కథ 6: చంద్రశేఖరుని కథ – రావి కొండలరావు
ఒక్క ముక్కలో చంద్రశేఖరం సావిత్రిని ప్రేమించాడు. అదీ ఏమిటి- ‘తొలిచూపు’ కన్నా ముందుగానే ప్రేమించాడు. అంటే అది మామూలు రకం ప్రేమల మీద కొన్ని ఆకులు ఎక్కువ చదువుకున్నటువంటి ఒకటోరకమైన ప్రేమ!
మొదటి ముక్కలోనే సంగతి అర్థమైపోయినా అది ఎట్లా జరిగిందో తెలుసు కోకపోతే బావుండదు! ఒకనాటి ఉదయం స్నానం చేసి డాబామీద నించుని సావిత్రి జుట్టు ఆరబెట్టుకుంటూ వుంటే రెండు తల వెంట్రుకలు గాలికి ఎగిరి, గాల్లోంచి ఎగిరి, తన మానాన తాను సైకిలుపై పోతున్న చంద్రశేఖరం చొక్కాకు కొట్టుకుని కాస్సేపు అక్కడే నివాసం ఉండి, తర్వాత జేబులో పడ్డాయి. ఈ తతంగం అంతా శేఖరానికి తెలియక పోలేదు.
తాను మాంచి జోరులో పోతూవుండగా రెండు తల వెంట్రుకలు తనను తాకటం అతను ప్రత్యక్షంగా చూశాడు. తీసి దూరంగా పారేద్దాం. అని తెగ ప్రయత్నించాడు. కుడిచెయ్యి వొదిలి వాటిని తియ్యబోతే, సైకిలుబండి బాలన్సు తప్పి, ప్రక్కనే పోతూన్న జట్కా బండిని కొట్టుకోబోయింది. అట్లా ఆ ప్రయత్నం విఫలమైంది. ఇంక మళ్లీ ప్రయత్నిస్తే తాను ‘సైకిలునృత్యం’ చేస్తున్నట్టు ఈ బాటసారులంతా అనుమానించి, ఆగిపోయి, చూసి, తనను తెగ మెచ్చేసుకోవటంలో కూడా పడవచ్చును. అంచేత తల వెంట్రుకలు తీసి పారెయ్యటం కోసం తాను నడివీధిలో ఉచితంగా ఇంతటి ‘నృత్య ప్రదర్శనం’ ఇవ్వటం అనవసరం! కాకపోయినా అవి, వచ్చిన గాల్లోనే తిరిగి వెళ్లిపోతాయని సంబళించుకున్నాడు.
ఐతే అవి పోలేదు- శేఖరం జేబులో మకాం చేశాయి. శేఖరం మహ చిరాకు పడ్డాడు. వెనకా ముందూ చూసుకోకుండా, తానెవరయినదీ తెలుసుకోకుండా ఈ తలవెంట్రుకలు తన జేబులో దూరేటంత హక్కు గలవి ఎట్లా ఐనై? తన ఇంటి గుమ్మం చేరుతూనే సైకిలు ఆపి, కోపంగా జేబులో చెయ్యిపెట్టి ఆ వెంట్రుకలను నిష్కర్షగా బయటకు లాగాడు. లాగుతూనే అవతల విసిరెయ్యలే….దు….! చెయ్యి బ్రేక్ వేసింది. ఆ తల వెంట్రుకలను గాని అతను అటు పారేస్తే కథే లేదని ఆ చేతికి తెలుసు.
శేఖరం ఆ కేశద్వయాన్ని విస్మయంతో చూశాడు – “ఆహా! ఇవి తల వెంట్రుకలా! ఏమి ఇంత సొగసుగా నున్నవి। పరిమళములను కూడా వెదజల్లుతున్నవి! – ఆహా! ఈ కేశములే ఇంత అందముగా నున్నవే ఇవి ధరించిన ఆ పడతి ఎట్టి అందగత్తెయో కదా! ఆ లలన ఎట్టి సుకుమారియో గదా!”
శేఖరం ఆ రెంటినీ జేబులోనే వేసుకున్నాడు. సైకిలు నౌకరుకు వప్పజెప్పి ‘స్టాండు’ వెయ్యమని ఆజ్ఞ యిచ్చి చరచరా లోపలకు పోయి శయనాగారం చేరి, పాత గుడ్డపీలిక ఒకటి తీసి తలకు కట్టుకుని పందిరి మంచంపై పవ్వళించాడు! అతనికి ఒకటే ఆలోచన! ఆ కేశరాజము లెవరివో తెలుసుకోవాలి. అంతదాకా ఈ ‘తలకట్టు’ చెరపకూడదు. అంతలోనే శేఖరం ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాడు. ఎంచేతంటే, శ్మశాన వాటికలో హరిశ్చంద్రుడల్లే ఈ తలగుడ్డతో తాను వెళ్లి ఆ అంగనను చూస్తే ఆమె నవ్వి చక్కా లోపలకు పోయి తలుపేసుకుంటుంది. కాకపోయినా ఆమెను వివాహం చేసుకునేంతవరకూ మాత్రం అసహ్యమైన ఈ ‘రాజమకుటం’ తనకెందుకు? –
శేఖరం వాళ్లమ్మ భోజనానికి లెమ్మంది.
‘నాకు ఆకలిలేదు’ అన్నాడు. ‘తలనొప్పా’ అందామె. అతను మాట్లాడలేదు. తల నొప్పయితేనే కట్టుకుంటారా యేమిటి ఈ కట్టు! కాటికాపరిగా జీవించినంతకాలం హరిశ్చంద్రుడు కట్టుకున్నాడంటే అతనికి తలనొప్పనా అర్ధం!… ఐనా కాకపోయినా ఎందుకో తన కది కట్టుకోవాలనిపించింది. “నేను తిన్ను” అన్నాడు.
వాళ్ల నాన్నొచ్చాడు బతిమాలాడు.
“నాకొద్దు” అన్నాడు.
ఈ కుమార రత్నం అలుగుతున్నాడని వాళ్ల కర్థమైంది గాని, ఎందుకో మాత్రం కాలేదు.
వాళ్ల నాన్నొచ్చాడు బతిమాలాడు. “నాకొద్దు” అన్నాడు.
ఈ కుమార రత్నం అలుగుతున్నాడని వాళ్ల కర్థమైంది గాని, ఎందుకో మాత్రం కాలేదు.
