ఏపీలో 28 జిల్లా పరిషత్‌లలో ముగిసిన ఎన్నికల ఘట్టం..!
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రజా పరిషత్ (ZP) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ పరోక్ష ఎన్నికల్లో, అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు గానూ కూటమి ఏకంగా 27 జడ్పీ పీఠాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ దిశగా సత్తా చాటింది. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన భారీ మెజార్టీతో, ఆ 27 జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 27 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో తెలుగుదేశం పార్టీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1 స్థానాలు దక్కాయి. అలాగే వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీ 20, జనసేన 5, బీజేపీ 2 స్థానాలను దక్కించుకున్నాయి. జనసేనకు దక్కిన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాలన్నింటినీ మహిళా నేతలకే కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపునిచ్చారు. బీజేపీకి కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్ పీఠంతో పాటు ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయి.
ఇవి కూడా చదవండి
ఈ ఎన్నికల్లో పలు జిల్లాల నుంచి యువత, మహిళలు, ప్రముఖ రాజకీయ వారసులు జెడ్పీ పీఠాలను అధిరోహించడం విశేషం. విజయనగరం జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర, విశాఖపట్నం ఛైర్‌పర్సన్‌గా గాడు అలివేణి, ఏలూరు జిల్లాకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ ఎన్నికయ్యారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకు పరిటాల శ్రీరామ్, కడప జిల్లాకు పుత్తా నరసింహారెడ్డి, నెల్లూరు జిల్లాకు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం జిల్లాకు కందుల రామిరెడ్డి, గుంటూరుకు దారా అరుణ, బాపట్లకు పి. రోహిణి, పల్నాడుకు పి. రమాదేవి, ఎన్టీఆర్ జిల్లాకు కోట పుల్లమ్మ, చిత్తూరుకు ఎం. శైలజ, తిరుపతికి హేమలత జెడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.
అయితే కడప జెడ్పీ పీఠం టీడీపీకి కేటాయించడంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచినప్పటికీ, గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ పీఠాన్ని మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు గానూ వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 3, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. దీంతో స్పష్టమైన మెజార్టీ ఉన్న వైసీపీ అభ్యర్థులే అల్లూరి జిల్లా జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుని రాష్ట్రంలో పార్టీ పరువు నిలిపారు. మొత్తానికి 28 జిల్లా పరిషత్‌ల ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది.







