‘‘భారత్ ను చూడండి ఎలా వుందో..’’ సెంట్రల్ బ్యాంకు తీరు విషయంలో ట్రంప్ సూచన
అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వడ్డీ రేట్ల పెంపుతో దేశాన్ని నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు. భారత్ ను చూడండి.. అక్కడ వడ్డీ రేట్లు తక్కువగా వున్నాయి, వారి జీడీపీ కూడా ఏడు శాతంగా వుందని చెప్పుకొచ్చారు.
అధికారిక భవనం వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.అమెరికా ఆర్థిక గణాంకాలు బలంగా ఉన్నప్పటికీ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా అక్కడి కేంద్ర బ్యాంకు “దేశాన్ని నాశనం చేస్తోందని ఫెడరల్ రిజర్వ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో “రాజకీయ ప్రేరేపిత” ఫెడరల్ రిజర్వ్ ఉందని, వడ్డీ రేట్ల పెంపు వల్లే వృద్ధి రేటు తగ్గుతోందని అధ్యక్షుడు ఆరోపించారు. వడ్డీ రేట్లను తగ్గిస్తే అమెరికా 15-20% జీడీపీ వృద్ధి రేటును సాధిస్తుందని ఆయన వాదించారు.
“మన వద్ద చాలా రాజకీయ ప్రేరేపిత ఫెడరల్ రిజర్వ్ ఉండటం వల్లే వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఛైర్మన్‌ను నిందించడం లేదు, కానీ ఫెడ్ రాజకీయంగా వ్యవహరిస్తోంది అనేది వాస్తవం. మనం మంచి ఆర్థిక గణాంకాలను ప్రకటించినప్పుడల్లా, వారు వడ్డీ రేట్లను పెంచుతారు. ఒక ఉద్దేశంతోనే వారు అలా చేస్తారు. నిజానికి దానికి విరుద్ధంగా జరగాలి,” అని శుక్రవారం వైట్ హౌస్‌లో విలేకరులతో ఆయన అన్నారు.
అమెరికా మంచి ఆర్థిక గణాంకాలను నమోదు చేసినప్పుడు, వడ్డీ రేట్లను తగ్గించేందుకు దేశానికి మెరుగైన పరపతి (క్రెడిట్) ఉంటుందని, కానీ అమెరికా అందుకు పూర్తి విరుద్ధంగా చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.మనకు మెరుగైన పరపతి ఉన్నందున రేట్లను తగ్గించాలి. అలా చేస్తే మనకు 4 శాతం కాకుండా, 15 లేదా 20 శాతం జీడీపీ ఉంటుంది. మనం అప్పులను చాలా వేగంగా తీర్చేస్తాం. పని జరగాల్సిన పద్ధతి అది. కానీ మనం దాన్ని తలకిందులుగా చేస్తున్నాం,” అంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగానే భారత్ ను ఉదహరించారు. “మీరు భారత్‌ను గమనిస్తే, అక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి మరియు వారికి 7 శాతం జీడీపీ ఉంది. మనకైతే 14, 15, లేదా బహుశా 20 శాతం జీడీపీ కూడా ఉండేది. మనం ఇంత అద్భుతంగా రాణిస్తున్నప్పుడు, వారు (ఫెడ్) వడ్డీ రేటును పెంచడం నిజంగా విచారకరం. నిజానికి మనం దాన్ని ఎప్పుడో అధిగమించాం,” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.







