బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారా? మీకు కూడా బ్యాంకుల నుంచి ఈ ఫోన్లు రావచ్చు!
ఇంట్లో ఏదైనా అత్యవసర ఖర్చు వస్తే చాలామంది ముందుగా ఆలోచించేది బంగారం గురించే. బ్యాంకులోనో, ఫైనాన్స్ కంపెనీలోనో నగలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే పని అయిపోతుందని భావిస్తారు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వ్యవసాయ అవసరాలు.. ఇలా ఎన్నో పనులకు బంగారమే అండగా నిలుస్తుంది. కానీ ఇప్పుడు అదే బంగారం కొందరికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
నెల రోజుల క్రితం నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నవారికి కూడా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తీసుకున్న అప్పుకు, ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువకు మధ్య తేడా వచ్చిందని, ఆ మొత్తాన్ని అదనంగా చెల్లించాలని అడుగుతున్నాయి. లేదంటే మరికొంత బంగారం తీసుకొచ్చి తాకట్టు పెట్టాలని చెబుతున్నాయి. బంగారం ధరలు భారీగా పడిపోవడంతో మొదలైన ఈ పరిణామాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా అప్రమత్తమైంది.
బంగారం ధర పడితే.. అప్పు తీసుకున్నవారికి కొత్త కష్టాలు!
బంగారం ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది తమ నగలను తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. అప్పట్లో నగల విలువ ఎక్కువగా ఉండటంతో ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బంగారం ధరలు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 30 శాతం పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అప్పట్లో తాకట్టు పెట్టిన నగల విలువ ఇప్పుడు తగ్గిపోయింది. రుణం మాత్రం అలాగే ఉండిపోయింది.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బంగారం విలువను బట్టి ఎంత రుణం ఇవ్వాలనే విషయంలో ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించింది. లోన్ టు వాల్యూ (LTV) నిబంధనల ప్రకారం, బంగారం విలువలో గరిష్ఠంగా 85 శాతం వరకు మాత్రమే రుణం ఇవ్వాలి. అయితే ధరలు భారీగా పడిపోవడంతో కొందరు రుణగ్రహీతల విషయంలో అప్పు మొత్తం ప్రస్తుత నగల విలువను కూడా మించిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రుణాల LTV నిష్పత్తి 100 శాతాన్ని దాటినట్లు ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
రోజూ ఫోన్లు.. మెసేజ్‌లు.. అదనంగా డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి!
ఈ సమస్య ఇప్పుడు కేవలం ఫైనాన్స్ కంపెనీల లెక్కల్లోనే లేదు. నేరుగా సామాన్యుల ఇళ్లకు చేరుకుంది. గోల్డ్ లోన్లు తీసుకున్నవారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి వరుసగా ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. నెల రోజుల క్రితమే లేదా రెండు నెలల క్రితమే నగలు తాకట్టు పెట్టినవారిని కూడా వదలడం లేదు. బంగారం ధర తగ్గిపోయిందని, రుణానికి అవసరమైన మార్జిన్‌ను భర్తీ చేయాలని కోరుతున్నాయి.
అంటే తీసుకున్న అప్పుకు, ఇప్పుడు తాకట్టు పెట్టిన నగల విలువకు మధ్య ఏర్పడిన తేడాను డబ్బుల రూపంలో చెల్లించాలి. అది సాధ్యం కాకపోతే మరికొంత బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాలి. ఒక బ్యాంకు పంపిన మెసేజ్‌లో కూడా బంగారం మార్కెట్ ధర నిరంతరం తగ్గుతున్నందున, అవసరమైన మార్జిన్ మొత్తాన్ని చెల్లించాలని లేదా అదనపు నగలు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. కొందరికి తమ నగలను వేలం వేసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు అందుతున్నాయి.
ఆర్బీఐ రంగంలోకి దిగడానికి కారణం ఇదే!
గోల్డ్ లోన్ మార్కెట్లో ఇలాంటి పరిణామాలు పెరుగుతుండటంతో ఆర్బీఐ కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ముంబైలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCs) ముఖ్య కార్యనిర్వాహక అధికారులతో సుమారు గంటన్నర పాటు సమావేశమైన ఆర్బీఐ అధికారులు, బంగారు రుణాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు రుణాల పంపిణీని ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న రుణాల విషయంలో వడ్డీని ప్రతి నెలా వసూలు చేయాలని ఆర్బీఐ సూచించింది. రుణం గడువు ముగిసిన తర్వాత మొత్తం వడ్డీని ఒకేసారి చెల్లించే విధానంపై ఎక్కువగా ఆధారపడకూడదన్నది ఈ సూచన వెనుక ఉద్దేశం. మరోవైపు గత 30 నుంచి 45 రోజులుగా గోల్డ్ లోన్ సంస్థలపై పర్యవేక్షణను కూడా ఆర్బీఐ పెంచినట్లు మనీకంట్రోల్ నివేదించింది. పెద్ద ఎన్బీఎఫ్సీలు తమ రుణాల వివరాలను నెలకు ఒక్కసారి కాకుండా మరింత తరచుగా అందించాలని కోరుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
పంట నష్టాలతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మరో దెబ్బ!
ఈ పరిణామాలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పంటలు సరిగా పండక, పెట్టుబడులు తిరిగి రాక ఇబ్బందులు పడుతున్న రైతులు అత్యవసర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు అదనంగా డబ్బులు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తే ఆ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది వారి ముందున్న ప్రశ్న.
గోల్డ్ లోన్లలో బకాయిలు పెరుగుతున్నాయా?
బంగారం ధరలు తగ్గడం ఒకవైపు ఉంటే, మరోవైపు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలోనూ కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం, గోల్డ్ లోన్లలో చెల్లింపులు ఆలస్యమవుతున్న రుణాల శాతం మార్చిలో 0.16 శాతంగా ఉండగా, ఆగస్టు చివరి నాటికి 0.3 శాతానికి పెరిగింది. సంఖ్య చిన్నదిగా కనిపించినా, పెరుగుతున్న ధోరణి మాత్రం రుణ సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.
రాబోయే రెండు మూడు త్రైమాసికాలు కీలకమే!
ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ బంగారం ధరలపైనే ఉంది. ధరలు త్వరగా కోలుకోకపోతే గోల్డ్ లోన్ సంస్థలు ఇచ్చిన రుణాల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు రాబోయే రెండు మూడు త్రైమాసికాలు గోల్డ్ లోన్ రంగానికి చాలా ఒత్తిడితో కూడుకున్నవిగా ఉండవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







