మలేషియా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు షాక్.. 2027 జనవరి నుంచి వీసా తప్పనిసరి!
ఇప్పటివరకు వీసా తీసుకునే హడావుడి లేకుండానే మలేషియా వెళ్లొచ్చని భావించిన భారతీయులకు ఇకపై ఆ అవకాశం ఉండదు. కొత్త ఏడాది నుంచి అక్కడి ప్రయాణ నిబంధనలు మారబోతున్నాయి. 2027 జనవరి 1 నుంచి మలేషియాలో అడుగుపెట్టాలంటే భారతీయులు తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సిందే. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయానికి మలేషియా ప్రభుత్వం ముగింపు పలకాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం నవంబర్ 17న అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా మినహాయింపు 2026 డిసెంబర్ 31తో ముగియనుంది. ఆ తర్వాత మలేషియా వెళ్లాలనుకునేవారు ముందుగానే వీసా పొందాలి. ఇందుకోసం డిసెంబర్ 1, 2026 నుంచి MyVISA ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అంటే కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే భారతీయ ప్రయాణికులు తమ వీసా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
వీసా ఫ్రీ ప్రయాణానికి ఎందుకు బ్రేక్ పడింది?
మలేషియా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక కొన్ని కారణాలున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత పర్యాటక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు 2023 డిసెంబర్లో భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయాన్ని ఆ దేశం అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో మలేషియాకు వెళ్లడం ప్రారంభించారు. అయితే, ఈ సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళనలు క్రమంగా పెరిగాయి.
ముఖ్యంగా పర్యాటకుల పేరుతో మలేషియాలోకి వెళ్లి అక్కడే ఉద్యోగాల కోసం వెతుకుతున్న భారతీయుల వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. 2026 సెప్టెంబర్‌లో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ కూడా ఈ విషయంపై హెచ్చరిక జారీ చేసింది. మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు ఏజెంట్లు అమాయక ప్రయాణికులను నమ్మించి మోసం చేస్తున్న ఘటనలను ప్రస్తావించింది.
ఇలాంటి మోసాల బారిన పడినవారు అక్కడ అనుమతించిన గడువు దాటిపోయినా ఉండిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఫలితంగా ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో నిర్బంధానికి గురికావడం, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడంలో భాగంగానే మలేషియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ తేదీలను మాత్రం మర్చిపోవద్దు!
మలేషియా ప్రయాణానికి ప్లాన్ చేస్తున్న భారతీయులు కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలి. నవంబర్ 17, 2026న వీసా ఫ్రీ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన వెలువడగా, డిసెంబర్ 1 నుంచి కొత్త వీసా దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 31తో పాత సదుపాయం ముగుస్తుంది. ఇక జనవరి 1, 2027 నుంచి వీసా లేకుండా మలేషియాలోకి ప్రవేశించడం సాధ్యం కాదు.
అందుకే కొత్త ఏడాదిలో మలేషియా పర్యటనకు సిద్ధమవుతున్నవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
వీసా అప్లికేషన్ పెండింగ్‌లో ఉందా? ఏడు రోజులే గడువు!
మలేషియా వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తీసుకొచ్చింది. వీసా కోసం దరఖాస్తు చేసిన తర్వాత దాన్ని అలాగే పెండింగ్‌లో వదిలేస్తే ఇబ్బందులు తప్పవు. కొత్త నిబంధన ప్రకారం ‘New Application’, ‘Pending Payment’ అనే స్థితుల్లో ఉన్న దరఖాస్తులు ఏడు పని దినాలకు మించి పెండింగ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా రద్దవుతాయి.
ఈ నిబంధన 2026 అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 1కి ముందుగా సమర్పించిన దరఖాస్తులకు కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ దరఖాస్తు గడువు ముగిస్తే, పాత అప్లికేషన్‌తో పని జరగదు. కొత్త ఫారమ్‌తో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే.
ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. వీసా మంజూరైనా, తిరస్కరణకు గురైనా అప్లికేషన్ ఫీజు తిరిగి రాదు. విధానాల్లో మార్పులు వచ్చినా, వ్యక్తిగతంగా ప్రయాణ ప్రణాళికను మార్చుకున్నా చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వరు. కాబట్టి దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్ణీత సమయంలోనే ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేయడం ముఖ్యం.
మలేషియా వెళ్లే ముందు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అవసరమేనా?
వీసా నిబంధనలతో పాటు విదేశీ ప్రయాణికులకు వైద్య బీమా విషయంలోనూ మలేషియా కొన్ని సూచనలు చేసింది. అక్కడికి వెళ్లే పర్యాటకులు తమ పర్యటన మొత్తం కాలానికి వర్తించే ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించింది.
