అమెరికా నుంచి మన బామ్మను బలవంతంగా పంపించేశారు.. ఇప్పుడు ఆమె స్ఫూర్తితో కొత్త చట్టం!
ఒక దేశంలో మూడు దశాబ్దాలకు పైగా జీవించడం అంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాదు.. ఎన్నో జ్ఞాపకాలు, బంధాలు, అనుబంధాలను ఏర్పరచుకోవడం కూడా. అలాంటి జీవితాన్ని 73 ఏళ్ల వయసులో ఒక్కసారిగా వదిలేసి వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటుంది? అమెరికాలో నివసించిన భారత సంతతి వృద్ధురాలు హర్జిత్ కౌర్‌కు ఎదురైన పరిస్థితి ఇదే. అయితే ఆమె కథ ఇప్పుడు మరో పెద్ద మార్పునకు నాంది పలుకుతోంది. ఆమెకు జరిగిన ఘటన లక్షలాది మంది వలసదారులకు న్యాయం చేసే కొత్త చట్టం రూపుదిద్దుకోవడానికి ప్రేరణగా మారింది.
ఓ బామ్మ ఎదుర్కొన్న కఠిన పరిస్థితి!
హర్జిత్ కౌర్ 1992లో అమెరికాకు వెళ్లారు. అక్కడే మూడు దశాబ్దాలకు పైగా నివసించారు. ఆశ్రయం కోసం పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ ఆమెకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. 2012లో చివరి అప్పీల్ కూడా తిరస్కరణకు గురైంది. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు హాజరవుతున్నారు.
అయితే 2025 సెప్టెంబర్ 8న సాధారణ తనిఖీ కోసం వెళ్లిన ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా, 13 ఏళ్లుగా నిబంధనలు పాటిస్తున్నా ఆమెను భారత్‌కు బహిష్కరించారు. ఆమె కుటుంబం, న్యాయవాది వాణిజ్య విమానంలో పంపించేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు అధికారులు చార్టర్డ్ విమానంలో తరలించారు.
వ్యక్తిగత విషాదం.. సామూహిక పోరాటానికి ప్రేరణ!
కౌర్‌కు జరిగిన ఘటన కాలిఫోర్నియా చట్టసభ సభ్యులను కదిలించింది. కాంగ్రెస్ సభ్యుడు జాన్ గరమెండి ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ పేరుతో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. లతీఫా సైమన్, జో లోఫ్గ్రెన్, జువాన్ వర్గాస్ కూడా దీనికి మద్దతు తెలిపారు.
ఈ బిల్లు ప్రకారం, ఒక వ్యక్తిపై జారీ చేసిన తుది బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల గడువు ఉండాలని ప్రతిపాదించారు. ఆ గడువు ముగిసిన తర్వాత వాటిని పునరుద్ధరించాలంటే అధికారులు బలమైన కారణాలు చూపించాలి. అమెరికాలో కనీసం పదేళ్లుగా నిరంతరంగా నివసిస్తూ, నిర్దిష్ట నేరారోపణలు లేని అర్హులైన వ్యక్తులు చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అంచనాల ప్రకారం, తుది బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ సుమారు 11.9 లక్షల మంది అమెరికాలోనే నివసిస్తున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వారిలో అర్హులైన చాలామందికి కొత్త అవకాశం లభించవచ్చు.
మరో భారతీయ బామ్మ కథ కూడా!
హర్జిత్ కౌర్ ఒక్కరే కాదు. 27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ, 2013 నుంచి గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న వెంకట నరసమాంబ వాసంశెట్టి కూడా ఈ ఏడాది ఆగస్టులో సాధారణ ఇమ్మిగ్రేషన్ తనిఖీ సమయంలో ICE అధికారుల చేతిలో నిర్బంధానికి గురయ్యారు. ఆమెపై బహిష్కరణకు సంబంధించిన కేసు విచారణను ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి అంతకుముందే కొట్టివేయడం గమనార్హం.
ఒకరి కన్నీటి కథ.. లక్షల మందికి ఆశాకిరణం!
హర్జిత్ కౌర్‌కు జరిగిన నష్టాన్ని ఏ చట్టమూ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు. ఆమె కోల్పోయిన ఇంటిని, బంధాలను, 33 ఏళ్ల జీవితాన్ని తిరిగి తీసుకురాలేకపోవచ్చు. కానీ ఆమె ఎదుర్కొన్న కష్టం మరో లక్షలాది మంది జీవితాల్లో అలాంటి విషాదం పునరావృతం కాకుండా చేసే మార్పునకు బీజం వేస్తోంది.
ఒక సాధారణ వృద్ధురాలి బాధను గుర్తించి, దానిని చట్టం మార్చే స్థాయికి తీసుకెళ్లడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆలోచనతో మొదలయ్యే మార్పే గొప్పది. హర్జిత్ కౌర్ కథ ఇప్పుడు అలాంటి మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది. ఒకరి జీవితంలో చీకటి నింపిన ఘటన.. మరెందరో జీవితాల్లో వెలుగులు నింపే ఆశగా మారుతుందేమో!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







