నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం!
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19 , 20, 2026 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, డిసెంబర్ 19న ఉదయం 10:30 గంటలకు జరగనున్న ప్రారంభ వేడుకలకు హాజరుకావాలని కోరినట్లు డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.
తెలుగు భాషా చరిత్రలో మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల లోపు బాలల కోసం, బాలల చేత నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు మహాసభలు ఇవని, తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలపై బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. శ్రీ నందమూరి తారక రామారావు కళా ప్రాంగణంలో, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రధాన వేదికపై నిర్వహిస్తున్న ఈ మహాసభలకు 30 దేశాల నుండి ప్రతినిధులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తమ ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహాసభల ముఖ్య సమన్వయకర్తలు డాక్టర్ కె. మురళీధర్ రెడ్డి, శ్రీ కోగంటి శ్రీకాంత్ , ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి. రామచంద్రరాజు తదితరులు ఉన్నారు.







