బ్రిటన్ సీక్రెట్ ఆపరేషన్: వేలాది రిఫ్రిజిరేటర్లను ఇంటర్నెట్ నుంచి తొలగించిన అధికారులు
అర్ధరాత్రి సమయం.. బ్రిటన్‌లోని పెద్ద సూపర్ మార్కెట్లలో తెరవెనుక ఏదో జరుగుతోంది. ఐటీ నిపుణుల ఫోన్లు నిరంతరం మోగుతున్నాయి. కంప్యూటర్ స్క్రీన్ల ముందు అధికారులు ఉత్కంఠగా పనిచేస్తున్నారు. ఒక్కో పరికరాన్ని గుర్తించి ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల సిబ్బంది స్వయంగా కేబుళ్లు పీకేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రమాదం ముంచుకొస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
బయట ప్రపంచానికి మాత్రం ఈ హడావుడి గురించి ఏమీ తెలియదు. సూపర్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. కానీ తెరవెనుక ఓ భారీ రహస్య ఆపరేషన్ నడుస్తోంది. ఇంతకీ అధికారులు దేని కోసం వేలాది పరికరాలను డిస్కనెక్ట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచో దాడికి సిద్ధమవుతున్న ఆ కనిపించని శత్రువు ఎవరు?
ఇక్కడే అసలు ట్విస్ట్! హ్యాకర్ల లక్ష్యం కంప్యూటర్లు కాదు.. బ్యాంకులు కాదు.. ప్రభుత్వ సర్వర్లు అంతకంటే కాదు! మనం నిత్యం ఉపయోగించే ఫ్రిజ్జులు.
యూరప్‌లో మొదలైన కలకలం.. ఫ్రిజ్జుల్లో వేడెక్కిన పరిస్థితి!
ఈ కథ బ్రిటన్‌లో మొదలుకాలేదు. యూరప్‌లోని పలు దేశాల్లో ఇప్పటికే ఇలాంటి సైబర్ దాడులు కలకలం రేపాయి. ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని కొన్ని సైనిక స్థావరాల్లో ఫ్రిజ్జులు ప్రభావితమయ్యాయి. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లోని వందలాది సూపర్ మార్కెట్లు, ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలపై దాడులు జరిగాయి.
నవంబర్ 1, 2 తేదీల్లో మరోసారి ఏడు యూరోపియన్ దేశాల్లోని సూపర్ మార్కెట్లు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా బెల్జియం, లక్సెంబర్గ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫ్రాన్స్‌లోని కొన్ని రక్తనిధి కేంద్రాలు కూడా ఈ దాడుల బారిన పడ్డాయి.
హ్యాకర్లు ఇంటర్నెట్కు అనుసంధానమైన ఫ్రిజ్జుల ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థల్లోకి చొరబడి సెట్టింగులను మార్చేస్తున్నారు. దీంతో చల్లగా ఉండాల్సిన ఫ్రిజ్జులు వేడెక్కిపోతున్నాయి. లోపల నిల్వ చేసిన ఆహార పదార్థాలు పాడవుతున్నాయి.
యూరప్‌లోని కొన్ని ఫ్రిజ్జుల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 80 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. స్వీడన్‌లోని ఓ సూపర్ మార్కెట్లోనూ ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు చేరుకున్నాయి.
బ్రిటన్‌లోనూ అదే ప్రమాదం పొంచి ఉందని గుర్తింపు
యూరప్‌లో దాడులు జరుగుతున్న సమయంలో బ్రిటన్ తొలుత తాము సురక్షితంగానే ఉన్నామని భావించింది. అక్కడ ఉపయోగించే రిఫ్రిజిరేషన్ పరికరాలు ఇతర దేశాల్లోని వాటికి భిన్నంగా ఉండటంతో ప్రమాదం లేదనుకుంది. కానీ అక్టోబర్ చివర్లో మరో భద్రతా లోపం బయటపడింది.
బ్రిటన్‌లో విస్తృతంగా ఉపయోగించే RDM కంట్రోలర్లలోనూ హ్యాకర్లు ప్రవేశించే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. గ్లాస్గోకు చెందిన రిసోర్స్ డేటా మేనేజ్మెంట్ (RDM) తయారు చేసే ఈ పరికరాలు సూపర్ మార్కెట్లు, గిడ్డంగులు, హోటళ్లలో ఫ్రిజ్జుల ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి.
ఒక పాస్వర్డ్ బలహీనత.. వేలాది ఫ్రిజ్జులకు ముప్పు!