“నేనెవరిమీదా అలగలేదు. నా మనస్సేం బాగులేదు. నన్నిట్లో ఒంటరిగా ఉండనివ్వండి. మీరు వెళ్లండి… వెళ్లండి….” అని గభాలున లేచి చరచరా వెళ్లి దభాలున తలుపులు మూసేశాడు. మూసేసి వెనక్కు తిరిగి చూడగా వాళ్లిద్దరూ లోపలే కనిపించారు. శేఖరం క్రూరంగా చూసి వెళ్లి మంచంమీద పడ్డాడు. ‘ఈ ముసలి దంపతులిద్దర్నీ ఖైదు చేయించి బందిఖానాలో పారేయించాలి’ అని కూడా అనుకున్నాడు. ఇంకాస్సేపటిదాకా భార్యాభర్తలిద్దరూ అక్కడే నించుని, నెమ్మదిగా తలుపు గడియ తీసుకుని బయటికి వెళ్లిపోయారు.
శేఖరం ఆ తలవెంట్రుకలను మరోసారి పరిశీలించగా అవి ఇంకా అందంగా కనిపించాయి. నొక్కు నొక్కుల జుట్టులోవి। తలవెంట్రుకంత సన్నమైనవి! ఇన్నాళ్లయి ఆ వీధిలో తిరుగుతున్నా ఎప్పుడూ తారసిల్లనివి! ఆమె ఎవరో!… శేఖరం లేచి వెళ్లబోయినాడు. కడుపులో బావురుమంది. ఆకలి… ఆకలి వేస్తున్నది! ‘ఇంత అన్నం తినేసి వెళ్లి చూద్దునా అన్నానికి రాను- ఆకలి లేదు అన్నానుగా అంటేనేం ఇప్పుడు ఆకలైంది.’
శేఖరం తలగుడ్డ విప్పి పారేసి, నెమ్మదిగా వంటింట్లో ప్రవేశించాడు.
“సరే పెట్టు – తినకపోతే నీకు కోపం…” అన్నాడు ఉద్దరిస్తూ. తొందరగా లేచి వాళ్లమ్మ వెండి కంచం వేసి అన్నీ వడ్డించింది. తిన్నంత తిని, పారేసినంత పారేసి, ఇన్ని నీళ్లు తాగి లేచి వెళ్లి చెయ్యి కడుక్కున్నాడు. కడుక్కున్న చేతులు తుడుచుకోకుండానే వెళ్లి సైకిలు మీద లంఘించాడు… వేగంతో సైకిలు డిటిక్టివ్ గారి మోటారు సైకిలల్లే దూసుకుంది. ఇందాకటి స్థలం వచ్చింది. శేఖరం ఆగాడు… ఒక కాలు మాత్రమే కింద పెట్టాడు. అటూ ఇటూ చూశాడు…. ఒకపక్క డాబా కనిపించింది… రెండో ప్రక్క మామూలు చిన్న యిల్లు! చిన్న యింట్లోకి తొంగి చూశాడు. ఎవడో ముసలాడు దగ్గుతూ అరుగుమీద కనిపించాడు. ‘ఛా’ అనుకున్నాడు. ఆ భువనైక సుందరి చచ్చినా ఈ పూరికొంపలో నివసించదు. ఈ డాబా యిల్లే అయి ఉండాలి. పైగా తల వెంట్రుకలు ఎగిరి రావటానికి డాబా ముఖ్యం కూడాను. ఆ యింటి ముందు దాకా వచ్చాడు. వీధి గుమ్మంలో ఓ అబ్బాయి ఓ అమ్మాయీ ఆడుకుంటున్నారు.
“ఓ అబ్బాయీ, ఓ అమ్మాయీ మాట” అన్నాడు శేఖరం నెమ్మదిగా.
వాళ్లు రాగానే వాళ్ల నోళ్లల్లో పిప్పరమెంట్లు పెట్టినట్టు – చెయ్యిపెట్టి తీసేసి – “నేనడిగినదానికి సమాధానం చెబితే యిస్తాను. ఇట్లా రండి” అని వాళ్లను దూరంగా తీసుకుపోయాడు.-
“మీరిద్దరూ ఏమవుతారు? “ఇతను మా బాడ్జీ” అంది పిల్ల. “అది సరే, ఏమవుతారూ అని.”
వాళ్లకర్థం ఐనట్టు లేదని అతనే తెలుసుకున్నాడు. “మీ అక్కయ్య ఏం చేస్తోంది?” “నాకు అక్కయ్య లేదు” అంది పిల్ల.
“నీకు?”
“లేదుగా” అన్నాడు పిల్లాడు.
కొంపదీసి అమ్మ కాదు గద! శేఖరం అమాంతం సైకిలెక్కి పారిపోదామనుకున్నాడు.
“మీ యింట్లో ఎవరెవరుంటారు?”
“మా అమ్మా… నాన్నా మరేమో…. తాతయ్యా…. పిన్నీ…”
“ఆగు. పిన్ని – మీ పిన్నికి చిన్నాన్న ఉన్నాడా? అదే మీకు చిన్నాన్న ఉన్నాడా?” “లేడుగా. వస్తాట్ట” అన్నాడా అబ్బాయి సరదాగా.
అది అర్థమైంది శేఖరానికి. ‘రక్షించావు గదరా నా తండ్రీ చిన్నవాడవయినా ‘ అనుకున్నాడు. వో నాణెం తీసి యిద్దరికీ యిచ్చి ఏదన్నా కొనుక్కోండి అన్నాడు. వాళ్లు వెళ్లాక మళ్లీ సందేహం ఒకటి వచ్చిపడింది. ‘లేడుగా, వస్తాట్ట’ అంటే ఇంకో పూర్నుంచి కాదు గదా! కాకపోయినా ఎవడన్నా ఉన్నాడేమో!…
వీధి గుమ్మంలో ఆకులు పారేసిన చప్పుడైంది. చట్టున చూచాడు- మెరుపల్లే తళుక్కుమంది! శేఖరం గుండెలు కొట్టుకున్నాయి. ఆమే! సందేహం లేదు. ‘ఈ తలవెంట్రుకలు మీవిలా ఉన్నై. పారేసుకున్నారు’ అని వెళ్లి యిచ్చేస్తే? నవ్వుతుంది. ఏమో, ‘ఎందుకు తీశావు నువ్వు?’ అని తిడితే? శేఖరానికి తోచలేదు. ఎట్లా? ఆమె ఎవరు? … పెళ్లయిందా లేదా… కాకపోతే పేరూ అవీ ఏమిటి?… ఇవన్నీ తెలుసు కోవాలి. ఇంక అక్కడుండడం దుర్లభంగా తోచింది. సైకిలెక్కి సరాసరి యిల్లుచేరి, మళ్లీ పడకగది చేరాడు.
“నాన్నా చంద్రం అట్లా ఉన్నావేం” అన్నాడు తండ్రి – వస్తూ.
“ఎట్లా ఉన్నానూ – బాగానే ఉన్నాను. నాకేం పిచ్చెత్తనూ లేదు-నేనేం ప్రేమలోనూ ఇరుక్కోలేదు. మామూలుగానే ఉన్నాను. ఎందుకో చిరాగ్గా ఉన్నాను. అంతే” అన్నాడు శేఖరం. శేఖరం తండ్రి వెళ్లిపోయాడు. తను ఎన్నిసార్లు అడిగినా వీడిట్లా వెర్రిగా వాగుతాడు గాని, సంగతి చెప్పడని, శేఖరం బెస్టు ఫ్రెండయిన రామ్మూర్తికి కబురుచేశాడు – రామ్మూర్తి ద్వారా సంగతి లాగాలని.
