“అందమైన మహిళ కనపడితే చాలు గూఢచారి అనేస్తారా?” – ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
చైనా నుంచి ఓ అందమైన మహిళ అమెరికాకు వస్తే చాలు.. ఆమెను గూఢచారి అని ముద్ర వేస్తారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఏఐ చిప్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా చుట్టూ ముసురుకున్న గూఢచర్యం వివాదంపై స్పందిస్తూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త ప్రశ్నలకు తెరలేపాయి.
ఒకవైపు ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌కు ఉన్నట్లు చెబుతున్న వివాహేతర సంబంధం.. మరోవైపు ఆమెకు చైనా నిఘా సంస్థతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు.. ఇంకోవైపు ఈ వ్యవహారంపై ముందే సమాచారం అందినా ట్రంప్ స్పందించలేదన్న కథనాలు.. వెరసి ఈ వివాదం ఇప్పుడు అమెరికా రాజకీయ, సాంకేతిక రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ట్రంప్‌కు కోపం తెప్పించిన న్యూయార్క్ టైమ్స్ కథనం!
నవంబర్ 22న ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ సంచలన కథనం ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆలిస్ హువాంగ్‌కు చైనాకు చెందిన అత్యున్నత గూఢచార సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS)తో ఏడాదికి పైగా నిరంతర సంబంధాలు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలకు తెలిసిన పలువురు వ్యక్తులు వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది.
జెన్సన్ హువాంగ్‌తో ఆమె రహస్య సంబంధం కొనసాగుతున్న సమయంలోనే ఈ పరిచయాలు కొనసాగాయని కథనం తెలిపింది. అంతేకాదు, చైనా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ అధికారులతోనూ ఆలిస్ సమావేశమైనట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇక్కడితో కథ ముగియలేదు. ఆలిస్ వ్యాపార భాగస్వామి కాంగ్ వీ పేరు కూడా ఈ వ్యవహారంలో తెరపైకి వచ్చింది. ఆలిస్ తన భర్తగా పరిచయం చేసిన కాంగ్ వీకి సైతం చైనా గూఢచార సంస్థతో సంబంధాలున్నట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
హువాంగ్ను మళ్లీ తీసుకోవాలంటున్న ట్రంప్!
ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టారు.
“ఎన్విడియా బోర్డు జెన్సన్ హువాంగ్ను తిరిగి నియమిస్తుందని ఆశిస్తున్నాను. అది కంపెనీకి మాత్రమే కాదు, అమెరికాకు కూడా ఎంతో మేలు చేస్తుంది” అంటూ రాసుకొచ్చారు.
అంటే, జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం మరింత ముదురుతున్నా ఆయనకు ట్రంప్ మద్దతు మాత్రం కొనసాగుతోంది. గతంలోనూ హువాంగ్ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని ట్రంప్ పలుమార్లు అభిప్రాయపడ్డారు.
ట్రంప్‌కు ముందే హెచ్చరికలు వచ్చాయా?
ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచార సంస్థకు సమాచారం అందిస్తున్నారనే అనుమానాల గురించి తనకు ఎవరూ చెప్పలేదని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.
కానీ న్యూయార్క్ టైమ్స్ కథనం మాత్రం మరో విషయాన్ని వెల్లడించింది. ట్రంప్‌కు సలహాదారులు కనీసం రెండుసార్లు ఆలిస్‌కు చైనా గూఢచార సంస్థతో సంబంధాలున్నాయన్న సమాచారాన్ని అందించినట్లు కథనంలోని వర్గాలు తెలిపాయి.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. అయినప్పటికీ ట్రంప్ ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదని కథనం పేర్కొంది.
“ఆమె గూఢచారి అని నాకు తెలియదు..”
ఆలిస్ హువాంగ్‌పై వస్తున్న ఆరోపణల గురించి గత వారం ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
“ఆమె గూఢచారి అని నాకు తెలియదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే.. చైనా నుంచి అందమైన మహిళ ఎవరైనా అమెరికాకు వస్తే, ఆమెను గూఢచారి అని చెప్పడం మొదలుపెడతారు” అని వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క వ్యాఖ్యతో వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఆలిస్పై వచ్చిన ఆరోపణలను ట్రంప్ తేలికగా తీసుకుంటున్నారా? లేక జెన్సన్ హువాంగ్‌కు తన మద్దతును మరోసారి స్పష్టం చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.
అసలు కథలో మెగాస్పీడ్ పాత్రేంటి?
ఈ వివాదంలో మెగాస్పీడ్ (Megaspeed) అనే సింగపూర్ కేంద్రంగా పనిచేసే కంపెనీ కూడా కీలకంగా మారింది. అత్యంత డిమాండ్ ఉన్న ఎన్విడియా చిప్స్‌ను పొందేందుకు ఈ సంస్థ ప్రయత్నించింది. ఆలిస్ హువాంగ్ ఈ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినట్లు కథనం పేర్కొంది.
ఇదే అంశం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్స్‌పై అమెరికా, చైనా మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్విడియా వంటి కీలక సంస్థతో సంబంధాలున్న వ్యక్తులపై గూఢచర్యం ఆరోపణలు రావడం అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన చర్చకు దారితీస్తోంది.
ఫైనల్ గా …
ఒక మహిళతో ప్రముఖ టెక్ కంపెనీ అధినేతకు ఉన్న వ్యక్తిగత సంబంధంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు చైనా గూఢచార సంస్థలు, అమెరికా నిఘా వ్యవస్థ, అత్యాధునిక ఏఐ చిప్స్, అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ వైఖరి వరకు విస్తరించింది.
ఆలిస్ హువాంగ్ నిజంగా చైనా గూఢచారిగా పనిచేశారనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఇవి నిఘా వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వెల్లడించిన ఆరోపణలు మాత్రమే. అయినప్పటికీ, ట్రంప్‌కు ముందే హెచ్చరికలు అందాయన్న కథనం, వాటిపై ఆయన స్పందించిన తీరు, జెన్సన్ హువాంగ్ను తిరిగి నియమించాలన్న ఆయన విజ్ఞప్తి ఈ వ్యవహారాన్ని మరింత ఇంట్రస్టింగ్ గా మార్చాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







