తెలంగాణలో అమిత్ షా ‘మాస్టర్ ప్లాన్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆ భేటీల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “తెలంగాణలో ఈసారి వంద శాతం గెలుస్తున్నాం.. ఆ విషయం నాకు వదిలిపెట్టండి” అంటూ ఆయన వ్యక్తం చేసిన ధీమా వెనుక బలమైన కార్యాచరణ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సాధారణంగా బహిరంగ సభల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి చేసే ప్రసంగాలకు భిన్నంగా, వివిధ రంగాల ప్రముఖుల వద్ద అమిత్ షా ఇంతటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం వెనుక అధిష్ఠానం రచించిన పక్కా వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎన్నికల వ్యూహరచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం అందించే నివేదికలపైనే పూర్తిగా ఆధారపడకుండా, కేంద్ర నిఘా వర్గాలు, ప్రత్యేక వ్యూహకర్తల ద్వారా తెలంగాణ క్షేత్రస్థాయి పరిస్థితులపై అమిత్ షా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. మేధావులు, విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు వంటి రాజకీయేతర రంగాల ప్రముఖుల అభిప్రాయాలను సేకరిస్తూ, ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్‌లోనే మకాం వేసి పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించడం ఈ వ్యూహంలో కీలక భాగంగా కనిపిస్తోంది. గతంలో ఒడిశాలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన బన్సల్, ఇప్పుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం గమనార్హం.
రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తుల జోలికి వెళ్లకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థుల కొరత పార్టీకి ఒక సవాలుగా ఉన్నమాట వాస్తవమని పార్టీ నేతలే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి అధిష్ఠానం ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతోంది. తొలుత బీఆర్ఎస్ నుంచి, ఆ తర్వాత ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్త నేతలు తమ వైపు వస్తారని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, తద్వారా పాత నేతలకు నష్టం కలగకుండానే కొత్తగా వచ్చే బలమైన నాయకులకు టికెట్లు సర్దుబాటు చేయవచ్చని అధిష్ఠానం లెక్కలు వేస్తోంది.
తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అమిత్ షా బృందం ఒక ప్రత్యేకమైన సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెస్తోంది. జిల్లాకో బలమైన నాయకుడిని ఇతర పార్టీల నుంచి ఆకర్షించడంతో పాటు, రాష్ట్ర జనాభాలో కీలకమైన సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేలా 3ఎం (మున్నూరు కాపు, ముదిరాజ్, మాదిగ) వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీలలో బలమైన సామాజిక వర్గాలైన మున్నూరు కాపు, ముదిరాజ్‌లతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా మాదిగ సామాజిక వర్గాన్ని పార్టీకి దగ్గర చేయడం ద్వారా తిరుగులేని ఓటు బ్యాంకును నిర్మించుకోవాలనేది ఈ సోషల్ ఇంజనీరింగ్ ప్రధాన ఉద్దేశం. ఈ వ్యూహాల అమలు బాధ్యతను కూడా రాష్ట్ర నేతలకే వదిలేయకుండా, జాతీయ స్థాయి నేతల పర్యవేక్షణలోనే ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.
మొత్తానికి అమిత్ షా వ్యక్తం చేసిన వంద శాతం గెలుపు ధీమా కేవలం ఒక రాజకీయ ప్రకటనగా కాకుండా.. పక్కా క్షేత్రస్థాయి సమాచారం, సామాజిక వర్గాల సమీకరణాలు, ఇతర పార్టీల నుంచి కీలక నేతల వలసల అంచనాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక సమగ్ర ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య నడుస్తున్న రాజకీయ పోరులో ఈ వ్యూహాలతో బీజేపీ ఎంతవరకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి లక్ష్యాన్ని చేరుకుంటుందనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.