తండ్రితో మాట్లాడాక, శేఖరం దగ్గర కొచ్చాడు రామ్మూర్తి. “ఏం జరిగిందిరా?” అన్నాడు రామ్మూర్తి.
“ఏమీ జరగలేదనే.”
రామ్మూర్తిని కూచోపెట్టుకుని జరిగిన విషయం అంతా చెప్పాడు శేఖరం. ” ఎట్లాగయినా నువ్వు వివరాలు లాగాలి. నా మనస్సు మనస్సులో లేదు. నాకు జీవించే ఆశ లేదు. నా జీవితం దుర్భరమైపోతుంది. నా కెందుకీ బ్రతుకు? సారా సీసాలు తాగు తూ ఎక్కడెక్కడో తిరగాలి రామ్మూర్తి భోరున.
నన్ను రక్షించు” అన్నాడు శేఖరం
“నేను కనుక్కుంటానులే. విచారించకు” అని లేచాడు రామ్మూర్తి.
ఆ సాయంత్రానికే రామ్మూర్తి వివరాలు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి పేరు సావిత్రి. పెళ్లి కాలేదు- సంబంధాలు చూస్తున్నారు. కాలేజి చదువుతో ఆపేసింది – పెద్ద స్థితిమంతురాలు కాదు!
డబ్బుదేముందోయ్- నీ మనస్సు కలిసింది. అదే చాలు” అన్నాడు రామ్మూర్తి. “అది చాలదు. పెళ్లా?” అన్నాడు శేఖరం. “మాట్లాడదామా”
“మాట్లాడాలి.”
ఆ మర్నాటి ఉదయం లేస్తూనే సైకిలుమీద సావిత్రి వీధిలో తిరగసాగాడు శేఖరం. తానీ సైకిలు మీద నుంచి పోతూవుంటే, సావిత్రి తనో సైకిలు ఎక్కి ఎదురుగా వస్తూ తన సైకిలును ఢీ కొట్టాలి. తాను ‘సారీ’ అంటాడు ఆమె తరపున. అని వెళ్లిపోతూ ఢీ వుంటే ఆమె, ‘నెవర్మెండ్’ అని అదోలా చూస్తూ అక్కడే ఉండిపోతుంది! అందుకని, ఏడు గంటలు మొదలుకుని పదిగంటలదాకా సుమారు నూరు ట్రిప్పులు కొట్టాడు. పదో గంట ప్రాంతంలో సావిత్రి డాబామీద కనిపించింది. శేఖరం చూశాడు. సావిత్రీ చూసింది. ఇదే వాళ్ళు మొదటిసారి చూసుకోవటం. తొలి చూపు లోనే ప్రేమించాలని ఆమె చూపు అటు తిరక్కుండా ధణాల్మని ప్రేమించేశాడు- పైగా మరింత మామూలుగా సావిత్రి వెళ్లిపోయింది… ఈదురోమని శేఖరం సైకిలూ
వెళ్లిపోయింది.
‘ఇదండీ సంగతి. మీరు మరి వెనకా ముందూ చూడకుండా వాడికి పెళ్లి చెయ్యాలి. లేకపోతేవాడు గొడవ చేస్తాడు” అన్నాడు రామ్మూర్తి, సంగతంతా శేఖరం తండ్రి దగ్గర వెల్లడించి.
“వాళ్లెవరో, కులమేమిటో, గోత్రమేమిటో, ఆస్తిపాస్తులేమిటో…”
54
“ఓ పక్కనించి మీ ఏకైక కుమార రత్నం బెంగటిల్లిపోతూవుంటే మీరింకా కులగోత్రాలు, ఆస్తిపాస్తులూ అంటూ కూచోండి. నాకేం”
“అయితే తప్పదా?”
“తప్పదు, మీరయినా వెళ్లండి, మనిషినయినా పంపించి మాట్లాడించండి” అన్నాడు. ఆ తర్వాత శేఖరం తండ్రి, భార్యతో విషయం అంతా చెప్పి-
“ఇదే సంగతి. మనం మరి వెనకా ముందూ చూడకుండా వీడికి పెళ్లి చెయ్యాలి. లేకపోతే వాడు గొడవ చేస్తాడు” అన్నాడు.
“వాళ్లెవరో, కుల మేమిటో, గోత్రమేమిటో ఆస్తిపా….”
“ఓ పక్కనుంచి మన ఏకైక కుమార రత్నం బెంగటిల్లిపోతూఉంటే నువ్వింకా కుల గోత్రాలూ ఆస్తిపాస్తులూ అంటూ కూచో, నాకేం!”
“అయితే తప్పదా”
“తప్పదు. నేవెళ్లి మాట్లాడి వస్తాను” అని లేచాడు. “మనం మగ పెళ్లివారం. మనమెట్లా పోతామండీ?”
అదీ పాయింటే ననిపించింది ముసలాయనకు.
“ఐనా అటువంటివన్నీ ఆలోచిస్తూ కూచోటానికి ఇది సమయం కాదు కాబోలే” అన్నాడు.
“ఐతే పురోహితుని పంపండి” అన్నదామె వూహతట్టి.
“ఆఁ, అతన్ని పంపేద్దాం. మనం వెళ్లితేనే కదా మగపెళ్లివారం వెళ్లినట్టు” అంటూ లేచి పురోహితుడి కోసం కబురు చేశాడు ముసలాయన.
శేఖరం పడక గది. శేఖరం దిగులుగా జుట్టు దువ్వుకోకుండా అద్దం ముందు కూచుని అద్దంలోకి చూసుకుంటూ ఉండగా అద్దం వెలవెల బోయింది. ‘సావిత్రీ’ అన్నాడు అద్దంలోకి చూస్తూనే. ‘వూఁ’ అని వినిపించింది. వెనక్కు తిరిగాడు – సావిత్రి! పొద్దున్న డాబామీద ఏ భంగిమలో ఎట్లా కనిపించిందో అట్లాగే- అట్లాగే కనిపించింది. శేఖరం ‘సావిత్రీ’ అని అరిచాడు. ఇంకో మూల కనిపించింది సావిత్రి పకపక నవ్వుతూ. ఈసారి అటు వెళ్లి ‘ సావిత్రీ’ అని మళ్లీ కౌగలించుకున్నాడు. అంతలోనే సావిత్రి, పూలు పెట్టుకునే పొడుగాటి గాజుకుండీలాగా మారిపోయింది. మారిపోవడమే కాదు
శేఖరం కౌగిలికి ఆ పూలకుండీ నేలమీద పడి ముక్క ముక్కలైపోయింది ‘ఫగిలె తునా తునాకలై…’ అని శేఖరం మంచంమీద కూలబడ్డాడు.
