యలహంక ఆస్తి వివాదంలో కీలక మలుపు.. షర్మిలకు కోర్టు షాక్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య కొనసాగుతున్న ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య బెంగళూరులోని యలహంక నివాసానికి సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్పద ఆస్తిలోకి షర్మిల ప్రవేశించకుండా బెంగళూరులోని దేవనహళ్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Silicon Builders Private Limited) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. యలహంకలోని కట్టిగెనహళ్లి గ్రామంలో ఉన్న ఆస్తిని తాము చాలా సంవత్సరాలుగా లీజుకు తీసుకుని వినియోగిస్తున్నామని సంస్థ కోర్టుకు తెలిపింది. 2007 మార్చి 1న ఈసీ సుగుణమ్మ (E.C. Sugunamma)తో లీజు ఒప్పందం చేసుకున్నామని, 2027 ఫిబ్రవరి 28 వరకు ఆ ఒప్పందం అమల్లో ఉంటుందని పేర్కొంది.
ఆస్తి తమ ఆధీనంలోనే ఉందని నిరూపించేందుకు సంస్థ లీజు ఒప్పంద పత్రాలు, అద్దె చెల్లింపుల వివరాలు, విద్యుత్ బిల్లులు, భద్రత, నిర్వహణకు సంబంధించిన పత్రాలను న్యాయస్థానానికి సమర్పించింది. అక్కడ గెస్ట్ హౌస్లు, వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు, ఇతర నిర్మాణాల నిర్వహణకు తాము ఖర్చు చేస్తున్నామని వివరించింది. షర్మిల తరఫున కొందరు వ్యక్తులు ఆస్తిలోకి వచ్చి తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని కూడా ఆరోపించింది.
ఇవి కూడా చదవండి
ఈ వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం సంస్థకు ప్రాథమికంగా స్వాధీన హక్కు ఉందని భావించింది. ముందుగా షర్మిలకు నోటీసులు ఇచ్చి నిర్ణయం తీసుకునేలోపు పిటిషన్ ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంటూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ప్రతినిధులు, ఏజెంట్లు, ఆమె తరఫున వ్యవహరించే ఇతరులు ఆస్తి స్వాధీనంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అక్కడి నిర్మాణాలు, కంచెలు, మొక్కలు, ఇతర ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆదేశించింది.
ఈ వివాదానికి మరో నేపథ్యం కూడా ఉంది. షర్మిల తన కుమార్తె అంజలి (Anjili) వివాహాన్ని యలహంకలోని నివాసంలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే అక్కడ పెద్ద సంఖ్యలో అతిథులు రావడం వల్ల భద్రత, గోప్యతకు ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వివాహ వేదికను మార్చాలని కుటుంబం నిర్ణయించింది.
మరోవైపు, ఈ ఆస్తిపై తనకు, తన పిల్లలకు హక్కులు ఉన్నాయని షర్మిల గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆస్తి యాజమాన్యంపై తుది నిర్ణయం కాదు. సంస్థ స్వాధీనానికి తాత్కాలిక రక్షణ కల్పించే ఆదేశాలు మాత్రమే. ఈ కేసులో షర్మిల తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంది. తదుపరి విచారణను డిసెంబర్ 19, 2026కు వాయిదా వేశారు. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.







