పుతిన్, జిన్‌పింగ్‌లతో ట్రంప్ సమావేశం వల్ల ఉపయోగం ఏమిటి? ఫొటోలేనా.. ఫలితాలు ఉన్నాయా?
ముగ్గురు అగ్రనేతలు.. ఒకే వేదిక.. ప్రపంచం మొత్తం చూపు ఆ సమావేశంపైనే! ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఒకచోట కూర్చుంటే ఏదో సంచలన నిర్ణయం వస్తుందని అంతా అనుకున్నారు. యుద్ధాలకు ముగింపు పలుకుతారని, అణ్వాయుధాల ముప్పు తగ్గిస్తారని, ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తారని ఆశించారు. కానీ సమావేశం ముగిసింది.. నేతలు ఫొటోలు దిగారు.. ప్రకటనలు చేశారు. మరి ప్రపంచం ఎదురుచూసిన అసలు ఫలితాల మాటేమిటి? 80 నిమిషాల ఈ భేటీతో నిజంగా ఏం మారింది? CNN యాంకర్ కైట్లాన్ కాలిన్స్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ట్రంప్ పర్యటనపై ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
80 నిమిషాల భేటీ.. భారీ అంచనాలు!
ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మూడు దేశాల అధినేతలు ఒకే వేదికపైకి రావడం చిన్న విషయం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవంబర్ 19న చైనాలోని షెన్జెన్లో సమావేశమయ్యారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు నేపథ్యంలో జరిగిన ఈ త్రైపాక్షిక సమావేశం సుమారు 80 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీపై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, అణ్వాయుధాల నియంత్రణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వస్తాయని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూశాయి.
కానీ సమావేశం ముగిసిన తర్వాత అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. ఇన్ని కీలక అంశాలపై చర్చిస్తామని చెప్పిన ముగ్గురు నేతలు ఏం నిర్ణయించారు? ఏదైనా ఒప్పందం కుదిరిందా? యుద్ధాలను ఆపే దిశగా ఒక్క అడుగైనా ముందుకు పడిందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపించకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్‌కు అద్భుతమైన సమావేశం.. కాలిన్స్‌కు మాత్రం సందేహాలే!
సమావేశం ముగిసిన వెంటనే ట్రంప్ ఎంతో ఉత్సాహంగా స్పందించారు. ఇదొక అద్భుతమైన సమావేశమని, దీని నుంచి ఏదో ఒక మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ CNN యాంకర్ కైట్లాన్ కాలిన్స్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను మరో కోణంలో విశ్లేషించారు. ప్రపంచానికి శాంతి గురించి ఎన్నో మాటలు వినిపించినా, ఎలాంటి ఒప్పందాలు కుదరలేదని, లక్ష్య సాధన దిశగా ఎంతవరకు పురోగతి వచ్చిందనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
అణ్వాయుధాలు, ఇరాన్ యుద్ధం.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనా?
ఈ పర్యటనకు ముందు ట్రంప్ ఎన్నో కీలక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా మధ్య అణ్వాయుధాల నియంత్రణపై చర్చలు జరగాలని భావించారు. అమెరికా, రష్యా వద్ద భారీ స్థాయిలో అణ్వాయుధాలు ఉన్నాయని, చైనా కూడా వేగంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వ్యాఖ్యానించారు. మరో ఐదేళ్లలో చైనా అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఇక ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే అంశాన్ని కూడా ఈ పర్యటనలో చర్చిస్తానని నవంబర్ 8న ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ప్రకటించారు. చైనాలో నిర్బంధంలో ఉన్న అమెరికన్ల అంశాన్ని కూడా ప్రస్తావిస్తానని నవంబర్ 6న వెల్లడించారు. ఇన్ని అంశాలతో చైనాకు వెళ్లిన ట్రంప్‌కు చివరకు ఏ విషయంలోనైనా స్పష్టమైన హామీ లభించిందా అన్నది మాత్రం తెలియడం లేదు. అల్ జజీరా కథనం ప్రకారం, ఇరాన్ యుద్ధం అంశానికి ముగ్గురు నేతల సమావేశంలో పెద్దగా ప్రాధాన్యం కూడా దక్కలేదు.
ఉక్రెయిన్ యుద్ధం దగ్గరే అసలు పరీక్ష!
