, జట్టులోని ప్రతి ఒక్కరికీ బాల్ ట్యాంపరింగ్ విషయం తెలుసని, 2017-18 యాషెస్ సిరీస్‌లోనూ బంతిని ట్యాంపర్ చేశారని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఖవాజా వ్యాఖ్యలను ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ‘పూర్తి అర్థరహితం’ అని కొట్టిపారేయగా, నాడు సాండ్‌పేపర్ ఉపయోగిస్తూ కెమెరాలకు చిక్కిన కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ తాజాగా ఖవాజా వాదనలకు మద్దతుగా నిలవడం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’ పత్రికకు రాసిన సుదీర్ఘ వ్యాసంలో, బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం జట్టులోని అందరికీ తెలుసని, సహచర ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కూడా దీనిని ప్రోత్సహించారని బాన్‌క్రాఫ్ట్ బాంబు పేల్చారు. కేవలం జట్టు మీడియా మేనేజర్ కేట్ హచిసన్ మినహా మిగతా వారందరికీ ఈ అక్రమ వ్యూహం గురించి అవగాహన ఉందని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.
మరోవైపు, ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్టను ఖవాజా దిగజార్చాడని ఫానీ డివిలియర్స్ విమర్శించారు. జట్టులోని స్నేహబంధాలను, క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఖవాజా పూర్తిగా తుంగలో తొక్కాడని అన్నారు. అయితే, ఈ వివాదంపై ప్యాట్ కమిన్స్ వైఖరిలో ఎనిమిదేళ్లుగా ఎలాంటి మార్పు లేదని, అప్పటి ఘటన తర్వాత కమిన్స్ జట్టును ఎంతో నిజాయితీతో పునర్నిర్మించారని అతని ఏజెంట్ నీల్ మాక్స్వెల్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కీలక నిర్ణయం తీసుకుంది. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగమైన ఆటగాళ్ల వాంగ్మూలాలను వినేందుకు ఒక ‘స్వతంత్ర వేదిక’ ఏర్పాటు చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బర్గ్ ప్రకటించారు. అయితే, ఎనిమిదేళ్ల నాటి విచారణను మళ్లీ తిరగదోడటం లేదని, ఎవరిపైనా కొత్తగా నిషేధాలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. సుమారు నెల రోజుల పాటు సాగే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఏ వివరాలను బహిర్గతం చేయాలనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.







