వచ్చే నెలలో వరంగల్ కు ప్రధాని మోడీ!
దక్షిణాదిలో తన కంచుకోటను మరింత విస్తరించుకోవాలని చూస్తున్న బీజేపీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు దీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కమలదళం అగ్రనాయకత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయి నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తుండటం, సంస్థాగత సమీక్షలు నిర్వహించడం చూస్తుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ రాజకీయ వేడిని మరింత పెంచుతూ, వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించబోతున్నారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ వేదికగా బీజేపీ తన రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించనుంది. డిసెంబర్లో ప్రధాని మోదీ వరంగల్ పర్యటన దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దశాబ్దాల నాటి కలను నిజం చేస్తూ చారిత్రక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ విమానాశ్రయం, వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారి వంటి కీలక ప్రాజెక్టులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. అభివృద్ధి అంటేనే బీజేపీ అనే నినాదాన్ని ప్రజల్లో నాటాలని కమలనాథులు భావిస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న మౌలిక సదుపాయాల నిధులను ఒక బలమైన అస్త్రంగా మార్చి ఓటర్లను ఆకట్టుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న విపక్షాల ఆరోపణలకు గణాంకాలతోనే సమాధానం చెప్పాలని బీజేపీ సిద్ధమైంది. రాష్ట్రంలో సుమారు రూ. 60,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 2,700 కోట్లతో నిర్మిస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, మహబూబ్నగర్- చించోళి, కల్వకుర్తి- కొల్లాపూర్ రహదారులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్నాయని వివరిస్తున్నారు. మరోవైపు రైల్వే రంగంలోనూ రూ. 83,543 కోట్ల అంచనా వ్యయంతో 30 ప్రాజెక్టులు మంజూరయ్యాయని, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 2,015 కోట్లతో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని బీజేపీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నాయి. ముఖ్యంగా రూ. 720 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను తమ విజయంగా చూపుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రధాని పర్యటన ద్వారా వచ్చే రాజకీయ ఊపును రాబోయే ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇటీవలే రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశిష్ షెలార్, సహ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ వంటి అగ్రనేతలు హైదరాబాద్లో సుడిగాలి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు 300 మంది డివిజన్ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్లతో ప్రత్యేకంగా భేటీ అయి, బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయాలని ఆదేశించారు. రాజధానిలోని మూడు కార్పొరేషన్లలోనూ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి ఓవైపు కేంద్ర నిధులు, భారీ ప్రాజెక్టులతో అభివృద్ధి మంత్రం జపిస్తూనే, మరోవైపు జాతీయ నేతల వరుస పర్యటనలతో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.