“నాయనా, లే బాబూ. పురోహితుడు వెళ్లాడు. అయ్యో -ఈ కుండీ ఎవరిట్లా పగలకొట్టారు?” అంటూ వాళ్లమ్మ వచ్చింది.
“ఏ కుండీ అమ్మా?” అంటూ శేఖరం లేచి, చూసి- “ఇంకెవరు? పనిమనిషే అయి ఉంటుంది. దానికి మరీ పొగరెక్కువైంది. దీని కిట్లాకాదు. చెప్తాను. దాన్ని పిలిచి ముందు ఆ పెంకులన్నీ ఏరి బయట పారేయమను. అమ్మా వో ప్లాను ఉంది. ఇప్పుడే దాన్ని అడక్కు.. ముందు పారేయనీ. తర్వాత చెప్తాను దీని సంగతి! ఆహాఁ!” అన్నాడు.
మర్నాడు సాయంత్రం రామ్మూర్తి శేఖరం ఇంటికి రాగా తల్లిదండ్రులిద్దరూ విచారగ్రస్తులై కనిపించారు. ఒకపక్క తల పట్టుకుని కూచుని ఉన్న తండ్రీ, ఇంకో మూల గోడకు జేరబడి ఉన్న తల్లీనూ.
“ఏమయిందండీ?” అన్నాడు ఆత్రుతగా రామ్మూర్తి.
“ఏం చెప్పమంటావోయ్, వాడేమో అట్లా ఉన్నాడు- సంగతేమో యిట్లా. ఉంది” అన్నాడు ముసలాయన.
“ఎట్లా ఉంది?”
“సావిత్రి మన శేఖరం కంటె వో సంవత్సరం పెద్దది బాబూ. పైగా ఆమెకు పెళ్లి నిశ్చయం అయిపోయిందట కూడాను.”
”ఆఁ?” అన్నాడు రామ్మూర్తి.
“ఆఁ!” అన్నాడు తండ్రి.
“ఈ సంగతి చెబుతే నా పసివాడు ఏమైపోతాడు? వాడి మసస్సు ఎంత క్షోభ -పడుతుందో, ఇంత చిన్న వయస్సులోనే వాడికీ కష్టాలెందుకు తీసుకొచ్చావురా నారాయణమూర్తీ’ అన్నది తల్లి.
“ఏ నారాయణమూర్తీ? మా స్నేహితుడేనా?” అన్నాడు రామ్మూర్తి ఆత్రుతగా. “కాదు నాయనా, భగవంతుడు… వో ఏడు కొండలవాడా వెంకటరమణా… మా అబ్బాయిని మళ్లీ మామూలు మనిషిని చెయ్యి…” అని దణ్ణం పెట్టుకుంది.
“నేను చెబుతాను. వాడికి సావిత్రి వంటి మంచి పిల్లను చూడండి. వెంటనే పెళ్లి చేదాం’ అని ‘శేఖర శయనాగారానికి’ దారితీశాడు రామ్మూర్తి.
గదిలోకి వస్తూనే రామ్మూర్తి ప్రారంభించాడు.
“శేఖరం – నువు విచారించకు. నేను చెప్పింది విను. ‘ఎంతవారికి గాని దైవ మలంఘ్యము. ప్రాప్తించిన వ్యసనమునకు బ్రతీకారము విచారింపవలె గాని, రిచ్చపడి యుండ దగదు…’ అని మనం మిత్రలాభములో చదువుకున్నాము. ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు. వచ్చిన కష్టాలను దాట గల్గటమే మానవ లక్షణం. కష్టసుఖాలు కావడి కుండలు. సుఖదుఃఖాలు లేనిదే మానవజన్మ పూర్తికాదు. వెలుగు నీడలవలె ఈ సుఖ దుఃఖాలు మానవ జీవితంలో పగలూ రాత్రులవలె…”
“దేనికయ్యా ఈ ఉపోద్ఘాతం?” అని అరిచాడు శేఖరం.
“నువు లేవకు కూచునే ఉండు. ఏంలేదు… సావిత్రేం పెద్ద రంభ కాదు, ఉర్వశంతకన్నా కాదు, మేనకంతకన్నా కాదు…”
“అనవసరంగా నువు సావిత్రిని…”
“చెప్పింది విను. సావిత్రిని మించినవాళ్లు ఈ లోకంలో లక్షల మంది ఉన్నారు.” “ఉంటే ఉండనీ, అంతమంది నాకెందుకు?”
“మధ్యలో రాకు” అని, రామ్మూర్తి లేచి నెమ్మదిగా నాలుగడుగులు ముందుకు నడిచి ఆగి – కుడిచేతిని కుర్చీమీద ఆనించి గోడవంకే చూస్తూ- ” నువ్వు సావిత్రిని మరిచిపోవాలి శేఖరం’ అన్నాడు గంభీరంగా.
“నేనా- అసంభవం! ఐనా ఏమిటిది? స్నేహితుడివనీ, నాకు న్యాయం చేస్తావనీ, నన్ను ఉద్ధరిస్తావనీ, నా మొరంతా నీకు చెబుతే చివరకు నువ్వనేది ఇదా! వెళ్లు… నీ ముఖం నాకు చూపించకు… కృతఘ్నుడా!!.
“సంగతి విన్రా శేఖరం! సావిత్రి నీకంటే పెద్దదిరా.”
“‘esc!”
“అవున్రా పైగా ఆమెకు పెళ్లి కాబోతోంది. శుభలేఖలు అచ్చేయించేశారు.”
“esc!”
“ఆఁ అందుకనే నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకుందువుగాని.”
“నువ్వే చేసుకో. నాకొద్దు… నాకొద్దు… సావిత్రీ!…” అని శేఖరం ఒక్కసారి గావుకేక పెట్టి దిండుమీద తల బాదుకుని, ఏడవసాగాడు.
ఓ నిముషం ఏడ్చి- ఠపీమని లేచి నించుని “పెద్దయితే ఏం తప్పా! రాముడి కంటె సీత పెద్దది కాదూ, బలరాముడి కంటె రేవతి పెద్దది కాదూ… సునిల్దత్ కంటే నర్గీస్ పెద్దది కాదూ…”
రామ్మూర్తి మాట్లాడలేదు. “మాట్లాడవేం?”
“ఇవన్నీ ఒప్పుకున్నా – శుభలేఖలు వేయించేశారు గదయ్యా!! “అవన్నీ చింపి పారేస్తే సరి!”
రామ్మూర్తి నవ్వాడు. “నువ్వా శుభలేఖలు చింపెయ్యగలవు గాని, ఆ వివాహమనే కాగితాన్ని చింపెయ్యలేవు నాయనా” అన్నాడు.
