‘దీక్షా దివస్’ ఘనంగా నిర్వహించాలి: మహేశ్ బిగాల
తెలంగాణ అమరుల త్యాగాలను , ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ‘దీక్షా దివస్’ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నవంబర్ 21, 2026న వివిధ దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులతో జూమ్ ద్వారా అంతర్జాతీయ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దీక్షా దివస్ సందర్భంగా సభలు, సమావేశాలతో పాటు రక్తదాన శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని మహేశ్ బిగాల సూచించారు. ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, వీడియో సందేశాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రవాసులందరినీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కోరారు. అలాగే వివిధ దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ గడ్డపై పార్టీ మరోసారి విజయకేతనం ఎగురవేయబోతోందని మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులకు పార్టీ నాయకత్వాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో కేటీఆర్ విదేశీ పర్యటనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నారై ప్రతినిధులందరూ ఐక్యంగా పనిచేస్తూ దీక్షా దివస్ను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.







