సీతమ్మ జనక్‌పూర్.. రాముడి అయోధ్య! మోదీ, బలేన్ షా కానుకలు గుర్తుచేస్తున్న భారత్-నేపాల్ ఆధ్యాత్మిక బంధం!
ఒకరు త్రివేణి సంగమం నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలాన్ని కానుకగా ఇస్తే.. మరొకరు సాక్షాత్తూ పరమశివుడి క్షేత్రమైన పశుపతినాథ్ ఆలయం నుంచి తెచ్చిన రుద్రాక్ష మాల, చందనాన్ని బహూకరించారు. చూడటానికి ఇవి చిన్న చిన్న బహుమతుల్లా అనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న అర్థాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఇవి కేవలం ఇద్దరు ప్రధానుల మధ్య జరిగిన కానుకల మార్పిడి కాదు.. భారత్, నేపాల్ మధ్య తరతరాలుగా కొనసాగుతున్న హిందూ సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీకలు!
నేపాల్ ప్రధాని బలేంద్ర షా (బలేన్ షా) తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. హైదరాబాద్ హౌస్‌లో ఇద్దరూ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ.. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని ఒక కలశంలో ఉంచి బలేన్ షాకు అందించారు. దానికి ప్రతిగా బలేన్ షా.. ఖాట్మండులోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం నుంచి తీసుకొచ్చిన రుద్రాక్ష మాల, చందనాన్ని మోదీకి బహూకరించారు.
ఇవి కూడా చదవండి
మరి ఈ రెండు కానుకలనే ఎందుకు ఎంచుకున్నారు? గంగాజలం, రుద్రాక్షలకు హిందూ సంప్రదాయంలో అంతటి ప్రాధాన్యం ఎందుకు ఉంది? అసలు ఈ కానుకల వెనుక ఉన్న కథేంటో తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
త్రివేణి సంగమం గంగాజలానికి అంతటి ప్రత్యేకత ఎందుకు?
ముందుగా మోదీ బహూకరించిన గంగాజలం గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న త్రివేణి సంగమం పేరు వినే ఉంటారు. గంగా, యమునా నదులు కలిసే ఈ ప్రాంతంలో సరస్వతీ నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని హిందువుల విశ్వాసం. అందుకే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి.
ఇక్కడ గంగానదిని కేవలం ఒక నదిగా చూడరు. గంగామాతగా భావించి పూజిస్తారు. ఆమె జలాన్ని పవిత్రతకు, దైవిక శక్తికి ప్రతీకగా ఆరాధిస్తారు. అందుకే గంగాజలం ప్రతి హిందూ కుటుంబంలోనూ ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూనే ఉంటుంది. పూజలు చేసినప్పుడు, పండుగలు జరుపుకున్నప్పుడు, శుభకార్యాలు నిర్వహించినప్పుడు గంగాజలాన్ని ఉపయోగించడం వెనుక ఉన్నది ఇదే నమ్మకం.
గంగాజలంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పవిత్రత కలుగుతుందని, ఆధ్యాత్మికంగా శుద్ధి పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంగాజలాన్ని ఒక కలశంలో ఉంచి మరొకరికి అందించడం అనేది సాధారణ బహుమతి ఇవ్వడం లాంటిది కాదు. అది పవిత్రతను, శుభాన్ని, దైవ ఆశీస్సులను అందించినట్లుగా భావిస్తారు.
ముఖ్యంగా త్రివేణి సంగమం అంటేనే హిందువులకు ఎంతో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. కుంభమేళా, అర్ధ కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. అలాంటి ప్రదేశం నుంచి తెచ్చిన గంగాజలాన్ని నేపాల్ ప్రధానికి అందించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఇదే.
శివుడి కన్నీటి నుంచి పుట్టిందా రుద్రాక్ష? ఆసక్తికరమైన పురాణ కథ!
ఇక బలేన్ షా అందించిన రుద్రాక్ష మాల విషయానికి వస్తే.. దాని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన పురాణ విశ్వాసం ఉంది. రుద్రాక్ష అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ‘రుద్ర’, ‘అక్ష’ అనే రెండు సంస్కృత పదాల కలయికే రుద్రాక్ష. రుద్రుడు అంటే పరమశివుడు. అక్ష అంటే కన్ను లేదా కన్నీటి బిందువు అని అర్థం.
శివపురాణం ప్రకారం పరమశివుడు ఒక సందర్భంలో కన్నీళ్లు కార్చగా, ఆ కన్నీటి బిందువుల నుంచే రుద్రాక్ష వృక్షాలు పుట్టుకొచ్చాయని చెబుతారు. అందుకే రుద్రాక్షను శివుడి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. శివభక్తులు, సాధువులు, సన్యాసులు రుద్రాక్ష మాలలను ధరించడం మనం తరచూ చూస్తుంటాం.
రుద్రాక్షను ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని, శివుడి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. పూజలు, ధ్యానం, జపం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ రుద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉంది. శివ మహాపురాణం, శ్రీమద్దేవీ భాగవతం వంటి పురాణ గ్రంథాల్లో కూడా దీని ప్రాధాన్యం ప్రస్తావించబడింది.
అలాంటి రుద్రాక్ష మాలను సాధారణంగా ఎక్కడి నుంచో తీసుకురాకుండా, నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం నుంచి తీసుకొచ్చి మోదీకి అందించడం ఈ కానుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
పశుపతినాథ్ ఆలయం అంటే నేపాల్ ఆధ్యాత్మిక హృదయం!
