ఫుడ్ ట్రక్ దగ్గర భోజనం చేస్తున్న భారతీయులపై కోడిగుడ్ల దాడి! ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ద్వేషం?
విదేశాలకు వెళ్లి మంచి చదువు చదువుకోవాలని, ఉద్యోగం సంపాదించాలని, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించాలని చాలామంది భారతీయులు కలలు కంటుంటారు. ఆ కలలతోనే ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్తుంటారు. కానీ అక్కడికి వెళ్లాక కొందరికి ఎదురవుతున్న అనుభవాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులపై జాతి వివక్షతో కూడిన దాడులు, అవమానాలు, బెదిరింపులు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి.
తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఘటన చూస్తే అసలు మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనిపించకమానదు. రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ ట్రక్ దగ్గర ఓ భారతీయ కుటుంబం హాయిగా కూర్చుని భోజనం చేస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకుంటూ, తమ సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ వాహనంలోని కొందరు వ్యక్తులు ఆ కుటుంబంపై కోడిగుడ్లు విసిరి వెళ్లిపోయారు. అసలు వాళ్లు చేసిన తప్పేంటి? ప్రశాంతంగా భోజనం చేయడమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
భోజనం చేస్తున్న కుటుంబాన్ని వదలకుండా ఎందుకు టార్గెట్ చేశారు?
ఈ ఘటనను సిడ్నీలో నివసిస్తున్న భారతీయ మహిళ అంజలీ శర్మ తన కళ్లారా చూశారు. ఆఫీసు పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో వివరించారు.
రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ ట్రక్ దగ్గర ఓ భారతీయ కుటుంబం భోజనం చేస్తోంది. ఆ కుటుంబంలో పెద్దవాళ్లు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. అందరూ కలిసి ప్రశాంతంగా తమ భోజనం తింటున్నారు. అంతలో ఓ యుటీ ట్రక్ అటుగా వచ్చింది. ఆ వాహనంలో ఉన్న కొందరు వ్యక్తులు ఏమాత్రం కనికరం లేకుండా ఆ కుటుంబంపై కోడిగుడ్లు విసిరారు. ఆ కుటుంబం ఎలాంటి గొడవకు దిగలేదని, ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని అంజలీ చెబుతున్నారు.
ఈ దృశ్యం చూసిన ఆమెకు చాలా బాధ కలిగిందట. విదేశాల్లో ఉన్నా మనవాళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ, దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అన్నారు.
తన వీడియోతో పాటు అంజలీ చెప్పిన విషయం కూడా ఆలోచింపజేస్తోంది. ఆస్ట్రేలియా అనేది ఎన్నో దేశాలు, సంస్కృతులు, భాషలకు చెందిన ప్రజలు కలిసి జీవించే ప్రదేశం. అలాంటిచోట ఒకరినొకరు గౌరవించుకోవడం కనీస బాధ్యత. కానీ కేవలం ఒక దేశానికి చెందినవారనే కారణంతో అవమానించడం, వేధించడం ఎంతవరకు సమంజసం? ద్వేషాన్ని సాధారణ విషయంలా చూడకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ.. తప్పు ఎవరిది?
అంజలీ షేర్ చేసిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు భారతీయ కుటుంబానికి జరిగిన అవమానంపై తీవ్రంగా మండిపడుతుంటే, మరికొందరు ఆస్ట్రేలియాలో జాతి వివక్ష చాలా కాలంగా ఉందని చెబుతున్నారు. ఇంకొందరు అయితే వలసదారులపై స్థానికుల్లో అసహనం పెరుగుతోందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు భారతీయులు విదేశాల్లో ప్రవర్తించే తీరుపైనా చర్చ మొదలుపెట్టారు. కెనడా, అమెరికా వంటి దేశాల్లో భారతీయులు నీటి వనరుల్లో చెత్త వేస్తున్నట్లు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని, వాటిని చూసి స్థానికులు ఆగ్రహానికి గురవుతున్నారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే కొందరి ప్రవర్తనను మొత్తం భారతీయ సమాజానికి ఆపాదించడం ఎంతవరకు సరైనదనే ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతోంది.
ఆస్ట్రేలియా వదిలి భారత్‌కు వచ్చేయాలనుకుంటున్న మరో కుటుంబం!
ఇది ఒక్క ఘటనతోనే ఆగిపోలేదు. గత అక్టోబర్‌లో బ్రిస్బేన్‌లో నివసిస్తున్న మరో భారతీయ కుటుంబం కూడా జాతి వివక్షతో కూడిన దూషణలు, తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంది. ఆ ఘటన ఎంతవరకు వెళ్లిందంటే, చివరికి ఆ కుటుంబం ఆస్ట్రేలియాలో ఉండటమే వద్దనుకుని తిరిగి భారత్‌కు వచ్చేయాలని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
బ్రిస్బేన్‌లోని మార్నింగ్సైడ్ ప్రాంతంలో నివసిస్తున్న ఆ కుటుంబాన్ని ఓ యువకుడు జాతి వివక్షతో దూషించడంతో పాటు, వారు ఉంటున్న అపార్ట్మెంట్ భవనాన్ని పేల్చివేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి 19 ఏళ్ల హార్లీ ఆడమ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై విద్వేషపూరిత నేరాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశారు.
ఒకప్పుడు విదేశాల్లో స్థిరపడాలని ఎంతో ఆశతో వెళ్లిన కుటుంబం, ఇలాంటి బెదిరింపుల కారణంగా తిరిగి స్వదేశానికి రావాలనుకోవడం నిజంగా బాధాకరమైన విషయమే.
‘స్మెల్లీ ఇండియన్’ అంటూ నడిరోడ్డుపై అవమానం!
సిడ్నీలో నివసిస్తున్న నయోనికా భట్టాచార్యకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను జాతి వివక్షతో కూడిన పదాలతో దూషించాడు. ‘కర్రీ ముంచర్’, ‘స్మెల్లీ ఇండియన్’ అంటూ అవమానకరంగా మాట్లాడటంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అక్కడే నిలబడి ఎదురు తిరిగి గొడవ పడితే పరిస్థితి మరింత దిగజారవచ్చని భావించి, తలదించుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. న్యాయశాస్త్రం చదవడానికి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన 26 ఏళ్ల నయోనికా, ఇలాంటి పరిస్థితుల్లో భయపడుతూ జీవించాల్సి రావడం ఎంత బాధాకరం.
భారతీయులపై బెదిరింపులు.. సోషల్ మీడియాలోనూ వేధింపులే!
పెర్త్‌కు చెందిన ఆగి అనే కంటెంట్ క్రియేటర్ కూడా భారతీయులపై జరుగుతున్న వివక్ష గురించి తరచూ వీడియోలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న వలస వ్యతిరేక నిరసనలపై ఆయన మాట్లాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు సుమారు 26 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అయితే ఆయన వీడియోల కింద జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు, చివరకు ప్రాణహాని బెదిరింపులు కూడా వస్తున్నాయట. భారతీయులను ఎందుకు కొడతామో తెలుసా? అంటూ కొందరు బహిరంగంగా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ABC న్యూస్‌కు వివరించారు.
మరోవైపు బ్రిస్బేన్‌లో జరిగిన ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ అనే వలస వ్యతిరేక నిరసన కార్యక్రమంలో ఓ భారతీయుడు మాట్లాడుతుండగా కొందరు అతడిని చూసి అరుస్తూ, ఎగతాళి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







