కాంగ్రెస్-ఎంఐఎం మధ్య కోట నీలిమ గొడవ!
కాంగ్రెస్, ఎంఐఎం మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసినట్లుగా చెప్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామం కేవలం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధంగానే కాకుండా, ఇరు పార్టీల భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం రాజకీయ కార్యకలాపాలను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా విమర్శించారు. దీనికి ప్రతిస్పందించే క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ, నేరుగా పవన్ ఖేరా రాజకీయ విమర్శలకు బదులివ్వకుండా, ఆయన సతీమణి కోట నీలిమను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు వారి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళా నేతలను ప్రస్తావించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఒక మహిళా నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనైతికమని, ఇది దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కోట నీలిమకు ప్రజా జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గళం ఉన్నాయని, పవన్ ఖేరా విమర్శలకు సమాధానం చెప్పాలనుకుంటే నేరుగా ఆయనతోనే తలపడాలి తప్ప మహిళను కించపరిచేలా మాట్లాడటం తగదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఒవైసీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్ సైఫుల్లా నేతృత్వంలో పాతబస్తీలోని లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మహిళల గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఒవైసీ క్షమాపణ చెప్పకపోతే ఈ ఆందోళనలను ఎంఐఎం ప్రధాన కార్యాలయం ‘దారుస్సలాం’ వరకు విస్తరిస్తామని సైఫుల్లా హెచ్చరించారు. అంతేకాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్నగర్ నుంచి పోటీ చేసిన కోట నీలిమ డిపాజిట్ కోల్పోయారంటూ ఒవైసీ చేసిన వాదనను సైఫుల్లా తప్పుబట్టారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 22,492 ఓట్లు (17.54 శాతం) వచ్చాయని, డిపాజిట్ దక్కించుకోవడానికి అవసరమైన ఆరో వంతు కంటే ఎక్కువ ఓట్లే ఆమె సాధించారని గణాంకాలతో సహా వివరించారు. ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర స్థాయిలో ఎంఐఎంతో మైత్రి కొనసాగిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో.., గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరు పార్టీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మైనారిటీ ఓట్ల చీలిక విషయంలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాతీయ స్థాయి విమర్శల సెగ హైదరాబాద్ స్థానిక రాజకీయాలకు తాకింది.
పాతబస్తీలో అడుగుపెట్టి, ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా హైదరాబాద్ కాంగ్రెస్ నాయకత్వం తమ పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. మహిళా గౌరవం అనే సున్నితమైన అంశాన్ని ఆయుధంగా చేసుకుని ఎంఐఎంను ఆత్మరక్షణలో పడేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం సద్దుమణుగుతుందా లేక హైదరాబాద్ నగర రాజకీయాల్లో కొత్త ఘర్షణలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.







