ద్విముఖ పోరా? త్రిముఖ సమరమా?
తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా సంస్థ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి అసలు ఉనికే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసలైన పోటీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్తోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న ప్రచారానికి చెక్ పెట్టడమే రేవంత్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే బీజేపీ డిపాజిట్ కోల్పోవడాన్ని ఆయన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. బీజేపీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమని పేర్కొనడం ద్వారా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్లకుండా అడ్డుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.
అమిత్ షాకు దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసి గెలవాలి అని రేవంత్ సవాల్ విసరడం ద్వారా, బీజేపీ-ఎంఐఎం మధ్య ఉన్నది కేవలం మతపరమైన ఓట్ల రాజకీయమే తప్ప, నిజమైన పోటీ కాదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తద్వారా మైనారిటీ ఓట్లు కాంగ్రెస్కు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ను కొనసాగిస్తున్నాం, లేకుంటే ఎప్పుడో ఖాళీ చేసేవాళ్లం అని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. బీఆర్ఎస్ బలహీనపడితే, ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బీఆర్ఎస్నే ప్రధాన ప్రత్యర్థిగా చూపుతూ, పోరును కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మలచాలని రేవంత్ వ్యూహరచన చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అని బలంగా వాదిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణను ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ‘ఏటీఎం’గా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాధించిన విజయాల పరంపర తెలంగాణలోనూ కొనసాగుతుందని అమిత్ షా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమవైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోనే తెలంగాణకు స్వచ్ఛమైన పాలన సాధ్యమని ఆయన నొక్కి చెబుతున్నారు.
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ తమను తాము ప్రధాన పోటీదారులుగా చెప్పుకుంటున్న తరుణంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గట్టిగానే స్పందించారు. రేవంత్ రెడ్డిని ‘వన్-టైమ్ వండర్’గా అభివర్ణించిన కేటీఆర్, తెలంగాణ ప్రజలకు అమిత్ షా అవసరం లేదని, కేసీఆరే బాద్షా అని కౌంటర్ ఇచ్చారు. 2028లో తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మొత్తానికి తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మూడు ప్రధాన పార్టీలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, గత పదేళ్ల పాలనా అనుభవం ఉన్న బీఆర్ఎస్ను తక్కువ అంచనా వేయలేమని కాంగ్రెస్ భావిస్తుండగా, జాతీయ స్థాయి నాయకత్వం, మోదీ చరిష్మాతో తెలంగాణ కోటను బద్దలు కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్లుగా పోరు ద్విముఖంగా మారుతుందా, లేక అమిత్ షా ఆశిస్తున్నట్లుగా బీజేపీ పుంజుకుని త్రిముఖ సమరానికి దారితీస్తుందా అన్నది రాబోయే కాలంలో ఆయా పార్టీలు అనుసరించే క్షేత్రస్థాయి కార్యాచరణపైనే ఆధారపడి ఉంటుంది.