“ఛీఛీ… ఆడదాన్ని నమ్మరాదు. సావిత్రి నన్ను మోసం చేసింది… నన్ను మోసం చేసింది… మోసంచేసింది… సం చేసింది…. చేసింది…. సింది….” అంటూ కుమిలి కుమిలి దుఃఖించసాగాడు శేఖరం. పక్కనే కూచుని రామ్మూర్తి, శేఖరం వీపుమీద చేత్తో చిచ్చికొడుతూ ఉండగా, తల్లిదండ్రులు ప్రవేశించారు.
“ఎట్లా ఉంది బాబూ” అన్నాడు తండ్రి.
“ష్… కాసేపట్లో నిద్రపోతాడు” అన్నాడు రామ్మూర్తి.
“శబ్దం చెయ్యకుండా వెళ్లిపోవే” అన్నాడు భార్యను.
“నా తండ్రిని నేను చూడొద్దా” అన్నదామె ఏడుపు ఆరంభించబోతూ. “చూద్దురుగాని – టిక్కట్టేం లేదు. ఇప్పుడిక్కడ ఏడవకండి. వాడు బాగానే ఉన్నాడు” అన్నాడు రామ్మూర్తి.
ఆమె వెనకాలే భర్త కూడా వెళ్లిపోయినాడు.
“ పెళ్లి జరిగిపోతోంది- నా సావిత్రికి…నా సావిత్రికి…” అంటూ శుభలేఖ
చూస్తూ ఏడవసాగాడు శేఖరం. సరిగ్గా ఇంకో ఆరేడు నిమిషాల్లో పుస్తె కడతాడు. వాడెవడో, వాడు…వాణ్ణి తన్నాలి…నా సావిత్రిని నాకు కాకుండా చేస్తున్నాడు…”
శేఖరం చెవుల్లో మంగళ వాద్యాలు ఘోషించసాగినై. సావిత్రి పెళ్లి కూతురు ముస్తాబులో వయ్యారంగా కూచుని, మధ్య మధ్య తన భర్తకేసి చూస్తోంది. సావిత్రి వంటి అందగత్తెను పొందబోతున్నందుకు ఆ భర్త మరింత మురిసి పోతున్నాడు…
58
మంగళవాద్యాలు తారాస్థాయిలో వినిపించసాగినై. శేఖరం రెండు చెవులూ మూసుకున్నాడు….ఎట్లా… తన సావిత్రి తనకు కాకుండా పోతోంది… ఈ పెళ్లి జరగాల్సిందేనా… ఏ గాలివానో వచ్చి ఆగిపోరాదూ… దేవుడా! ఐదు నిమిషాల్లో గాలివాన తెప్పించరాదుటయ్యా నీకో నమస్కారం పెట్టుకుంటాను! లేకపోతే, ఉన్నట్టుండి అక్కడికి వెళ్లి సరిగ్గా తాళి కట్టబోతున్న సమయంలో “ఆ పం-డి” అని కేక పెడితే?- పెడితే ఆపుతారు అనుకుందాం. తర్వాత జరిగేది? ఎందుకా పావంటారు.
సావిత్రి నా భార్య అంటాను… అంటే పిచ్చివాడు అని అంతా తనను బయటకు తోసేస్తారు. కుర్ర వెధవలు ‘మజ్నూ మారో’ అని రాళ్లేసి చావగొడతారు!… ఇదేం లాభంలేదు… ఒకవేళ సావిత్రే ఈ పెళ్లి జరగటం ఇష్టంలేక పీటలమీద కూచోకపోతేనో! ఆ పెళ్లి దుస్తులతోనే దొంగతనంగా పారిపోయి ఏ రైలో ఎక్కిపోరాదా, ఆరైలు పెట్టెలో తనే ఉండరాదా! ఆ గదే రైలు పెట్టయింది కాస్సేపు. అందులో సావిత్రీ తనూ. ఆగదే పెద్ద శయనాగారం అయింది… తోట అయింది… పూలవనం ఐంది… ఈలోపల అక్కడ పెళ్లి అయింది! చేతి గడియారం చూసుకుని శుభలేఖ నేల పారేసి భోరుమన్నాడు శేఖరం.
శేఖరం ఆరాత్రి భోజనం చెయ్యలేదు. కాసిని పాలు తాగి పరున్నాడు. రాత్రంతా నిద్ర లేదు. ఆలోచనలు… కలలు… వూహలు… తనువులు వేరైనా మన మనసు లొకటే అన్న కలవరింతలతో తెల్లారింది… లేచి బయటకు వచ్చాడు. వూరంతా దెయ్యాల దిబ్బల్లే ఉన్నది. ఇళ్లన్నీ కూలిపోయి ఉన్నై. చెట్లు చచ్చిపోయాయి. ఎక్కడా గాలి లేదు. అంతటా గాలివాన … నీరు… సముద్రాలు… దిబ్బలు…నదులు…ఎండలు … ప్రవాహాలు… భూమి బీటలువారుట…. రాబందులు… శవాలు… అంతా ఒక ‘అతివాస్తవిక’ చిత్రమై గోచరించింది. ఇక తను చెయ్యాల్సిందేమిటి-చావాలి! అంతే! సావిత్రి లేని ఈ జీవితం తన కెందుకు! వద్దు! అద్దంలో చూసుకున్నాడు. జుట్టు రేపుకున్నాడు… చొక్కా వోమూల చింపుకున్నాడు… కళ్లు తేలవేశాడు… మేడమెట్లు దిగి ఎవరూ చూడకుండా వెళ్లి తోటలో చెట్టు కింద కూచున్నాడు. “హు” అన్నాడు. అది తూచుకుని చూసుకున్నాడు – ఆరు కిలోల బరువుంది. చాలదని మరో “హుఁ” ఇచ్చాడు. అది ఆరు టన్నులుంది! “హుఁ హుఁ హుం హుం హుఁ…” అని నవ్వాడు. క్రింద ఇసుకలో చూపుడు వేలుతో ‘సావిత్రి’ అని రాశాడు… చెరిపాడు… రాశాడు…
శేఖరానికి అక్కడ ప్రశాంతత కనిపించలేదు. మేడెక్కి పళ్ళు తోముకొని, మొహం కడుక్కుని స్నానం అదీ చేశాడు కడుపుకు ఆకలవుతోంది గదా అని దానిక్కాస్త టిఫిన్ పడేశాడు. ఈ బీభత్స జనాభా గలబాల వాతావరణం నుంచి దూరంగా ఎక్కడికన్నా పోవాలి!…
వెళ్లి వెళ్లి, వెళ్లి వెళ్లి, ఊరవతల శ్మశానం చేరుకున్నాడు. ‘ఆఖరికి అందరూ ఇంతేగదా, నేనూ యింతేగదా’ అనుకున్నాడు శ్మశానం అంతా పరికిస్తూ. తను ఎక్కడేనా కూచోవాలి. ఏ చెట్టు కిందేనా ప్రశాంతంగా కూచోవాలి… అన్నట్టు చెట్టు మామూలుగా ఆకులూ, అలములతో వుంటే ఎట్లా? …. ఎండి మోడై ఉండాలి! అంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఒక అతను ఎవరో వస్తూవుంటే అడిగాడు- “ఇక్క డెక్కడయినా ఎండిపోయిన మోడుచెట్టును చూశారా?”
