ఎడిసన్‌లో తానా థ్యాంక్స్‌గివింగ్ కార్యక్రమం – వందలాది స్థానిక కుటుంబాలకు ఆహార సాయం
థ్యాంక్స్‌గివింగ్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ బృందం శనివారం ఎడిసన్‌లోని ‘హ్యాండ్స్ ఆఫ్ హోప్’ కేంద్రంలో వందలాది స్థానిక కుటుంబాలకు ఆహార సామగ్రిని పంపిణీ చేసింది.
అమెరికన్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలిసి థ్యాంక్స్‌గివింగ్ విందు చేసుకునేందుకు వీలుగా, ఆ విందులో ప్రధాన వంటకమైన టర్కీతో పాటు చికెన్, నిత్యావసర సరుకులను అందజేశారు. ఒక్కో ఆహార కిట్ విలువ సుమారు 100 డాలర్లు. కార్యక్రమానికి వచ్చిన వారికి వేడి భోజనాలు కూడా అందించారు.
ఎడిసన్ హైస్కూల్, సౌత్ బ్రన్స్విక్ హైస్కూల్‌లకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఆహార కిట్లు, భోజనాల పంపిణీలో సహకరించారు. తానా యువ వాలంటీర్లు అనిత్ రాంపురం, వంశీ చంద్ నరేపలేపు హైస్కూల్ విద్యార్థులను సమన్వయం చేశారు.
ఇవి కూడా చదవండి
తానా న్యూజెర్సీ బృందం స్థానిక ప్రజలకు అండగా నిలిచేందుకు పలు సేవా కార్యక్రమాలను చేపడుతోంది. విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి అందించడం, ఆహార సహాయం అవసరమైన కుటుంబాలకు సరుకులు, భోజనాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక సంఘాలు చేపట్టే కార్యక్రమాల్లోనూ తానా వాలంటీర్లు పాల్గొని నిర్వహణలో తోడ్పడుతున్నారు. స్థానిక ప్రజలకు తానా అందిస్తున్న ఈ సేవలను ఎడిసన్ స్థానిక నాయకులు, న్యూజెర్సీ రాష్ట్ర నాయకులు ప్రశంసించారు.
కార్యక్రమ నిర్వహణలో తానా కోశాధికారి రాజా కాసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నరేపలుపు, యువజన సమన్వయకర్త శ్రీనివాస్ చెరుకూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక సహకరించారు. ప్రవీణ్ రెడ్డి కల్వకొల్లు, రవి మాచర్ల కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. సుధీర్ రాంపురం, హరీష్ కోయ, సుందర్ గోపీనాథ్, సతీష్ మాక, మూర్తి వాలంటీర్లుగా పాల్గొని పంపిణీలో సహకరించారు.

థ్యాంక్స్‌గివింగ్ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా న్యూజెర్సీ బృందానికి తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు అభినందనలు తెలిపారు.
తెలుగు సమాజం స్థానిక అమెరికన్ సమాజంతో మమేకమై, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలన్నది తానా లక్ష్యం. తెలుగు పిల్లలు, యువత చిన్ననాటి నుంచే తాము నివసించే ప్రాంతంలోని ప్రజలతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా తానా ప్రోత్సహిస్తోంది.