ఈ సమావేశం నిజంగా ఫలితాలనిచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏం జరిగిందో చూడాలి. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ గతంలో పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో ముఖాముఖి చర్చల ద్వారా కనీసం కాల్పుల విరమణ దిశగా అయినా అడుగు పడుతుందని చాలామంది ఆశించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దీంతో ట్రంప్ ఆశిస్తున్న శాంతి చర్చలు అంత సులభంగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
కుష్నర్ మాటల్లో శాంతి.. పుతిన్ వైఖరిలో మాత్రం మార్పేది?
ట్రంప్ అల్లుడు, ప్రత్యేక రాయబారి జారెడ్ కుష్నర్ మాత్రం ఈ సమావేశంపై సానుకూలంగా స్పందించారు. పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరికీ శాంతి కావాలన్న ట్రంప్ సందేశాన్ని బలంగా వినిపించారని, శాంతి సాధ్యమేనన్న నమ్మకంతోనే ఆయన సమావేశం నుంచి బయటకు వచ్చారని చెప్పారు.
కానీ కుష్నర్ మాటలకు, పుతిన్ వ్యవహరిస్తున్న తీరుకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా ప్రతినిధులు శాంతి సాధ్యమేనని చెబుతుంటే, మరోవైపు రష్యా మాత్రం చర్చల విషయంలో కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో పుతిన్ నిజంగానే శాంతికి సిద్ధంగా ఉన్నారా? లేక ట్రంప్‌తో సమావేశం కావడం ద్వారా అంతర్జాతీయంగా తన దౌత్యపరమైన ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
యూరప్ నేతలకు ట్రంప్ భరోసా.. పోలాండ్ ప్రధానికి మాత్రం నమ్మకం కుదరలేదు!
ఇదే సమయంలో బెర్లిన్‌లో సమావేశమైన 30 మంది యూరోపియన్ నేతలతో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచే ఫోన్లో మాట్లాడారు. పుతిన్ కొత్త చర్చలకు సిద్ధంగా ఉన్నారని, యుద్ధం వల్ల ప్రాణాలు, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని వివరించారు. అయితే ట్రంప్ చెబుతున్న మాటలను యూరప్ నేతలంతా పూర్తిగా నమ్ముతున్నట్లు కనిపించడం లేదు.
పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అయితే తన సందేహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. పుతిన్ సద్భావనపై ట్రంప్‌కు ఉన్న నమ్మకం చెక్కుచెదరడం లేదని, కానీ ఇప్పటివరకు ఆ నమ్మకాన్ని సమర్థించే వాస్తవాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రష్యా నిజంగానే శాంతి చర్చలకు సిద్ధమైతే అది మంచి పరిణామమేనని, అయితే మాటలకంటే చేతల్లో మార్పు కనిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మరి ముగ్గురు నేతల భేటీతో ఏమైనా ఉపయోగం ఉందా?
ఈ సమావేశం వల్ల అసలు ఏమీ జరగలేదని చెప్పడం కూడా తొందరపాటే. ప్రపంచంలోని మూడు అగ్రశక్తుల మధ్య నేరుగా చర్చలు జరగడం, పరస్పర వైఖరిని అర్థం చేసుకునే అవకాశం రావడం దౌత్యపరంగా కీలకమే. సమావేశం అనంతరం ఉమ్మడి ప్రకటనలో అణ్వాయుధాల ముప్పు తగ్గించడం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, ఇంధన రంగం వంటి అంశాలపై కొన్ని ఉమ్మడి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అణుయుద్ధంలో ఎవరూ విజేతలుగా నిలవలేరని, అలాంటి యుద్ధం జరగకూడదని కూడా పేర్కొన్నారు.
ఫొటోలు కాదు.. ప్రపంచానికి కావాల్సింది ఫలితాలు!
ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించడం, చేతులు కలపడం, శాంతి గురించి మాట్లాడటం అంతర్జాతీయంగా పెద్ద వార్తే కావచ్చు. కానీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలకు కావాల్సింది ఇలాంటి సమావేశాల ఫొటోలు కాదు.. యుద్ధానికి ముగింపు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు కావాల్సింది ప్రకటనలు కాదు.. స్థిరత్వం. అణ్వాయుధాల ముప్పుతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి కావాల్సింది హామీలు కాదు.. ఆచరణలో కనిపించే నిర్ణయాలు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