నేపాల్ రాజధాని ఖాట్మండులోని బాగ్మతీ నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం ఆ దేశంలోనే అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటి. పరమశివుడిని ఇక్కడ పశుపతినాథుడిగా కొలుస్తారు. ఆలయంలో శివలింగ రూపంలో స్వామివారిని పూజిస్తారు. నేపాల్ ప్రజలకే కాకుండా భారత్ సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే శివభక్తులకు కూడా ఈ ఆలయం ఎంతో ముఖ్యమైనది.
మహాశివరాత్రి వచ్చిందంటే ఈ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. దేశవిదేశాల నుంచి సాధువులు, సన్యాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివుడిని దర్శించుకుంటారు. పశుపతినాథ్ ఆలయ సముదాయం ఖాట్మండు లోయలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగంగా ఉంది. 1979లోనే దీనికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది.
అలాంటి ప్రసిద్ధ శివక్షేత్రం నుంచి తెచ్చిన రుద్రాక్ష మాలను మోదీకి అందించడం ద్వారా బలేన్ షా తన దేశంలోని ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా ఒక కానుకను అందించినట్లయింది.
రుద్రాక్షతో పాటు చందనం కూడా ఎందుకు ఇచ్చారు?
రుద్రాక్షతో పాటు బలేన్ షా చందనాన్ని కూడా అందించారు. హిందూ సంప్రదాయంలో చందనానికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం ఆలయాలకు వెళ్లినప్పుడు పూజారి నుదుటిపై చందనం పెట్టడం చూసే ఉంటాం. పూజా కార్యక్రమాల్లోనూ చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు.
అందుకే రుద్రాక్షతో పాటు చందనాన్ని అందించడం ద్వారా పశుపతినాథ్ ఆలయ సంప్రదాయాలకు సంబంధించిన మరో ఆధ్యాత్మిక అంశాన్ని కూడా ఈ కానుకలో భాగం చేశారు.
రామాయణం నుంచి మొదలైన బంధం.. భారత్, నేపాల్‌ను కలుపుతున్న ఆధ్యాత్మిక దారి!
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భారత్, నేపాల్ మధ్య ఇంతటి ఆధ్యాత్మిక అనుబంధం ఎందుకు ఉంది? దీనికి సమాధానం చెప్పాలంటే రామాయణాన్ని గుర్తు చేసుకోవాల్సిందే.
నేపాల్‌లోని జనక్‌పూర్‌ను సీతాదేవి జన్మస్థలంగా సంప్రదాయబద్ధంగా భావిస్తారు. భారతదేశంలోని అయోధ్యను శ్రీరాముడి జన్మస్థలంగా కొలుస్తారు. రామాయణంలో సీతారాముల వివాహం ఈ రెండు ప్రాంతాలను ఒకే ఆధ్యాత్మిక కథతో అనుసంధానించింది.
జనక్‌పూర్‌లో ఉన్న జానకీ మందిరం సీతాదేవికి అంకితం చేసిన ప్రసిద్ధ ఆలయం. మరోవైపు అయోధ్యలోని రామమందిరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. అందుకే భారత్, నేపాల్ మధ్య ప్రయాణించే భక్తులకు ఈ రెండు ప్రాంతాలు ముఖ్యమైన ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా మారాయి.
ఇది కేవలం పురాణ కథలకు సంబంధించిన అనుబంధం మాత్రమే కాదు. నేటికీ రెండు దేశాల ప్రజలు ఒకరి దేశంలోని పుణ్యక్షేత్రాలను మరొకరు సందర్శిస్తుంటారు. నేపాల్ నుంచి వేలాది మంది భక్తులు హరిద్వార్, రిషికేశ్, వారణాసి, గయ, వైష్ణోదేవి వంటి భారతీయ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. అలాగే భారతీయ భక్తులు పశుపతినాథ్ ఆలయం, జనక్‌పూర్‌లోని రామజానకీ ఆలయాలను దర్శించుకోవడానికి నేపాల్‌కు వెళ్తుంటారు.
రెండు దేశాలను దగ్గర చేస్తున్న రామాయణ సర్క్యూట్!
ఈ ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్, నేపాల్ ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. వారణాసి – ఖాట్మండు, బోధ్‌గయ – లుంబినీ, అయోధ్య – జనక్‌పుర్‌ధామ్ నగరాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే ప్రయత్నాలు అందులో భాగమే.
2018 మేలో రెండు దేశాలు కలిసి ఇండియా – నేపాల్ రామాయణ సర్క్యూట్‌ను ప్రారంభించాయి. రామాయణంతో సంబంధం ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానించి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. జనక్‌పూర్, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం భారత్ రూ.100 కోట్ల గ్రాంటును కూడా ప్రకటించింది.
ఇక భాషల విషయానికొస్తే హిందీ, నేపాలీ, మైథిలీ, భోజ్‌పురి, అవధీ వంటి భాషలు రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని తెలియజేస్తాయి. ఈ భాషల్లో అనేకం దేవనాగరి లిపిని ఉపయోగిస్తాయి. సంస్కృతం కూడా ఈ ప్రాంతాల మతపరమైన, సాహిత్య సంప్రదాయాలకు బలమైన పునాది వేసింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







