బాలిలో 50 అడుగుల భారీ వినాయకుడు.. గిన్నిస్ రికార్డులో చోటు! ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటో తెలుసా?
సాధారణంగా వినాయకుడి విగ్రహం అంటే రాయి, మట్టి, లోహాలతో రూపొందించిన రూపాలే గుర్తుకొస్తాయి. కానీ ఇండోనేసియాలోని బాలిలో మాత్రం సరికొత్త ప్రయోగంతో ఓ భారీ గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. ఏకంగా 50 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తున్న ఈ వినాయకుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. అంతేకాదు.. తన ప్రత్యేక నిర్మాణ శైలితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్నాడు.
ప్లాస్టిక్ దారాలతో తయారీ.. ఇదే అసలు ప్రత్యేకత!
బాలిలోని జియాన్యార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ గణేశుడి విగ్రహం ఎత్తు 15.315 మీటర్లు. అంటే సుమారు 50 అడుగుల 2 అంగుళాలు. అయితే ఈ విగ్రహం ప్రత్యేకత కేవలం దాని ఎత్తులోనే లేదు. సింథటిక్ రట్టాన్ అనే పాలిథిలీన్ ఆధారిత పదార్థంతో దీనిని రూపొందించారు. ఈ పదార్థాన్ని ఉపయోగించి, ఆధార నిర్మాణంపై ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
126 మంది కళాకారుల కృషి..
ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని బాలిలోని అలాస్ హరుమ్ (Alas Harum Bali) సంస్థ రూపొందించింది. ఇందుకోసం 126 మంది స్థానిక కళాకారులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించారు. ఎన్నో రోజుల శ్రమతో సింథటిక్ రట్టాన్ను అల్లుతూ, గణేశుడి రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహాన్ని పర్యాటక కేంద్రం వద్ద ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సందర్శకులకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ప్రపంచంలోనే ఎత్తైన గణేశుడి విగ్రహమా?
ఈ వార్తలో ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయకుడి విగ్రహంగా దీనికి రికార్డు రాలేదు. ఎందుకంటే అంతకంటే ఎత్తైన గణేశుడి విగ్రహాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సింథటిక్ రట్టాన్తో, ఆధార నిర్మాణంపై రూపొందించిన అత్యంత ఎత్తైన శిల్పంగా ఇది రికార్డు సృష్టించింది. విగ్రహంతో పాటు పీఠాన్ని కలిపితే మొత్తం ఎత్తు 72 అడుగులకు పైగా ఉంటుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
ముస్లిం దేశంలో హిందూ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు!
ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేసియా. అయితే ఆ దేశంలోని బాలి ద్వీపం మాత్రం హిందూ సంప్రదాయాలకు ప్రసిద్ధి. ఇక్కడ హిందూ దేవాలయాలు, పూజా సంప్రదాయాలు, రామాయణం, మహాభారత ఇతిహాసాల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు బాలిలో ఎంతో ప్రాచుర్యం పొందాయి.
ఈ నేపథ్యంలో 50 అడుగుల భారీ గణేశుడి విగ్రహం అక్కడ ఏర్పాటు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దిల్లీలోని ఇండోనేసియా రాయబార కార్యాలయం సైతం ఈ విశేషాన్ని తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. మొత్తానికి భిన్నమైన నిర్మాణ సాంకేతికత, 126 మంది కళాకారుల ప్రతిభ, గణేశుడి భారీ రూపం.. ఈ మూడు అంశాలు బాలిలోని వినాయకుడిని ప్రపంచ రికార్డుల జాబితాలో నిలిపాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