“చూడలేదండీ. ఈ వూళ్లో ఆ చెట్లు లేవుగాని, ఇక్కడికి ఉత్తరదిశగా ఆరు మైళ్ల దూరం పోతే ఒక అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఆ ఆలయానికి దక్షిణ మూలన పెద్ద వనం ఒకటి కనిపిస్తుంది. ఆ వనం లోంచి పోతే తూర్పు పడమరలకు మధ్యగా కాబోలు, వో మోడుచెట్టుండాలని నా అనుమానం. సరేగాని, అగ్గిపెట్టె ఉంటే యిస్తారూ?”
“తీసుకురాలేదండీ.”అతను వెళ్లిపోయాడు.
వెళ్లిపోయిన వెంటనే శేఖరానికి భయం వేసింది. అగ్గిపెట్టె అడిగాడు కదా, దెయ్యం కాదుగద దెయ్యాలే అగ్గిపెట్టెలడుగుతాయి. పైగా ఇది దెయ్యంపేట. శేఖరం వెనక్కు తిరిగి చూడకుండా గబగబా శ్మశానం దాటాడు. చుట్టూ చూశాడు. అన్నీ పచ్చగా ఉన్న చెట్లే కనిపిస్తున్నాయి. కాలంకాని కాలంలో ఈ సావిత్రికి పెళ్లయిందేం ఖర్మ అనుకున్నాడు. కాస్త దూరంలో చిన్న మోడు ఒకటి కనిపించింది. ఏం లాభం-క్రింద కూచోటానికి అంతా బురద! ఒక రాయి ఏదన్నా వేసుకుని కూచుందామని, చుట్టూ ఎంత వెతికినా, దాని దుంపతెగ – ఒక్క రాయీ దొరికి చావలా. ఇంకేం చెయ్యాలి? ఎట్లా తన జీవితం గడపాలి?… మోడుచెట్టు నీడలోన గడపరాని కదపరాని ఈ జీవితం వృధా!… వృధా!…
రాళ్లు కనిపించకపోయినా శేఖరానికి దూరంగా పుల్లలు ఏరుకుంటూ నలుగురు అయిదుగురు కుర్రాళ్లు కనిపించారు. కనిపించటమేమిటి బ్రహ్మాండమైన వూహ మెరిసింది. ‘కుర్రాళ్లూ’ అని పిలిచాడు. వాళ్లొచ్చారు.
“ఇదిగో, ఇక్కడీ చెట్టుంది చూశారా – ఈ చెట్టెక్కి మీరు ఆ ఆకులూ అలమలూ, కొమ్మలూ అన్నీ పీకి పారెయ్యాలి. పారేసి, చెట్టును మోడును చెయ్యాలి.”
“వో” అని వాళ్లంతా చెట్టెక్కారు. చేతి కందిన ఆకులూ, కొమ్మలూ లాగి పారెయ్యసాగారు.
ఇదిగో అబ్బాయిలూ! మరీ ఆ పెద్ద కొమ్మలు విరవకూడదు. ఆకులు మాత్రం అవి అనే ఉన్న చిన్నచిన్న కొమ్మలన్నీ లాగెయ్యండి. ఆఁ… అట్లా… అట్లా…” అంటూ కిందపడ్డ ఆకుల్నీ కొమ్మల్నీ తను దూరంగా విసిరెయ్యసాగాడు.
కాస్సేపటికి వాళ్లు కిందికి దిగి – ” ఐపోయింది. ఒక రూపాయివ్వండి” అన్నారు. శేఖరం యిచ్చేశాడు.
“ఇంకో రూపాయిస్తే ఆ చెట్టు కూడా పీకి పోగు పెడతాం” అని వో కుర్రాడన్నాడు.
“ఇంకొద్దురా నాయనా. వెళ్లండి” అన్నాడు శేఖరం. వాళ్ళు వెళ్లిపోయాక చెట్టు కేసి చూసి గొణుక్కున్నాడు-“వీళ్ల మొహం ఈడ్చా. రూపాయీ పట్టుకుపోయి, అక్కడక్కడ ఆకులుంచేశారే. వూఁ, కానీ- గుడ్డిలో మెల్ల” అని కింద చతికిల బడ్డాడు. సావిత్రి గుర్తొచ్చింది. ‘హుం’ అన్నాడు ఫైనల్ . సావిత్రి పేరు కింద రాశాడు. చెట్టుకు జేరపడ్డాడు. వీపున ఏదో గుచ్చుకుంది. ఈ వెధవ చెట్లు ఒకలా తగలడతాయా అనుకున్నాడు.
“సా…వి…త్రి…’ అన్నాడు గట్టిగా.
దూరంగా నది ప్రవహిస్తోంది. పిట్టలు అరుస్తున్నై. చాకలివాళ్లు గుడ్డలుతికే శబ్దం వినిపిస్తోంది…మోడుచెట్టు కింద శేఖరం కదిలి, కాస్త సర్దుకుని నిట్టూర్చాడు. ‘సావిత్రీ’ అన్నాడు. ఏమిటోలా కనిపించింది. ఎంతసేపని తనిట్లా సావిత్రీ సావిత్రీ అనుకుంటూ కూచోటం! ఇట్లా తను ఒంటరిగా ఈ నిర్జన ప్రదేశంలో సావిత్రీ అంటూ ధ్యానం చేస్తూంటే కొంపదీసి ఆ పాత సావిత్రి ప్రత్యక్షం కాదుగదా! శేఖరానికి చిరాకేసింది. ‘ఇదేం బాలేదు’ అనుకున్నాడు. ఒక ఐడియా తట్టింది. ఇట్లా పగలు కాకుండా, అర్ధరాత్రివేళ, నడిరోడ్డు మధ్య, దీపస్తంభం కింద కూచుని, కుక్కను పట్టుకుని – ‘జగమే మాయా, బ్రతుకే మాయా’ అని పాడితే? అది కొంత బావున్నట్టు తోచింది కాబోలు-శేఖరం లేచి యింటి దారి పట్టాడు!
