ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్: మనల్ని ఫాలో చేయని వాళ్లను గుర్తించి అన్‌ఫాలో చేసేయచ్చు!
ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు వందల మందిని ఫాలో అవుతున్నారు. కానీ వారిలో ఎంతమంది మిమ్మల్ని తిరిగి ఫాలో చేస్తున్నారో తెలుసా? ఒక్కొక్కరి ప్రొఫైల్ తెరిచి చూసుకుంటూ కూర్చోవాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ పనిని ఏఐనే చేసిపెడుతుంది. మనల్ని ఫాలో చేయని వాళ్లెవరో గుర్తించడమే కాదు.. వాళ్లను అన్‌ఫాలో చేయాలా అని కూడా అడుగుతుంది. మెటా తీసుకొచ్చిన మ్యూస్ (Muse) ఏఐ అసిస్టెంట్‌తో ఇలాంటి పనులు సులభమవుతున్నాయి. ఇన్నాళ్లూ స్నేహితులు, పరిచయస్తులు, సెలబ్రిటీలను ఫాలో అవుతూ వచ్చిన సోషల్ మీడియా వినియోగదారులు.. ఇప్పుడు తమను ఎవరు ఫాలో చేస్తున్నారు? ఎవరు పట్టించుకోవడం లేదు? అనే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ సౌకర్యం నిజంగా ఉపయోగకరమా? లేక సోషల్ మీడియా సంబంధాలను మరింత సంక్లిష్టంగా మారుస్తుందా?
ఒక్క ఆదేశం.. ఫాలో బ్యాక్ చేయని వాళ్ల జాబితా రెడీ!
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎవరినైనా ఫాలో చేసినప్పుడు, వాళ్లు కూడా మనల్ని ఫాలో చేస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే కొంత కష్టపడాల్సిందే. ముఖ్యంగా వేలాది మందిని ఫాలో అయ్యేవాళ్లకు ఈ పని మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కరి ప్రొఫైల్ తెరిచి పరిశీలించడం అంటే చాలా సమయం వృథా అవుతుంది. ఇక్కడే మెటా మ్యూస్ ఉపయోగపడుతుంది.
మ్యూస్‌కు మనకు కావాల్సిన ఆదేశం ఇస్తే చాలు. మనల్ని తిరిగి ఫాలో చేయని ఖాతాలను గుర్తించి ఒక జాబితాగా తయారుచేస్తుంది. యూజర్ పేర్లు, ప్రొఫైల్ లింకులు, ఇతర వివరాలను క్రమపద్ధతిలో చూపిస్తుంది. ఆ తర్వాత ఆ ఖాతాలను అన్‌ఫాలో చేయాలా అని అడుగుతుంది. అంటే మన ఫాలోయింగ్ లిస్టును మనమే పరిశీలించాల్సిన పనిని ఏఐ సులభతరం చేస్తుందన్నమాట.
ఫాలోయింగ్ లిస్ట్ క్లీన్ చేసుకోవాలనుకునేవారికి ఉపయోగమే!
ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మొదట్లో ఆసక్తితో ఎన్నో ఖాతాలను ఫాలో అవుతుంటారు. కాలక్రమంలో వాటిలో కొన్ని మనకు అవసరం లేనివిగా మారిపోతాయి. కొందరు ప్రమోషనల్ పేజీలు, మరికొందరు తాత్కాలికంగా ఆసక్తి కలిగించిన వ్యక్తులను ఫాలో అయి ఉంటారు. కానీ వాటిని తొలగించుకోవడం మాత్రం మర్చిపోతుంటారు. ఫలితంగా ఫాలోయింగ్ జాబితా పెరిగిపోతుంది.
