ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పు..!
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించడంతో పాటు పోలింగ్ సిబ్బంది నియామక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, విలీనానికి అనుమతిస్తూ ఆదివారం (నవంబర్ 22న) కొత్త మార్గదర్శకాలను (సర్క్యులర్ నంబర్ 1953/SEC-B2/2026) జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
ఈ నూతన నిబంధనల ప్రకారం, ఏదైనా గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమై, కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామాల్లో పక్కపక్కనే ఉన్న పోలింగ్ కేంద్రాలను విలీనం చేసుకునేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ అనుమతి ఇచ్చింది. వార్డులకు ఎన్నికలు లేనప్పుడు ప్రతి వార్డుకు విడివిడిగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల అనవసర ఖర్చు, సిబ్బంది అవసరం పెరుగుతోందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇలా విలీనం చేసిన తర్వాత ఒకే పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 650 మందికి మించరాదని ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధన విధించింది.
అలాగే, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేవలం ఒకే ప్రాంగణంలో లేదా ఒకే భవనంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను మాత్రమే విలీనం చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను విలీనం చేయకూడదని సూచించింది. విలీనం తర్వాత పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే పోలింగ్ సిబ్బందిని, అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 26న తొలి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఆయా తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.