నవంబర్ 16న విడుదల చేసిన ప్రకటనలో, మలేషియాలో ఉన్న సమయంలో వైద్య చికిత్స లేదా ఇతర ఆరోగ్య సేవలు పొందితే వాటికి అయ్యే ఖర్చులను విదేశీ సందర్శకులే భరించాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది. అంతేకాదు, వైద్య బీమా, అత్యవసర సహాయం అందించే MyTripPass ప్లాట్‌ఫామ్‌ను కూడా వీసా దరఖాస్తులకు సహాయక పత్రంగా సూచించింది. ఈ బీమా తీసుకున్న వెంటనే డిజిటల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ అందుబాటులోకి వస్తుంది.
మల్టిపుల్ ఎంట్రీ వీసాలపైనా ఆంక్షలు
మలేషియా కేవలం భారతీయుల వీసా ఫ్రీ ప్రయాణాన్నే నిలిపివేయడం లేదు. తన వీసా విధానాలను మరింత విస్తృతంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా 2026 సెప్టెంబర్ 1 నుంచి మల్టిపుల్ ఎంట్రీ వీసా (MEV) నిబంధనలను కూడా సవరించింది. ఈ వీసా పొందేందుకు అర్హతను 31 దేశాల పౌరులకు మాత్రమే పరిమితం చేసింది.
అంటే మలేషియా ప్రయాణానికి సంబంధించి పాత నిబంధనలనే నమ్ముకుని ముందుకు వెళ్లడం కంటే, టికెట్లు, హోటళ్లు బుక్ చేసుకునే ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒకసారి పరిశీలించడం మంచిది.
భారత్‌లోనూ వీసా విధానంలో భారీ మార్పులు!
మలేషియా భారతీయుల ప్రవేశ నిబంధనలను కఠినతరం చేస్తుంటే, మరోవైపు భారత్ మాత్రం విదేశీయులకు తమ దేశంలోకి రావడాన్ని మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశ వీసా వ్యవస్థలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీలను తొమ్మిదికి, 49 ఉప కేటగిరీలను 23కి తగ్గించాలని నిర్ణయించింది.
అవసరమైన సాంకేతిక మార్పులు పూర్తయితే ఈ కొత్త విధానం 2026 చివరి నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులతో పర్యాటకులు, వ్యాపారవేత్తలు, వైద్య చికిత్స కోసం వచ్చే విదేశీయులకు వీసా ప్రక్రియ మరింత సులభంగా మారనుంది.
ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న టూరిస్ట్ వీసా స్థానంలో విస్తృతమైన ‘విజిటర్ వీసా’ను తీసుకురానున్నారు. దీనివల్ల కేవలం పర్యాటకానికే కాకుండా స్వల్పకాలిక వ్యాపార సమావేశాలు, వైద్య సంప్రదింపులు, వెల్నెస్ కార్యక్రమాలు, యోగా శిక్షణ, భారతీయ భాషలు, సంగీతం, కళలు, చేతివృత్తులకు సంబంధించిన చిన్న కోర్సుల కోసం కూడా భారత్‌కు రావచ్చు.
ఇవి కూడా చదవండి
వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చే విదేశీయులకు కూడా ఊరట కల్పించే మార్పులు ప్రతిపాదించారు. మెడికల్ వీసాలకు సాధారణంగా ఏడాది చెల్లుబాటు, పలుమార్లు భారత్‌లోకి ప్రవేశించే సదుపాయం కల్పించనున్నారు. వ్యాపార అవసరాల కోసం వచ్చే వారికి B-1, B-2 కేటగిరీలను ప్రవేశపెట్టనున్నారు. దీర్ఘకాలిక వ్యాపార కార్యకలాపాలతో పాటు స్వల్పకాలిక కాంట్రాక్టు పనులు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక సాంకేతిక పనులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
ప్రస్తుతం 172 దేశాల పౌరులకు 13 ఉప కేటగిరీల కింద భారత్ ఈ-వీసా సదుపాయం కల్పిస్తోంది. కొత్త విధానానికి అనుగుణంగా ఈ వ్యవస్థను కూడా ఆధునీకరించనున్నారు.
భారత్‌లో కొత్తగా ఉండబోయే తొమ్మిది వీసా కేటగిరీలు ఇవే!
కొత్త విధానం అమల్లోకి వస్తే బిజినెస్, డిప్లొమాటిక్, వర్క్, జర్నలిస్ట్, మెడికల్, అఫీషియల్, స్టూడెంట్, విజిటర్, మిసలేనియస్ అనే తొమ్మిది ప్రధాన కేటగిరీలు అందుబాటులోకి వస్తాయి.
మొత్తానికి మలేషియా తన వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండగా, భారత్ మాత్రం విదేశీయులకు ప్రయాణాన్ని సులభతరం చేసేలా మార్పులు చేస్తోంది. ఒకవైపు భారతీయులు మలేషియా వెళ్లాలంటే ఇకపై ముందుగానే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీయులకు మాత్రం కొత్త వీసా విధానం మరింత వెసులుబాటు కల్పించనుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







