ట్రంప్‌కు మతిమరుపు వచ్చేసిందా? వయసు ప్రభావమా.. సొంత మంత్రి పేరే మర్చిపోయిన అధ్యక్షుడు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఏమైంది? వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతోందా? లేక పని ఒత్తిడి ప్రభావమా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే.. తన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఓ మంత్రి పేరును కూడా ట్రంప్ మర్చిపోయారట! అదీ ఇరాన్ యుద్ధం గురించి చర్చిస్తున్న సమయంలో. ఓ ప్రైవేట్ సంభాషణలో జరిగిన ఈ ఆసక్తికర ఘటనను ప్రముఖ రచయిత మైఖేల్ వోల్ఫ్ బయటపెట్టడంతో కొత్త వివాదం మొదలైంది.
ఇరాన్ యుద్ధంపై చర్చ.. మధ్యలోనే షాక్!
ది డైలీ బీస్ట్ కథనం ప్రకారం.. ట్రంప్‌తో తరచూ మాట్లాడే ఓ సన్నిహిత వ్యక్తి తనకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు మైఖేల్ వోల్ఫ్ తెలిపారు. ఇటీవల ఇరాన్లో నెలకొన్న పరిస్థితులపై ట్రంప్ ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడారట.
ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. “పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి?” అని ప్రశ్నించినట్లు సమాచారం. అందుకు ఆ వ్యక్తి అందుబాటులో ఉన్న మార్గాల గురించి మీకు మంచి అవగాహన ఉందని చెప్పగా.. “అన్ని మార్గాలూ సమస్యాత్మకంగానే ఉన్నాయి” అని ట్రంప్ బదులిచ్చారట.
‘పీట్ ఎవరు?’.. ట్రంప్‌కు ఏం గుర్తుకు రాలేదు?
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇరాన్ యుద్ధంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి.. “ఈ విషయంలో పీట్ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారట. ఇక్కడ పీట్ అంటే అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్.
కానీ ట్రంప్ మాత్రం ఒక్కసారిగా “పీట్ ఎవరు?” అని ప్రశ్నించారట. దీంతో అవతలి వ్యక్తి షాక్‌కు గురైనట్లు వోల్ఫ్ వెల్లడించారు. అమెరికా రక్షణ వ్యవహారాలను చూసే కీలక మంత్రి పేరు కూడా అధ్యక్షుడికి వెంటనే గుర్తుకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ తర్వాత విషయం అర్థమైన ట్రంప్.. హెగ్సెత్ ఇరాన్‌పై భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అందరితో ఒకటే మాట.. చెప్పిందే మళ్లీ చెబుతున్నారా?
ట్రంప్ జ్ఞాపకశక్తిపై మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా మైఖేల్ వోల్ఫ్ వెల్లడించారు. ట్రంప్ తనతో మాట్లాడిన విషయాలనే ఇతరులతోనూ మళ్లీ మళ్లీ చెబుతుంటారని, ఎవరితో ఏం మాట్లాడారో కూడా గుర్తుంచుకోలేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారట.
అందుకే తమ ప్రైవేట్ సంభాషణల వివరాలను బయటపెట్టినా తమ గుర్తింపు బయటపడుతుందనే భయం లేదని వారు భావిస్తున్నట్లు వోల్ఫ్ తెలిపారు.
డిమెన్షియా చర్చకు మళ్లీ ఆజ్యం!
ఇటీవల ట్రంప్ ప్రవర్తనపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రసంగాల్లో తడబడటం, ఆకస్మిక ఆగ్రహావేశాలు, బహిరంగ కార్యక్రమాల్లో నిద్రమత్తుగా కనిపించడం, కొన్ని విషయాలను మర్చిపోవడం వంటి అంశాలు ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలకు కారణమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు డిమెన్షియా ఉందా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే కేవలం ఈ ఘటన ఆధారంగా ఆయనకు అలాంటి వ్యాధి ఉందని నిర్ధారించలేం. ఈ ఆరోపణలపై ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు కూడా ఈ కథనంలో వెల్లడించలేదు.
యుద్ధ రహస్యాలు ఫోన్లోనేనా?
ఈ వ్యవహారంలో మరో ప్రమాదకరమైన అంశాన్ని కూడా పోడ్కాస్ట్ సహవ్యాఖ్యాత జొవానా కోల్స్ ప్రస్తావించారు. ఇరాన్‌తో యుద్ధం వంటి కీలక అంశంపై అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్ వెలుపల ఉన్న వ్యక్తులతో సాధారణ ఫోన్ సంభాషణల్లోనే వ్యూహాల గురించి చర్చించడం జాతీయ భద్రతకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
అలాంటి సంభాషణలను రష్యా, చైనా లేదా ఇరాన్ వంటి దేశాలు వింటున్నాయేమోనని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తానికి.. 80 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్ జ్ఞాపకశక్తిపై వచ్చిన ఈ తాజా ఆరోపణ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. నిజంగానే ఇది వయసు ప్రభావమా? లేక రాజకీయ ప్రత్యర్థులకు మరో అస్త్రమా? అన్నది పక్కన పెడితే.. సొంత ప్రభుత్వంలోని కీలక మంత్రి పేరునే అధ్యక్షుడు మర్చిపోయారన్న వార్త మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







