జనసేన పార్టీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ (Jana Sena Party) కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ శ్రేణులకు జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే పంచాయతీ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కావని పవన్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధి ( Villages Development )కి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఈ ఎన్నికల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రాజకీయపరమైన అడ్డంకులు ఉండకూడదని స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు (Nominations) దాఖలు చేసుకోవచ్చని పవన్ వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనాలనుకునే వారికి పార్టీ తరఫున ఎలాంటి రాజకీయపరమైన ఆంక్షలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.