ఆ మర్నాడు సావిత్రి అత్తవారింటికి పోతూ ఉంటే, వీధి చివరన నించున్న శేఖరం కళ్ళు తుడుచుకుంటూ ‘పయనమయ్యే ప్రియతమ, నను మరచిపోకుమ’ అన్నాడు మాట వరసని. పాట వరసన పాడదాం అనుకుంటూవుంటే, ఎవడో వో బాటసారి ప్రత్యక్షమై అతన్ని నోరు మెదపనివ్వకుండా చేశాడు. సావిత్రి వెళ్లిపోయింది! ఆమెను చూడాలంటే ఆ అత్తవారి వూరేదో కనుక్కుని అక్కడికి పోవాలి… శేఖరం
వెనకాలే వెళదామనుకున్నాడు. వెళ్లి ఏం ప్రయోజనం! ఈ మధ్య దారిలో ఎడారా ఏమన్నానా- ఇద్దరూ ఇసుక తుఫానులో చెయ్యీ చెయ్యీ పట్టుకుని చచ్చేందుకు!
కొన్నాళ్లు గడిచింది. శేఖరం ఎవరితోనూ సరిగ్గా మాట్లాట్టంలేదు అన్నం తినటంలేదు. నిద్రపోవటమూ లేదు. చదువుకు ఏనాడో నామం పెట్టేశాడు. కనీసం పత్రికల్లో ప్రేమ కథలు కూడా చదవటంలేదు! అంతా దిగులు… వ్యథ… జీవితం వృథా! తల్లీ దండ్రీ రామ్మూర్తి అందరూ ఎంతో చెప్పారు. అందరికీ ఒకటే సమాధానం- ‘సావిత్రి’.
“నా బాబుకు ఆ రాక్షసేదో మందు పెట్టింది, లేకపోతే ఇంతగా పిచ్చివాడై పోతాడా! నా బాబును రక్షించు నారాయణమూర్తి” అని అతని తల్లి బావురుమంది.
“నాన్నా! నువు సావిత్రిని మరచిపోరా. ఆమె ఇంకోరి భార్యరా. పైగా నీకంటె పెద్దదిరా” అన్నాడు తండ్రి.
“ఆ సావిత్రిని నా కంటే వో సంవత్సరం ముందుగా ఎందుకు పుట్టించావయ్యా వో బ్రహ్మదేవుడా” అని అరిచాడు శేఖరం.
“నువ్వు అట్లా బెంబేలు పడరాదు శేఖరం! ఐందేదో ఐంది. నువు సంతోషంగా, హాయిగా సుఖంగా ఉండాలి. రా, ఏ సినిమాకో పోదాం” అన్నాడు రామ్మూర్తి.
“హుఁ నా బ్రతుకే ఒక సినిమా. ఇక ఈ జీవితం ఇంతేరా రామ్మూర్తి. నా కింక బ్రతకాలని లేదు…”
“బాబూ” అంది వాళ్లమ్మ.
“నాయనా” అన్నాడు తండ్రి.
“శేఖూ” అన్నాడు రామ్మూర్తి.
కిటికీ దగ్గర నించుని బయటి వాతావరణాన్ని చూడటం తప్ప సమాధానం ఇవ్వలేదు శేఖరం.
ఆ మర్నాడు రామ్మూర్తి, శేఖరం తండ్రీ వాళ్ళంతా కూచుని ఆలోచించి, శేఖరానికి వెంటనే పెళ్ళిచెయ్యాలని తీర్మానించారు. చక్కని పిల్లను చూసి వచ్చారు. శేఖరంతో ఆ మాట అంటే అటువంటి మాట గనక మళ్లీ మాటాడితే మాట దక్కదన్నాడు.
“ఎట్లాగయ్యా రామ్మూర్తీ” అన్నాడు తండ్రి. రామ్మూర్తి గంటసేపు అటూ యిటూ తిరిగి ఆలోచించి తలబద్దలు కొట్టుకుని, వో వూహ పన్నాడు. పన్ని ముసలాయన చెవిలో చెప్పగా ఆయన ముఖం వికసించింది.
“ఒరేయ్ శేఖరం – నీ వ్యవహారం నాకేం నచ్చలేదు. నేను సాక్షాత్తు నీ తండ్రిని. నన్నూ నా మాటనూ ధిక్కరిస్తున్నావు” అన్నాడు కోపంగా.
“నాన్నా”
“నాన్న!… ఇకనుంచి నేన్నీకు నాన్ననూ కాను నువ్వు నాకు కొడుకువూ కావు. నాకు కొడుకు పుట్టనేలేదనుకుంటాను”
“నాన్నా”.
“నాన్న!… నీకు నాన్న కావాలనివుంటే ఈ నాన్న మాట విని పెళ్ళిచేసుకో. లేదా ఈ ఆస్తిలో నీకు దమ్మిడీరాదు.!” అని చరచరా నిష్క్రమించాడు ముసలాయన.
“నాన్నా” అని చేతులు చాచి శేఖరం ఆయన వెనకే వెళ్ళి “నాన్నా” అని గుమ్మంమీద పడి ఏడిచాడు. ఆ వెంటనే శేఖరం విస్తుపోయాడు. తన తండ్రికి ఇంతకోపం రావటం తను ఎప్పుడూ ఎరగడు. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఆయనకు తనమీద ఇంత కోపం వచ్చిందంటే తను అంత కోపం తెప్పించాడన్నమాట. అందువల్ల ఆయన అన్నంత పనీ చేసి తీరాడు. ఈ ఆస్తి తనకు ఇవ్వకపోతే రేప్రొద్దున్న తను దేశదేశాలూ ఎట్లా తిరగటం! ఒంటరిగా ఒక్కడూ సోఫాలో కూర్చుని నృత్యాలు అయిష్టంగా చూచి, వాళ్ళకు డబ్బూ అదీ ఎట్లా ఇవ్వటం! ఈ తండ్రి ఉన్న వాడున్నట్టుండక గట్టి చిక్కు తెచ్చిపెట్టాడే! శేఖరం చాలాసేపు ఆలోచించి, ఒక నిర్ణయం చేసుకున్నాడు. తను ఆ అమ్మాయిని పెళ్లాడేస్తాడు. పెళ్ళాడితే వచ్చిన నష్టం ఏముంది! దానివల్ల తన ఆస్తి తనకు దక్కుతుంది. ఆ పిల్లను ఇంట్లో పడేసి, తను ఎన్ని దేశాలయినా తిరగవచ్చును. అందువల్ల ‘చేసుకుంటాలే’ అని చెప్పదలచుకుని, వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి – “చేసుకుంటాను” అన్నాడు.
“ఏమిటి – ప్రాయశ్చిత్తమా”
“కాదు – ‘పెళ్ళి”
వాళ్ళ నాన్నకి ఆశ్చర్యంవేసి “ఎవర్ని?” అన్నాడు.
“అదే, నువు స్థిరపరిచానన్నావుగా. ఆ అమ్మాయిని”
“ఓహో” అనుకుని “ఆహఁ” అనుకున్నాడు ముసలాయన తలతాటిస్తూ.
