ఇరాన్‌తో యుద్ధానికి.. అమెరికా ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికుల పోరాటమే కాదు.. తెరవెనుక దేశ ఖజానాలను ఖాళీ చేసే భారీ ఆర్థిక వ్యవహారం కూడా! ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సైనికంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోందన్నది ఒక ఎత్తయితే.. ఈ పోరును కొనసాగించడానికి అగ్రరాజ్యం పెడుతున్న ఖర్చు ఇప్పుడు మరో సంచలనంగా మారింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు.. వీటి వెనుక ప్రతిరోజూ కరిగిపోతున్న డాలర్లు ఎన్ని? అసలు ఈ యుద్ధం అమెరికా ఖజానాపై ఎంతటి భారాన్ని మోపుతోంది?
తాజాగా పెంటగాన్ వెల్లడించిన గణాంకాలు చూస్తే కళ్లు చెదరాల్సిందే. అయితే బయటపెట్టిన ఈ లెక్కలే పూర్తి కథ కాదు. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా లెక్కించాల్సి ఉంది. అంటే అసలు యుద్ధ బిల్లు ఇంకా ఎంత పెరగనుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యుద్ధానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు?
అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ అంచనాల ప్రకారం.. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్ యుద్ధానికి నవంబర్ 13 నాటికి అమెరికా సుమారు 48.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 4.3 లక్షల కోట్లకు సమానం. అంటే కేవలం కొన్ని నెలల యుద్ధం కోసం అమెరికా వెచ్చించిన మొత్తం ఒక భారీ ఆర్థిక భారంగా మారింది.
ఈ వివరాలను అమెరికా నేవీ ఆర్థిక నిర్వహణ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పదవికి నామినేట్ అయిన ఆర్థర్ మిల్లర్ వెల్లడించారు. నవంబర్ 19న జరిగిన సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ నిర్ధారణ విచారణలో ఆయన ఈ అంచనాలను బయటపెట్టినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఈ ఖర్చులో ఏమేం ఉన్నాయి?
పెంటగాన్ లెక్కల్లో యుద్ధ నిర్వహణకు సంబంధించిన పలు వ్యయాలను చేర్చారు. సైనిక కార్యకలాపాల నిర్వహణ, యుద్ధంలో వినియోగించిన క్షిపణులు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి, దెబ్బతిన్న పరికరాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడం వంటి ఖర్చులు ఇందులో ఉన్నాయి.
అయితే ఈ గణాంకాల్లో ఒక కీలకమైన అంశం లేదు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడుల్లో మధ్యప్రాచ్యంలో దెబ్బతిన్న అమెరికా సైనిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఇందులో చేర్చలేదు. అంటే ప్రకటించిన రూ. 4.3 లక్షల కోట్లే తుది బిల్లు కాదన్నమాట.
అమెరికా స్థావరాలకు ఎంత నష్టం?
సెనేట్ విచారణ సందర్భంగా డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనిక స్థావరాలకు జరిగిన నష్టం ఎంతని ఆర్థర్ మిల్లర్‌ను ప్రశ్నించారు. అయితే, ఆ వివరాలు తన వద్ద లేవని మిల్లర్ సమాధానమిచ్చారు.
దీంతో కమిటీ రిపబ్లికన్ ఛైర్మన్ రోజర్ వికర్ జోక్యం చేసుకున్నారు. స్థావరాలకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి, వీలైనంత త్వరగా పూర్తి వివరాలు సమర్పించాలని మిల్లర్‌ను ఆదేశించారు.
రోజుకు వందల కోట్ల ఖర్చుతో నౌకాదళ దిగ్బంధం
యుద్ధ వ్యయం కేవలం ఆయుధాలు, సైనిక కార్యకలాపాలకే పరిమితం కాలేదు. ఇరాన్ నౌకా రవాణాపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధం కూడా భారీ ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ఈ అంశాన్ని డెమోక్రటిక్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ప్రస్తావించారు. ఇరాన్‌పై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దిగ్బంధానికి రోజుకు సుమారు 32.5 మిలియన్ డాలర్లు ఖర్చవుతోందని తెలిపారు. అంటే భారత కరెన్సీలో రోజుకు దాదాపు రూ. 290 కోట్లు!
బహ్రెయిన్ స్థావరానికి రూ. 3,500 కోట్లకు పైగా నష్టం?
ఇరాన్ దాడుల ప్రభావం అమెరికా సైనిక స్థావరాలపైనా తీవ్రంగా పడింది. ముఖ్యంగా బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం దాడుల్లో దెబ్బతింది. ఈ స్థావరం అమెరికా నావల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్, ఐదో నౌకాదళానికి కీలక కేంద్రంగా ఉంది.
ఈ దాడి వల్ల కనీసం 400 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఎలిజబెత్ వారెన్ పేర్కొన్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 3,560 కోట్లు. అయితే, ఈ నష్టంపై పూర్తి అంచనా ఇంకా సిద్ధం కాలేదని హంగ్ కావో తెలిపారు. దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించడం కష్టంగా ఉందని వివరించారు.
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌కు ఆమోదం కోరుతోంది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 133 లక్షల కోట్లు.
యుద్ధ భారం చివరకు సామాన్యులపైనే!
యుద్ధానికి ప్రభుత్వాలు చేసే ఖర్చు కేవలం రక్షణ బడ్జెట్లోని అంకెలతో ముగిసిపోదు. దాని ప్రభావం చివరకు సామాన్య ప్రజల జేబులకూ చేరుతుంది. అమెరికా కుటుంబాల విషయంలో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలు కుటుంబ బడ్జెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
ముఖ్యంగా ముడిచమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. డీజిల్ ఖరీదైతే ట్రక్కులు, నౌకలు, ఇతర రవాణా మార్గాల ద్వారా సరుకులను తరలించే ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ భారం క్రమంగా కూరగాయలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల ధరల్లో ప్రతిబింబిస్తుంది. విమాన ఇంధనం ఖరీదైతే విమాన ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
అంటే యుద్ధం చేసేది ప్రభుత్వాలు, పోరాడేది సైనికులు.. కానీ దాని ఆర్థిక మూల్యం చెల్లించాల్సి వచ్చేది మాత్రం చివరకు సామాన్య ప్రజలకే. ఇదే ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విసురుతున్న మరో పెద్ద సవాలు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