ఇలాంటి సందర్భాల్లో మ్యూస్ మంచి అసిస్టెంట్‌గా ఉపయోగపడుతుంది. మనల్ని ఫాలో చేయని ఖాతాలను గుర్తించడంతో పాటు, అవసరం లేని ఫాలోయింగ్‌ను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. దీంతో మనకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, పేజీలకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు సమయం ఆదా అవుతుంది. ప్రతి పనిని మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
ఫాలో బ్యాక్ చేయలేదని అన్‌ఫాలో చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం ఒకరిని ఫాలో చేస్తున్నాం కాబట్టి వాళ్లు కూడా మనల్ని ఫాలో చేయాలనే నియమం ఏమీ లేదు కదా! కొందరు తమకు తెలిసిన ప్రతి ఒక్కరినీ ఫాలో చేయరు. మరికొందరు సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోరు. ఇంకొందరు తమకు నచ్చిన కంటెంట్ మాత్రమే చూస్తుంటారు. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఫాలో చేయలేదని వెంటనే అన్‌ఫాలో చేయడం అవసరమా?
సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అనేది చాలామందికి స్నేహానికి గుర్తుగా మారిపోయింది. మనం ఫాలో చేస్తే వాళ్లు కూడా చేయాలి, లేదంటే మనం ఎందుకు చేయాలి అనే ఆలోచన పెరుగుతోంది. ఇది కొంతవరకు వ్యక్తిగత ఎంపికే అయినా, ఫాలో బ్యాక్ చేయలేదనే కారణంతో పరిచయాలను కూడా లెక్కల్లోకి తీసుకురావడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. నిజ జీవితంలో మనతో మంచి సంబంధం ఉన్న వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో మనల్ని ఫాలో చేయకపోవచ్చు. దానర్థం మనల్ని పట్టించుకోవడం లేదని కాదు.
ప్రైవసీ విషయంలోనూ జాగ్రత్త అవసరం
ఏఐ మన సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించి వివరాలు అందించడం సౌకర్యంగానే అనిపిస్తుంది. కానీ ఆ సమాచారాన్ని ఎలా యాక్సెస్ చేస్తోంది? మన ఖాతాకు సంబంధించిన ఏయే వివరాలను పరిశీలిస్తోంది? వాటి భద్రత ఎలా ఉంటుంది? అనే విషయాలపై కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా తెలియని థర్డ్‌పార్టీ యాప్‌లకు ఇన్స్టాగ్రామ్ లాగిన్ వివరాలు లేదా ఖాతా యాక్సెస్ ఇవ్వడం ప్రమాదకరం.
మ్యూస్ ఇచ్చే సమాచారాన్ని కూడా ఒకసారి పరిశీలించడం మంచిది. ఏఐ అందించిన జాబితానే తుది నిర్ణయంగా భావించి తొందరపాటుతో అన్‌ఫాలో చేయకూడదు. ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తులు, స్నేహితులు కూడా ఆ జాబితాలో ఉండవచ్చు. సౌకర్యం కోసం ఉపయోగించే టెక్నాలజీ వల్ల అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోవాలి.
ఫైనల్ గా…
మ్యూస్ లాంటి ఏఐ ఫీచర్లు మన సోషల్ మీడియా పనులను సులభతరం చేయొచ్చు. అనవసరమైన ఫాలోయింగ్‌ను తగ్గించుకోవచ్చు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. కానీ ఎవరితో సంబంధం కొనసాగించాలి? ఎవరిని దూరం పెట్టాలి? అనే నిర్ణయాలు మాత్రం మనమే తీసుకోవాలి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో బటన్ ఒక్క క్లిక్‌తో నొక్కొచ్చు.. అన్‌ఫాలో బటన్ కూడా అంతే సులభంగా నొక్కొచ్చు. కానీ నిజ జీవితంలో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి సరిచేయడం అంత సులభం కాదు కదా!
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మ్యూస్ ఫీచర్ ప్రస్తుతం భారత్‌లో అధికారికంగా అందుబాటులో లేదు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో మాత్రమే దీని సేవలు ప్రారంభమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూస్ ఐకాన్ కనిపించినంత మాత్రాన భారతీయ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు కాదు. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మెటా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







