చంద్రుడిపై పంటల సాగు.. శాస్త్రవేత్తల కీలక విజయం..!
చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేసి స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్నది మానవుడి దశాబ్దాల కల. అయితే భూమిలో ఉన్నట్లుగా అక్కడ వాతావరణం లేకపోవడంతో.. ఆ ప్రయత్నాలు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. అయితే అన్నింటికన్నా ముఖ్యమైంది అక్కడే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం. అక్కడి మట్టిలో నత్రజని, ఇతర సూక్షపోషకాలు లేకపోవడంతో పంటలు పండడం కుదరని పని. అయితే దాన్ని మరో విధానంలో సుసాధ్యం చేసి చూపించారు శాస్త్రవేత్తలు.
చంద్రుడిపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా జరుగుతున్న పరిశోధనల్లో మరో కీలక ముందడుగు పడింది. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని పోలిన పదార్థంలో బంగాళాదుంపలను విజయవంతంగా పండించి శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములకు అక్కడే ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రయోగం మార్గం సుగమం చేస్తోంది. నాసా మద్దతుతో ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం వివరాలు ‘ఎన్పీజే మైక్రోగ్రావిటీ’ అనే సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి
పరిశోధకులు ‘మోడోక్’ అనే బంగాళాదుంప రకాన్ని ఎంచుకుని, చంద్రుడిపై ఉండే మట్టిని పోలిన ఐదు రకాల నమూనాల్లో ప్రయోగాలు జరిపారు. చంద్రుడి మట్టిలో మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని, సేంద్రియ పదార్థాలు ఉండవు. దీంతో కేవలం ఆ మట్టి నమూనాల్లో మొక్కలు నాటగా వేర్లు కానీ, దుంపలు కానీ ఏర్పడలేదు. అయితే, ఈ మట్టి నమూనాలకు వానపాముల ద్వారా తయారైన సేంద్రియ ఎరువును (వర్మీకంపోస్ట్) కలిపినప్పుడు ఫలితాల్లో అద్భుతమైన మార్పు కనిపించింది.
కేవలం 5% సేంద్రియ ఎరువు కలిపినా మొక్కలు వేర్లు తొడగడం, దుంపలు ఏర్పడటం ప్రారంభించాయి. ఇక 30% ఎరువు కలిపిన మట్టిలో పండిన పంట, భూమిపై ఒరెగాన్ బంగాళాదుంపల సాగు ప్రాంతంలోని మట్టిలో పండిన పంటతో సమానమైన దిగుబడిని ఇవ్వడం విశేషం.
ఈ ప్రయోగంలో పండిన బంగాళాదుంపలను విశ్లేషించగా, వాటిలో పోషక విలువలు చాలా వరకు సురక్షితంగా ఉన్నాయని తేలింది. అయితే, కొన్ని నమూనాలలో భార లోహాల శాతం స్వల్పంగా పెరిగినట్లు గుర్తించారు. దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.
నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్’ కార్యక్రమం కింద చంద్రుడిపై మానవుల స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి ఈ పరిశోధన ఎంతో కీలకం. భూమి నుంచి ఆహారాన్ని పంపించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. దీనికి బదులుగా చంద్రుడిపైనే ఆహారాన్ని పండించుకోగలిగితే అంతరిక్ష యాత్రల భారం గణనీయంగా తగ్గుతుంది.