ఒమేగా సొల్యూషన్స్‌కు చెందిన నీల్ మెక్‌కోర్ట్ ఈ భద్రతా లోపాన్ని గుర్తించారు. అనంతరం పెన్ టెస్ట్ పార్ట్నర్స్ నిపుణులు పరిశోధించి సమస్యను నిర్ధారించారు.
ముఖ్యంగా బలహీనమైన పాస్‌వర్డ్‌ల సమస్య ఉన్నట్లు వెల్లడైంది. గతంలో యూరప్‌లో దాడులకు గురైన డాన్‌ఫాస్ కంట్రోలర్లలోనూ ఇలాంటి లోపాలే ఉండటంతో ఆందోళన పెరిగింది.
పెన్ టెస్ట్ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు కెన్ మున్రో మాట్లాడుతూ, హ్యాకర్లు ఈ బలహీనతలను గుర్తిస్తే దాడులకు దిగడానికి కొన్ని రోజులే పట్టవచ్చని హెచ్చరించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అసలు సీక్రెట్ ఆపరేషన్ అప్పుడే మొదలైంది!
ప్రమాదం తీవ్రతను గుర్తించిన బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC), పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల శాఖ (Defra), ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (FSA) కలిసి రహస్య ఆపరేషన్ చేపట్టాయి.
ప్రమాదంలో ఉన్న వ్యాపార సంస్థలను సంప్రదించి వెంటనే భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించాయి. మరోవైపు ప్రముఖ సూపర్ మార్కెట్లు తమ ఐటీ బృందాలను ప్రత్యేకంగా ఈ పనికి కేటాయించాయి.
ఇవి కూడా చదవండి
వేలాది కంట్రోలింగ్ పరికరాలను పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి తొలగించారు. కొన్ని చోట్ల రిమోట్‌గా కనెక్షన్లు కట్ చేయగా, మరికొన్ని చోట్ల సిబ్బందే స్వయంగా ఇంటర్నెట్ కేబుళ్లు తొలగించారు. ఫ్రిజ్జుల ఉష్ణోగ్రతలను మాన్యువల్‌గా తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఓ ప్రముఖ రిటైల్ సంస్థ ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం, వారం రోజుల పాటు ప్రతిరోజూ వందలాది పరికరాలను ఇంటర్నెట్ నుంచి తొలగించారు. సూపర్ మార్కెట్లతో పాటు పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ చైన్లు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలనూ ఈ ఆపరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
ఒకవేళ హ్యాకర్లు ముందుగానే దాడి చేసి ఉంటే లక్షల పౌండ్ల విలువైన ఆహార నిల్వలు పాడయ్యేవని ఓ రిటైల్ సంస్థ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండేదని వివరించారు.
తయారీ సంస్థ మాత్రం ప్రమాదం అంత తీవ్రం కాదంటోంది!
మరోవైపు RDM సంస్థ ఈ భద్రతా లోపాల తీవ్రతపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. సాధారణ పరీక్షల కంటే విస్తృతమైన పరీక్షల్లో ఈ సమస్య బయటపడిందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెడ్ ఎవాన్స్ తెలిపారు.
సమస్యను పరిష్కరించేందుకు తొలి సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేశామని RDM వెల్లడించింది. తమ కంట్రోలర్లపై ఎలాంటి హానికరమైన దాడులు జరిగినట్లు ఆధారాలు లేవని కూడా స్పష్టం చేసింది.
ఫ్రిజ్జుల తర్వాత విద్యుత్, నీటి వ్యవస్థలపైనా హ్యాకర్ల కన్ను?
ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. ఫ్రిజ్జులనే హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటే, రేపు విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థల పరిస్థితి ఏమిటి? సైబర్ నిపుణుడు కెన్ మున్రో ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రిటన్‌లోని కొన్ని కీలక మౌలిక సదుపాయాలు ఇప్పటికీ 40 నుంచి 60 ఏళ్ల నాటి సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. వాటిలో భద్రతా లోపాలు ఉంటే హ్యాకర్లు సులభంగా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అందుకే బ్రిటన్ భద్రతా సంస్థలు ఆహార, రిటైల్ రంగాల్లోని ఇతర సాంకేతిక వ్యవస్థలపైనా దృష్టి సారించాయి. చిన్న వ్యాపార సంస్థలను కూడా అప్రమత్తం చేస్తున్నాయి. మరోవైపు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో మూడు రోజులపాటు సరిపడా నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
బ్రిటన్‌లో జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ ప్రపంచ దేశాలన్నింటికీ ఓ హెచ్చరిక. సైబర్ యుద్ధం ఇప్పుడు మన వంటగది వరకూ వచ్చేసింది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







