మరోసారి ఫ్యామిలీ మ్యాన్‌గా సల్మాన్ ఖాన్.. మాన్స్టర్ లో డిఫరెంట్ అవతార్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తన నెక్ట్స్ సినిమాలతో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో సాగే కథల్లో మరోసారి తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మాతృభూమి(Matrubhoomi) సినిమాలో ఇద్దరు కుమారులకు తండ్రిగా కనిపిస్తున్న సల్మాన్.. తాజాగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) తెరకెక్కిస్తున్న మాన్స్టర్ లోనూ భర్తగా, తండ్రిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా ఆసక్తికరమైన గతంతో ముడిపడి ఉంటుందట.
ఇవి కూడా చదవండి
గతంలో ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో ఎదురైన సంఘటనలు ఆయన పాత్రలోని మరో కోణాన్ని బయటకు తీసుకొస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ వ్యక్తిగా కనిపించే పాత్ర క్రమంగా భయంకరమైన రూపాన్ని సంతరించుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యతనిస్తూ ఈ కథను వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నట్లు టాక్.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ భారీ సినిమాతో సల్మాన్ తొలిసారి వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు(Dil Raju)తో కలిసి పనిచేస్తున్నారు. నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తుండగా, జాకీ ష్రాఫ్(Jockey Shroff), అరవింద్ స్వామి(Aravind Swamy) కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం, విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న మాన్స్టర్ పై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. సల్మాన్‌ను ఈ సినిమాలో వంశీ ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.