“నువు చెప్పిన వూహ దివ్యంగా పని చేసిందయ్యా రామ్మూర్తి. వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. బలే నాటకం ఆడించావు. ఇంద కాఫీ తాగు” అన్నాడు ముసలాయన రామ్మూర్తి రాగా. “థాంక్స్” అన్నాడు రామ్మూర్తి రెంటికీ చెందేట్టు.
ఒక గొప్పింటి అమ్మాయిని, చక్కనిదాన్ని తీసుకొచ్చి కడు వైభవంగా పెళ్ళి చేశారు శేఖరానికి. ఆ వైభవాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే పెళ్ళికొచ్చినవారికి తాంబూలాలు ఇవ్వటానికి మూడు వేల వందల తమలపాకులు ఖర్చయినాయట! పెళ్ళి కూతురు పేరు రత్నం.
“అందంలోనూ, గుణంలోనూ, పేరులోనూ రత్నమే” అన్నది శేఖరం తల్లి. పెళ్ళి జరిగిన మూడు రోజులకు శోభనం ఏర్పాటు చేశారు. సాయంత్రమే గైరు హాజరైపోయాడు పెళ్ళి కుమార్డు! అందరూ నచ్చచెప్పి తీసుకొచ్చారు. ఏదో ఆస్తికోసం అని పెళ్ళి చేసుకుంటే, శోభనం ఏర్పాటుచేసి మా యిద్దర్నీ ఆ గదిలో పెట్టి తాళం వేస్తారుట – అనుకున్నాడు కోపంగా. ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు. “సావిత్రీ…సావిత్రీ” అన్నాడు.
“ఈ బ్రతుకు ఇక దుర్భరంగా రామ్మూర్తి. ఈ అమ్మాయితో నేను కాపురం చెయ్యలేను. ఈ రాత్రితో నా జీవితం ఆఖరు. ఏ బావిలోనో పడిచస్తాను. ఆ రత్నం నాకొద్దు…” “” అని అరిచాడు.
“నీకు దిగులు తగ్గుతుందని పెళ్ళి చేస్తే ఇంకా దిగులు హెచ్చవుతోందేమిట్రా! నువు అధైర్యపడకు. దేవుడిచ్చిన భార్య ఈమె. కాదనకు” అన్నాడు రామ్మూర్తి. అతను ఎంత చెప్పినా శేఖరం వినలేదు. నిజంగానే భోరున ఏడిచాడు.
“వీడు మరీ పిచ్చెత్తిపోతున్నాడండీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకూ ఆ యిల్లాలు ఏం నోచుకుందో!” అన్నాడు విచారంగా రామ్మూర్తి శేఖరం తండ్రితో.
“నన్ను ఇంకేం చెయ్యమన్నావయ్యా?” అన్నాడు ముసలాయన గుడ్లలో నీళ్ళు తిరుగుతూ వుండగా.
పూల పాన్సు మీద శేఖరం దిగులుగా కూచుని వుండగా దేదీప్యమానంగా వెలిగిపోతూ రత్నం గదిలో అడుగుపెట్టింది. ఆమె వంక శేఖరంచూసి “సావిత్రీ’ అంటూ లేచి వచ్చి ‘నువ్వా’ అని, కాస్సేపు అక్కడే నించుని వెళ్ళిపోయాడు. రత్నం మాట్లాడలేదు. అట్లాగే నించునివుంది.
కిటికీ దగ్గర నించుని బయట వెన్నెల చూస్తున్న శేఖరం అమాంతం రత్నం దగ్గరకొచ్చి-
“అమ్మాయ్! నువు అభమూ శుభమూ ఎరుగని దానివి. నా యిష్టం లేకుండా నీకీ పెళ్ళి చేశారు. నా మనస్సంతా ఇంకో అమ్మాయి పైన వుంది. నిన్ను నేను అన్యాయం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చును. ఇటువంటి పాపి బ్రతికేకంటే చావటం మేలు. ఏ బావిలోనో పడి చస్తాను. నావల్ల నీకు అపకారం జరిగినందుకు నన్ను క్షమించు. నాకీ జీవితం ఇంక దుర్భరం… దుర్భరం… భరం…” అంటూ తలుపు తోసుకుని చరచరా బయటకు వెళ్ళిపోయినాడు ! “ఏమండీ” అంటూ రత్నం కూడా తని వెనక పడింది.
కాస్సేపు పోయాక తన కుమార రత్నం, కోడలు రత్నం ఎట్లావున్నారో అని ముసలాయన ఆ ప్రాంతాలకు రాగా, గది తలుపులు బార్లా తీసివున్నై. లోపలకు చూస్తే ఎవరూ లేరు. ‘నాన్నా’ అని పిలిచాడు ఆత్రుతగా. ‘బాబూ’ అన్నాడు ఇంకా ఆత్రంగా. ఈ కేకలకు అతని భార్య కూడా లేచి వచ్చింది.
“ఏమేవ్ – అబ్బాయి కనిపించటంలేదే” అన్నాడు కాళ్ళు తడబడుతూ.
“ఆఁ! నాయనా, నాయనా….” అని ఆమె యిల్లంతా పరుగెత్తసాగింది.
“సాయంత్రం అంతా చచ్చిపోతాననే అంటున్నాట్ట నా తండ్రి. ఏ అఘాయిత్యం చేశాడో!” అని ముసలాయన భోరు భోరున ఏడుస్తూ పెరటి తలుపులు తీసివుండటం గమనించాడు. ‘వాడితోపాటు ఇదీ బావిలో దూకిందా భగవంతుడా’ అని ఆత్రుతగా పెరటి గుమ్మ దాటబోయి టక్కున ఆగాడు.
బావి దగ్గరగావున్న కొబ్బరి చెట్టుకింద, చందమామ వెలుగులో శేఖరం గుండెలమీద జేరబడి రత్నం చందమామను చూస్తోంది. ఆమె మెడలో రెండు చేతులూ వేసి, దగ్గరగా లాక్కుంటూ “నువ్వుండగా ఆ చందమామ అనవసరం రత్నం’ అన్నాడు శేఖరం.
ఈ దృశ్యం చూసిన ముసలాయనకు వూపిరి ఆడలేదు. కలా, నిజమా అనుకుంటూవుంటే రత్నాన్ని తన వేపుకు తిప్పుకుని ఆమె గడ్డంకింద చెయ్యిపెట్టి, శేఖరం తన ముఖం దగ్గరకు లాక్కుంటూవుండగా ముసలాయన సిగ్గుపడిపోయి, చట్టున వెనక్కు తిరిగాడు. అప్పుడే అక్కడికివచ్చి ఈ దృశ్యంచూసి విస్తుపోతున్న అతని భార్య కనిపించింది. “నరుసూ” అని ఠపీమని ఆమెను కావలించుకున్నాడు సలాయన అమిత గాఢంగా.
Click here for All Ravi Kondala Rao Hasya Kathalu







